
మాయలాడి అరెస్ట్
తాడిపత్రి: గొప్పింటి మహిళగా పరిచయం చేసుకుని ఇళ్లలో చొరబడి లూటీలకు పాల్పడుతున్న మాయలేడిని పట్టణ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పట్టుబడిన నిందితురాలని వైఎస్‌ఆర్ జిల్లా జమ్మలమడుగుకు చెందిన సునీతగా గుర్తించారు. సీఐ సుధాకరరెడ్డి తెలిపిన మేరకు... రెండు రోజుల క్రితం పెద్దపప్పూరు రోడ్డులోని కృష్ణావృద్ధాశ్రమానికి వచ్చిన వృద్ధురాలి లక్ష్మిదేవి వద్ద బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయి.
ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాధితురాలి సమాచారంతో విచారణ వేగవంతం చేశారు. జమ్మలమడుగుకు చెందిన సునీత అప్పుడప్పుడు ఆశ్రమానికి వచ్చి పూజలు చేసుకుని వెళ్తుంటారని తెలుసుకుని ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. దీంతో వాస్తవాలు వెలుగు చూశాయి. ఆమెపై జమ్మలమడుగు, కడప పోలీస్ స్టేషన్లలోనూ కేసులు ఉన్నాయని సీఐ తెలిపారు. ఫ్యాక్షన్‌లో భర్త చనిపోవడంతో కుటుంబ పోషణ కోసం దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.