పేద ప్రజల కడుపు నింపేందుకు ఉద్దేశించిన సబ్సిడీ బియ్యం పథకం లక్ష్యం తప్పి, పెద్దల జేబు నింపే కార్యక్రమంగా మారింది.
కళ్యాణదుర్గం, న్యూస్‌లైన్: పేద ప్రజల కడుపు నింపేందుకు ఉద్దేశించిన సబ్సిడీ బియ్యం పథకం లక్ష్యం తప్పి, పెద్దల జేబు నింపే కార్యక్రమంగా మారింది. నెల రోజుల వ్యవధిలో కళ్యాణదుర్గం నియోజకవర్గం పరిధిలో 692 బస్తాల బియ్యం పట్టుబడడమే ఇందుకు నిదర్శనం. వివరాలిలా ఉన్నాయి.
జనవరి 21న కంబదూరు మండలంలో విజిలెన్స్ ఎస్పీ దాడులు నిర్వహించి కర్ణాటకకు తరలుతున్న 115.50 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేసి, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 27న 44 బస్తాలు ఫిబ్రవరి 9న కళ్యాణదుర్గం మండలం నారాయణపురం నుంచి కర్ణాటకకు తరలుతున్న 52 బస్తాలు పట్టుబడ్డాయి, తహశీల్దార్ మహబూబ్ బాషా నిర్వహించిన దాడుల్లో నారాయణపురంలో 10, ఎర్రంపల్లిలో 44 బస్తాలు పట్టుబడ్డాయి. ఈ మధ్య కాలంలోనే బోరంపల్లి వద్ద టస్కర్ వాహనంలో తరలుతున్న 307 బస్తాలు అధికారులకు పట్టుబడ్డాయి.
కాంగ్రెస్, టీడీపీ నేతలే సూత్రధారులు
ఈ వ్యవహారమంతటికీ జిల్లాలోని ఓ మంత్రికి అనుచరుడైన వ్యక్తి, ఉరవకొండ ఎమ్మెల్యే అనుచరులు ప్రధాన సూత్రధారులుగా ఉన్నట్లు తెలుస్తోంది. సబ్సిడీ బియ్యం అక్రమ రవాణాకృు వీరే ప్రధాన సూత్రధారులని తెలిసినా, రాజకీయ ఒత్తిళ్లకు భయపడో, మామూళ్లకు అలవాటుపడినందునో అధికారులు వారిపై కేసులు నామమాత్రంగా నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. గతంలో బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తూ మంత్రి అనుచరుడు కళ్యాణదుర్గం తహశీల్దార్ మహబూబ్ బాషాకు పట్టుబడినా, అతనిపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. విజిలెన్స్ ఎస్పీ స్వాధీనం చేసుకున్న బియ్యం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అనుచరునికి చెందినవని తేలడంతో, బినామీలపై కేసు నమోదు చేసి అసలు వ్యక్తులను తప్పించినట్లు తెలిసింది. నారాయణపురం నుంచి కర్ణాటకకు తరలిస్తూ పట్టుబడిన కేసులో సూత్రధారి అయిన కాంగ్రెస్ నాయకునిపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
దసరా పండుగకు ముందు స్థానిక గాంధీ సర్కిల్‌లోని ఓ దుకాణంలో చౌక బియ్యాన్ని మామూలు సంచుల్లోకి మారుస్తుండగా దాడులు చేసిన అధికారులు, ఆ వ్యాపారి ఇచ్చిన ముడుపులు తీసుకోవడం వల్లే కేసు నమోదు చేయలేదని సమాచారం.
కర్ణాటకకు తరలుతున్న బియ్యం
ఉరవకొండ, కళ్యాణదుర్గం, కంబదూరు స్టాక్ పాయింట్ల పరిధిలో ఉన్న చౌకధాన్యపు డిపోల డీలర్లు ఆయా ప్రాంతాల్లోని కాంగ్రెస్, టీడీపీ నాయకులతో కుమ్మక్కై ఒక్కో స్టాక్ పాయింట్ పరిధిలో ప్రతి నెలా కనీసం 3 వేల క్వింటాళ్ల సబ్సిడీ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఈ బియ్యాన్ని రూ.800తో డీలర్ల నుంచి కొనుగోలు చేసిన బియ్యం స్మగ్లర్లు వాటిని కర్ణాటకలోని పావగడకు తరలించి రూ.1800కు విక్రయిస్తున్నారు. ప్రతి నెలా భారీగా మామూళ్లు ముడుతుండడం వల్లే ఈ వ్యవహారంపై రెవెన్యూ, పోలీసు అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.