వీడని సందిగ్ధం | The belief hesitation | Sakshi
Sakshi News home page

వీడని సందిగ్ధం

Published Fri, Dec 5 2014 1:16 AM | Last Updated on Tue, Aug 14 2018 4:44 PM

వీడని సందిగ్ధం - Sakshi

వీడని సందిగ్ధం

 రూ.5 వేల కోట్లు ఎంతమందికి సరిపోతాయి!
 వడ్డీకి కూడా చాలే పరిస్థితి లేదు
 జాబితాలు వచ్చేవరకు వివరాలు తెలియవంటున్న బ్యాంకర్లు
 ప్రభుత్వానిది ఇప్పటికీ కప్పదాటు వైఖరే


విజయవాడ : అధికార పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేసి రైతుల్ని, డ్వాక్రా మహిళల్ని ఆదుకోవాలనే డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నాకు సిద్ధమైంది. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి అధికారం దక్కించుకున్న తెలుగుదేశం పార్టీ గడిచిన ఆరు నెలలుగా రోజుకో ప్రకటన చేస్తూ తప్పించుకు తిరుగుతోంది.
 
మచిలీపట్నం : రుణమాఫీపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం విధాన ప్రకటన చేసిన నేపథ్యంలో జిల్లా రైతులను అనేక అనుమానాలు వెంటాడుతున్నాయి. రూ.50 వేలు పంట రుణం ఉంటే పూర్తిస్థాయిలో మాఫీ చేస్తామని సీఎం ప్రకటించారు. రూ.50 వేల కన్నా అధికంగా పంట రుణం ఉంటే మొదటి విడతగా రుణ మొత్తంలో 20 శాతం చెల్లించి, మిగిలిన మొత్తానికి రైతు పేరున బాండ్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. రైతు పేరున ప్రభుత్వం విడుదల చేసిన బాండును బ్యాంకు అధికారులు స్వీకరిస్తారా అనేది అనుమానాస్పదమే. రాష్ట్ర వ్యాప్తంగా 22,00,079 కుటుంబాలకు తొలి విడత రుణమాఫీ చేస్తామని, ఇందుకోసం రూ.5 వేల కోట్లు కేటాయించామని ముఖ్యమంత్రి ప్రకటించారని ఈ మొత్తం ఒక్కొక్క కుటుంబానికి ఎంత వస్తుందని రైతులు లెక్కలు వేస్తున్నారు. జిల్లా నుంచి 7.03 లక్షల ఖాతాల ద్వారా తీసుకున్న పంట రుణాలకు మాఫీకి అర్హత ఉందని ప్రభుత్వానికి నివేదిక పంపామని లీడ్ బ్యాంకు మేనేజరు కె.నరసింహారావు చెబుతున్నారు. వారిలో ఎంతమందికి రుణమాఫీ జరుగుతుందనే అంశంపై తమ వద్ద వివరాలు లేవని  ఠ మొదటి పేజీ తరువాయి

 ఆయన ‘సాక్షి’కి తెలిపారు. వ్యవసాయాధికారుల వద్దే ఈ వివరాలు ఉంటాయని ఆయన చెబుతుండగా, లీడ్ బ్యాంకు మేనేజరు వద్దే ఉంటాయని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

అప్పుడు కట్టొద్దని.. ఇప్పుడు ఆంక్షలు పెట్టి...

ఎన్నికల ప్రచారం సమయంలో చంద్రబాబునాయుడు రైతులెవ్వరూ రుణాలు కట్టవద్దని.. వ్యవసాయ రుణాలన్నీ రద్దు చేస్తానని.. బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న పంట రుణాలు మాఫీ చేసి అక్కచెల్లెళ్ల బంగారాన్ని ఇంటికి తీసుకువచ్చి ఇస్తామని ప్రచారం చేశారు. ఎన్నికలు ముగిసి అధికారం చేపట్టిన తరువాత వ్యవసాయ రుణాలు రద్దు చేస్తానని తాను ప్రకటించలేదని, పంట రుణాలు మాత్రమే రద్దు చేస్తానని చెప్పానని ముఖ్యమంత్రి మాట మార్చారు. అన్ని పంటలకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి.. ఎన్నికల అనంతరం ఉద్యాన పంటలకు రుణమాఫీ వర్తించదని ప్రకటించారు. దీంతో పాటు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌పుస్తకం తదితర వివరాలను సమర్పించాలని రకరకాల నిబంధనలు పెడుతూ అనేక ఆంక్షలు విధించారు. తాజాగా రుణమాఫీపై గురువారం విధాన ప్రకటన చేసిన ముఖ్యమంత్రి రూ.50 వేల లోపు రుణం చెల్లింపు ఈ నెల 10వ తేదీ నుంచి ఉంటుందని వెల్లడించారు. ఇది కూడా ఏమేరకు, ఎంతమందికి అమలవుతుందనేది ప్రశ్నార్థకమే.

వడ్డీకి సరిపోతాయా? : పంట రుణాలకు వడ్డీ లేకున్నా సకాలంలో చెల్లించకపోవడంతో ఇప్పటికే 14 శాతం వడ్డీ రేటు పడుతోందని.. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విడుదల చేసే 20 శాతం నగదు వడ్డీకైనా సరిపోతుందా అనే అనుమానాలు రైతులు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎకరం పత్తి పంట సాగు చేయాలంటే రూ.50 వేలు, చెరుకుకు రూ.80 వేలు, పసుపు, మిర్చికి లక్ష రూపాయలు, వరికి రూ.35 వేలు ఖర్చవుతుంది. రెండు ఎకరాలు ఉన్న రైతు వరిసాగు నిమిత్తం రూ.70 వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎకరం వరిసాగుకు రూ.24 వేలు పంట రుణంగా అందజేశారు. ఈ బకాయిని సకాలంలో చెల్లించకపోవడంతో వడ్డీతో కలుపుకొని రుణం పెద్ద భారంగా మారింది. ఈ తరహా రైతులకు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయకుండా విడతల వారీగా చేస్తే ఎలాంటి ప్రయోజనమూ ఉండదని చెబుతున్నారు.

బాండ్లు ఇస్తే బకాయిలు తీరవు.. రుణాలు అందవు...

పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకుండా రైతుల పేరున బాండ్లు ఇస్తే వాటిని బ్యాంకర్లు అంగీకరించరని, రైతు పేరున ఉన్న బకాయి అలాగే ఉంటుందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఐదేళ్ల పాటు ఇదే పద్ధతి కొనసాగిస్తే రానున్న రోజుల్లోనూ పంట రుణాలు తీసుకునేందుకు అవకాశం ఉండదని వారు వాపోతున్నారు. ఇప్పటికే ఖరీఫ్‌లో పంట సాగు చేసుకునేందుకు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చిందని, సకాలంలో రుణమాఫీ జరగకుంటే వచ్చే ఏడాదీ ఇదే పరిస్థితి ఉంటుందని రైతులు ఆందోళనలో ఉన్నారు.
 
రెండో జాబితాకు ఇంకెంత కాలమో...

ఇప్పటివరకు రుణమాఫీ జాబితాలో లేని రైతుల పేర్లను గుర్తిస్తామని, వారికి కూడా రుణమాఫీ వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ బాధ్యతలను జన్మభూమి గ్రామకమిటీలు చూస్తాయని తెలిపారు. తొలి జాబితాకే ఇంత కాలం పట్టింది.. రెండో జాబితాలో గుర్తించినవారికి రుణమాఫీ ఇంకెన్ని రోజులకు జరుగుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. రుణమాఫీలో జరిగిన జాప్యం కారణంగా బ్యాంకులు పంట రుణాలు ఇవ్వకపోవటంతో పంట బీమా ప్రీమియం చెల్లించలేకపోయామని, ఇది తమకు తీరని నష్టమేనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయం...

జిల్లాలో 1.65 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. వీరు 3.5 లక్షల ఎకరాలను సాగు చేస్తున్నారు. రైతు మిత్ర గ్రూపుల ద్వారా 2010-11లో రూ.35 కోట్లు, 2011-12లో రూ.28 కోట్లు, 2012-13లో రూ.25 కోట్లు పంట రుణాలుగా అందజేశారు. 2013-14లో కౌలు రైతులకు రుణాలు ఇవ్వలేదు. ప్రభుత్వం కౌలు రైతులకు సంబంధించి రుణమాఫీపై స్పష్టమైన ప్రకటన చేయని పరిస్థితి నెలకొంది. బంగారం తాకట్టు పెట్టి రూ.3,276 కోట్లను 2,60,737 మంది రైతులు పంట రుణాలుగా తీసుకున్నారు. బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న పంట రుణాలకు మూడో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించటంతో ఈ తరహా రుణాలు తీసుకున్న రైతుల్లోనూ ఆందోళన నెలకొంది.
 
మోసపూరిత విధానమే

రాష్ట్ర వ్యాప్తంగా 22,00,079 మంది కుటుంబాలకు రూ.5వేల కోట్లతో రుణమాఫీ చేస్తామని ప్రకటించడం మోసపూరిత విధానమే. రుణమాఫీపై మాట్లాడే సమయంలో రూ.50 వేల లోపు పంట రుణం తీసుకున్న రైతులు ఎంత మంది ఉన్నారు, అంతకుమించి తీసుకున్నవారు ఎంతమంది ఉన్నారు, వీరికి రుణమాఫీ చేయాలంటే ఎంత నగదు కావాలి తదితర వివరాలను ముఖ్యమంత్రి వెల్లడిస్తే రైతుల్లో ఉన్న అనుమానాలు తొలగేవి. ఈ వివరాలు చెప్పకుండా రుణమాఫీ చేస్తామని ప్రకటించడం రైతులను మళ్లీ మోసం చేయడమే. దేశంలో ఈ తరహా ప్రకటన ఏ ముఖ్యమంత్రీ చేయలేదు. రుణమాఫీపై కాలయాపన చేయకుండా సవృుద్ధిగా నిధులు విడుదల చేయాలి.

 - ఎంవీఎస్ నాగిరెడ్డి, వైఎస్సార్ సీపీ వ్యవసాయ విభాగం రాష్ట్ర కన్వీనరు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement