- వైఎస్సార్‌సీపీ బంద్ విజయవంతం
- మార్మోగిన సమైక్య నినాదం
- జిల్లా అంతటా ర్యాలీలు, రాస్తారోకోలు, మానవహారాలు
సాక్షి, మచిలీపట్నం : కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించేందుకు ఏకపక్షంగా చేస్తున్న ప్రయత్నాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసనాగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరక ు ఆ పార్టీ శ్రేణులు శుక్రవారం జిల్లాలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తల నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా బంద్ నిర్వహించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఏపీ ఎన్జీవోలు, అక్కడక్కడ టీడీపీ నేతలు కూడా ఆందోళనలు నిర్వహించారు.
బస్సుల నిలిపివేత... ఒంటికాలిపై నిరసన
జగ్గయ్యపేటలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో బంద్ విజయవంతమైంది. స్థానిక ఆర్టీసీ డిపో గేటు వద్ద భాను నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఆందోళన చేసి బస్సులను నిలిపివేశారు. అనంతరం మానవహారం, ర్యాలీలు నిర్వహించారు. అవనిగడ్డ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త సింహాద్రి రమేష్ ఆధ్వర్యంలో అవనిగడ్డ, చల్లపల్లి, నాగాయలంక బంద్ చేపట్టారు. అవనిగడ్డలో సింహాద్రి రమేష్, యాసం చిట్టిబాబు తదితరులు ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. మోపిదేవిలో వైఎస్సార్‌సీపీ నాయకులు రాస్తారోకో చేశారు. చల్లపల్లిలో టీడీపీ ఎమ్మెల్యే అంబటి శ్రీహరిప్రసాద్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిపారు. ఏపీఎన్జీవో నాయకులు బంద్, నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
జాతీయరహదారిపై ధర్నా...
కైకలూరులో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బంద్ జరిగింది. ఆయన ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు షాపులు మూయించి జాతీయ రహదారిపై ధర్నా చేశారు. కైకలూరు టీడీపీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ ఆధ్వర్యంలో సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. గుడివాడలో నిర్వహించిన బంద్‌లో వైఎస్సార్‌సీపీ నాయకులు మరీదు కృష్ణమూర్తి, మండలి హనుమంతరావు, లోయ రాజేష్ పాల్గొన్నారు. పెడన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ ఆధ్వర్యంలో బంద్ జరిగింది. పెడనలో పోస్టాఫీసు, బ్యాంకులు, పాఠశాలలు మూతపడ్డాయి.
యూపీఏ దిష్టిబొమ్మ దహనం...
నూజివీడులో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో బంద్ జరిగింది. పట్టణంలో బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు. నూజివీడు బస్టాండ్ సెంటర్ నుంచి చిన గాంధీ బొమ్మ సెంటర్ వరకు పాదయాత్ర చేసి యూపీఏ దిష్టిబొమ్మ దహనం చేశారు. న్యాయవాదులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు మేకా ప్రతాప్ సంఘీభావం తెలిపారు. తిరువూరులో బంద్ సందర్భంగా విద్యా సంస్థలు మూతపడ్డాయి. మైలవరంలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, తాజా మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. పట్టణంలో పాదయాత్ర చేశారు.
నూజివీడు రోడ్డులో మహాత్మాగాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి బోసుబొమ్మ సెంటర్‌లో విద్యార్థులతో కలిసి జోగి రమేష్ మానవహారం నిర్వహించారు. నందిగామలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మొండితోక జగన్మోహనరావు ఆధ్వర్యంలో బంద్ జరిగింది. ర్యాలీ, రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించారు. పామర్రులో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పులేటి కల్పన ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. షాపులు మూయించివేసి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. పెనమలూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త పడమట సురేష్‌బాబు ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు.
ఎంపీ కోసం ప్రత్యేక పూజలు..
మచిలీపట్నం ఎంపీ కొనకొళ్ల నారాయణరావు లోక్‌సభలో గుండెపోటుకు గురైన నేపథ్యంలో టీడీపీ ఆధ్వర్యంలో మచిలీపట్నంలో బంద్ నిర్వహించారు. మెరుగైన వైద్యం కోసం ఆయన్ని ముంబైకి తరలించడంతో టీడీపీ శ్రేణులు ఆలయాల్లో పూజలు చేశారు.