సమస్యల్ని తొక్కిపెట్టొద్దు | The capital of the farmers concerned | Sakshi
Sakshi News home page

సమస్యల్ని తొక్కిపెట్టొద్దు

Published Thu, Apr 7 2016 1:16 AM | Last Updated on Sun, Sep 3 2017 9:20 PM

రాజధాని గ్రామాల్లో ఇబ్బందికరంగా మారిన సమస్యల్ని తొక్కిపెట్టడం వల్ల చివరి నిమిషంలో వాటిని ....

పద్ధతి ప్రకారం పరిష్కరించకపోతే మునిగిపోతాం
అవగాహన సమావేశంలో రాజధాని రైతుల ఆందోళన
రైతుల ప్లాట్ల కేటాయింపు విధానాన్ని వివరించిన సీఆర్‌డీఏ అధికారులు

 

విజయవాడ బ్యూరో : రాజధాని గ్రామాల్లో ఇబ్బందికరంగా మారిన సమస్యల్ని తొక్కిపెట్టడం వల్ల చివరి నిమిషంలో వాటిని పరిష్కంచుకోవడం సాధ్యం కాదని పలువురు రైతులు మంత్రి పుల్లారావు, సీఆర్‌డీఏ అధికారులను నిలదీశారు. ఇబ్బందులు వస్తున్నాయని కొన్ని అంశాలను కావాలని బయటకు రాకుండా  చేస్తున్నారని, అంతా అయిపోయిన తర్వాత వాటిని ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు. బుధవారం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో రైతులకు పంపిణీ చేయాల్సిన ప్లాట్లు, మాస్టర్‌ప్లాన్‌పై తుళ్లూరు మండలంలోని రాజధాని గ్రామాల రైతులకు సీఆర్‌డీఏ అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు రైతులు రాజధాని గ్రామాల్లో నెలకొన్న అనేక సమస్యల్ని ప్రస్తావించి వాటికి సమాధానం చెప్పాలని మంత్రి పుల్లారావును గట్టిగా అడిగారు. సులువుగా ఉన్న అంశాలపై ముందుకెళుతూ క్లిష్టమైన అంశాలను పెండింగ్‌లో పెడుతూ వెళ్లడం వల్ల రైతులు వాటిని ఎలా పరిష్కరించుకోగలుగుతారని కొందరు ప్రశ్నించారు. ఒక క్రమపద్ధతి ప్రకారం అన్ని సమస్యలను పరిష్కరించాలన్నారు. తమ అనుమానాలన్నింటినీ నివృత్తి చేసిన తర్వాతే తమకిచ్చే ప్లాట్ల లేఅవుట్లను ఖరారు చేయాలని, అన్ని విషయాలను తెలుగులోనే తమకు తెలిసేలా ఏర్పాట్లు చేయాలని పలువురు కోరారు. ప్లాట్లకు సంబంధించి తమ అభిప్రాయాలను తెలిపే 9.18 పత్రాల గురించి అవగాహన కల్పించాలని, న్యాయపరమైన ఇబ్బందులు వస్తే ఎలా ఎదుర్కోవాలో సూచించాలని చెప్పారు.



తమకిచ్చే ప్లాట్లలో హైటెన్షన్ వైర్లు, గుంతలు ఉంటే తామేం చేయాలని ఒక రైతు ప్రశ్నించారు. మెట్ట రైతులకు 50 చదరపు గజాలు పెంచి ఇస్తామంటూ గతంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని మరికొందరు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగాలు, ఉపాధి, విద్యా సౌకర్యాలు, అసైన్డ్ భూముల సమస్యలతో పాటు భూములిచ్చే సమయంలో తమకిచ్చిన అనేక హామీల గురించి రైతులు అధికారులను ప్రశ్నించారు. అధికారులు కొన్నింటికి సమాధానం చెప్పి మిగిలిన వాటిని సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

 
మిగిలిన ముక్కలకు ఏకమొత్తంలో వేలం

తొలుత ప్లాట్ల కేటాయింపు విధానం గురించి అధికారులు వివరించారు. రైతులకు కేటాయించే ప్లాట్లకు కనీసం 50 అడుగుల రోడ్డు ఉంటుందని, 60, 80 అడుగుల రోడ్లు వేసే ప్రతిపాదన సైతం ఉందని సీఆర్‌డీఏ అదనపు కమిషనర్ శ్రీధర్ చెప్పారు. నివాస ప్లాట్ల కనీస విస్తీర్ణం 125 చదరపు మీటర్ల నుంచి నాలుగు వేల చదరపు మీటర్లు, వాణిజ్య ప్లాట్ల కనీస సైజు 25 చదరపు మీటర్ల నుంచి నాలుగు వేల చదరపు మీటర్ల వరకు ఉంటాయని తెలిపారు. రైతులకు కేటాయించగా మిగిలిన చిన్న ముక్కలను రైతు కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిపి తీసుకోవచ్చన్నారు. అలా తీసుకున్న తర్వాత ఇంకా మిగిలిన ముక్కలన్నింటినీ కలిపి ఏకమొత్తంలో వేలం నిర్వహిస్తామని తెలిపారు. రైతులు జాయింటు ప్లాట్లు తీసుకోవాలంటే 9.18 ఫారం ద్వారా అప్పీలు చేసుకోవచ్చని తెలిపారు. నేలపాడు గ్రామం కోసం రూపొందించిన లేఅవుట్‌ను రైతులకు చూపించారు. గ్రామాల పరిధిలో ప్రతి కిలోమీటరుకు 165 అడుగుల రోడ్డు ఉంటుందని, ఆరు ప్రధాన రహదారులు 160 అడుగుల వెడల్పుతో ఉంటాయని తెలిపారు. ఈ విధానానికి రైతులు అంగీకారం తెలిపితే ప్రతి గ్రామానికి ఇదే విధానాన్ని రూపొందిస్తామన్నారు. మంత్రి పుల్లారావు మాట్లాడుతూ ఈ విధానం ప్రకారం ప్లాట్లను మేలో పంపిణీ చేయడం ప్రారంభించి జూన్, జూలై కల్లా ఇస్తామని తెలిపారు. కచ్చా డ్రెయిన్లు, రోడ్లు కూడా వేసి ఇవ్వాలంటే రెండు, మూడు నెలల సమయం పడుతుందన్నారు. ఈ విధానం గురించి ప్రతి గ్రామంలోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. గురువారం మంగళగిరి నియోజకవర్గంలోని రాజధాని గ్రామాల రైతులతో సమావేశం నిర్వహించి ఈ విధానాన్ని వివరిస్తామని తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement