జిల్లా సహకార రంగాన్ని కుదిపేసిన ‘దేవరకొండ సహకార బ్యాంకు’ అవినీతి లెక్క తేలింది.
జిల్లా సహకార రంగాన్ని కుదిపేసిన ‘దేవరకొండ సహకార బ్యాంకు’ అవినీతి లెక్క తేలింది. సొసైటీలు మొదలు డీసీసీబీ ఉన్నతాధికారి దాకా పాత్ర ఉన్న ఈ అవినీతి వ్యవహారంలో అక్షరాల రూ.18కోట్లు దుర్వినియోగమైనట్లు ‘ఫ్రాడ్ కమిటీ’ తన విచారణలో తేల్చింది. శనివారం జరగనున్న డీసీసీబీ బోర్డు మీటింగ్‌లో ఈ అంశాన్ని చర్చించనున్నారు..!!
- సాక్షి ప్రతినిధి, నల్లగొండ
సాక్షిప్రతినిధి, నల్లగొండ: దేవరకొండ సహకార బ్యాంకులో జరి గిన అవినీతి వ్యవహారం డీసీసీబీకి మాయని మచ్చలా తయారైంది. ఈ అవినీతికి ప్రధాన కారకుడిగా భావించి సస్పెండ్ చేసిన దేవరకొండ బ్యాంకు ఏజీఎం రామయ్య ఒక్కడే బాధ్యుడు కాదనీ, డీసీసీబీ డీజీఎంగా పనిచేసి దీర్ఘకాలిక సెలవులో వెళ్లిన భద్రగిరిరావుకూ పాత్ర ఉందని తేలింది. మొత్తంగా 2009 నుంచి అక్రమాల గుట్టు రట్టయ్యే నాటి వరకు జరిగిన దుర్వినియోగం రూ.18కోట్లుగా లెక్క తేల్చారు. డీసీసీబీ డెరైక్టర్లు నలుగురితో ఏర్పాటైన ‘ఫ్రాడ్ కమిటీ’ ఈ మేరకు నివేదిక తయారు చేసింది. శనివారం నల్లగొండలో జరిగే డీసీసీబీ బోర్డు సమావేశంలో ఈ అంశాన్ని చర్చకు పెట్టనున్నారు. ఇప్పటికే ఆయా సొసైటీల సీఈఓలపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల ఒత్తిళ్లతో నిబంధనలను పక్కన పెట్టాల్సి వచ్చిందని బ్యాంకు ఉద్యోగులు చేస్తున్న వాదనలో పసలేదని, బ్యాంకు ఉన్నతాధికారుల ప్రోద్బలం, అదనపు సంపాదనపై యావతో ఇష్టమున్న రీతిలో లోన్లు ఇచ్చారని చెబుతున్నారు. దేవరకొండ నియోజక వర్గంలోని సొసైటీలపై ఆరోపణలు వ్యక్తమయినా, కేవలం పీఏపల్లి, దేవరకొండ, చిత్రియాల, తిమ్మాపురం.. ఈ నాలుగు సొసైటీల్లోనే అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. సొసైటీల్లో రైతులు కాని వారికి కూడా లక్షలకు లక్షల రూపాయలు రుణాల ఇచ్చారు. కేవలం క్రాప్ లోన్లే కాకుండా గోల్డు లోన్ల విషయంలోనూ అక్రమాలు జరిగాయంటున్నారు. అయితే, ప్రస్తుతం పంట రుణాల వరకే పరిమితమై విచారణ పూర్తి చేశారు.
నిధుల దుర్వినియోగంలో ప్రధాన పాత్రధారి, దేవరకొండ బ్యాంకు ఏజీఎం రామయ్య రెండు విడతలుగా, డీజీఎం భద్రగిరిరావు అకౌంటులో రూ.2.50లక్షలు జమ చేసినట్లు గుర్తించారు. అవినీతి వ్యవహారం వెలుగు చూసిన మరుసటి రోజే భద్రగిరిరావు దీర్ఘకాలిక సెలవులో వెళ్లిన విషయం విదితమే. కాగా, ఈ అవినీతి కుంభకోణంపై డీసీసీబీ డెరైక్టర్లు చాపల లింగయ్య, గుడిపాటి వెంకటరమణ, గోవర్దన్, హరియానాయక్‌లు సభ్యులుగా ఏర్పా టైన ‘ఫ్రాడ్ కమిటీ’ విచారణ జరిపి నిజాలు వెలికి తీసింది. మరింత లోతైన విచారణ కోసం, నిజాలు నిగ్గు తేల్చేందుకు సీబీఐ ద్వారా విచారణ జరిపించాలన్న డిమాండ్ వ్యక్తం అవుతోంది. ఈ విషయంపైనా బోర్డు మీటింగులో చర్చను లేవనెత్తేందుకు కొందరు డెరైక్టర్లు సిద్ధమవుతున్నారు.
మరోమారు తెరపైకి.. విజయేందర్‌రెడ్డి సెలవు వ్యవహారం?
డీసీసీబీ చైర్మన్ యడవెల్లి విజయేందర్‌రెడ్డి సెలవు వ్యవహారం మరోమారు తెరపైకి వస్తోంది. శనివారం జరగనున్న బోర్డు మీటింగ్‌లో ఈ అంశాన్ని చర్చించనున్నారని సమాచారం. అధికార కాంగ్రెస్ నేతల మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా విజయేందర్‌రెడ్డితో దీర్ఘకాలిక సెలవు పెట్టించి, వైస్‌చైర్మన్‌గా ఉన్న ముత్తవరపు పాండురంగారావుని డీసీసీబీ పీఠంపై కూర్చోబెట్టేందుకు ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయి.
అయితే, ‘సెలవు పెట్టడం ఎందుకు, ఏకంగా రాజీనామా చేసి వెళ్లిపోండి..’ అంటూ కొందరు డెరైక్టర్లు విజయేందర్‌రెడ్డితో వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. ‘మంత్రులు.. మంత్రులు మాట్లాడుకుని నిర్ణయాలు తీసుకుంటే సరిపోతుందా... ఇక, మేమంతా డెరైక్టర్లుగా ఉన్నదెందుకు. ఒకరు సెలువుపై వెళితే.. మరొకరు పీఠం ఎక్కేటట్టయితే, ఈ వ్యవస్థ అంతా ఎందుకు..’ అని ఓ డెరైక్టర్ వ్యాఖ్యానించారు. అవినీతి మరకతో చులకనైన డీసీసీబీ పరువును నిలబెట్టేందుకు ప్రయత్నిస్తారా..? పీఠం కోసం తగవులాడుకుంటారా..? అసలేం జరగబోతోందన్నది శనివారం బోర్డు మీటింగులో కొద్దొగొప్పో బయట పడే అవకాశం కనిపిస్తోంది.