బూర్గుపల్లి(గంగాధర), న్యూస్‌లైన్: మలేసియాలో మంచి ఉద్యోగమని నమ్మి వెళ్తే కంపెనీ చేసిన మోసంతో ఏడుగురు వలసజీవులు కటకటాలపాలయ్యారు. తమవారు ఎంతోకొంత సంపాదించుకొని వస్తారని ఎదురుచూస్తున్న కుటుంబసభ్యులు పిడుగులాంటి వార్తవిని కుమిలిపోయారు. సంపాదన దేవుడెరుగు.. తమ వారిని విడిపించుకోవడానికి మళ్లీ అప్పులు చేయాల్సి వచ్చింది. మలేసియా జైల్లో శిక్ష అనుభవించిన ఆరుగురు వ్యక్తులు ఇటీవల స్వగ్రామాలకు చేరుకోగా.. వారితో వెళ్లిన దూస రవి మాత్రం జైల్లోనే ఉండిపోయాడు.
తన భర్తను విడిపించుకునే స్తోమత లేక .. సర్కారు సాయం అందక అతడి భార్య శ్రీదీప గొల్లుమంటోంది. ‘సారూ.. నా భర్తను విడిపించండి’ అంటూ కన్నీటితో వేడుకుంటోంది. మలేసియాలో ఉద్యోగం.. నెలకు పాతిక వేల జీతం.. మూడేళ్లు పనిచేస్తే ఆరు లక్షలు వెనుకేసుకోవచ్చు.. ఇక్కడ రెక్కలు ముక్కలు చేసుకుంటే పైసా మిగిలింది లేదు.. అంటూ ఓ కంపెనీ చెప్పిన తియ్యటి మాటలకు ఆకర్షితులై గంగాధర మండలం బూర్గుపల్లి గ్రామానికి చెందిన.. ఆరుగురు వ్యక్తులతోపాటు దూస రాజేశ్వర్ ఏడాదిన్నర క్రితం మలేసియా వెళ్లారు. ఆరు నెలలకోసారి రెండుసార్లు వీసా స్టాంపింగ్ చేసిన కంపెనీ ఆ తర్వాత చేతులెత్తేసింది. అక్కడి పోలీసుల తనిఖీలో వీరు ఏడుగురు పట్టుబడ్డారు. వీసా లేనందున డెబ్బై రోజుల జైలు శిక్ష విధించారు.
శిక్ష ముగిసిన తర్వాత సంపత్ మినహా మిగతావారికి కుటుంబసభ్యులు విమాన టిక్కెట్లు పంపించడంతో ఆరుగురు వారం క్రితం స్వగ్రామానికి చేరుకున్నారు. సంపత్ పాస్‌పోర్టు రెన్యూవల్ కాకపోవడం, ఔట్‌పాస్ లేకపోవడంతో శిక్షముగిసినా జైల్లోనే ఉన్నాడు. భర్తను రప్పించడం కోసం సంపత్ భార్య శ్రీదీప పడరాని పాట్లు పడుతోంది.
సంపత్ పరిస్థితి తెలుసుకోవడానికి వెళ్లిన ‘న్యూస్‌లైన్’ ముందు తన బాధ చెప్పుకుని కన్నీటి పర్యంతమైంది. నాలుగు నెలల నుంచి ఫోన్ కూడా లేదని, జైలు నుంచి వచ్చిన వారితో కొడుకును మంచిగ చూసుకోమని చిన్న చిట్టి రాసి పంపాడని ఆమె కన్నీరు పెట్టుకుంది. తన భర్తను జైలు నుంచి ఇంటికి రప్పించడానికి కంపెనీ మేనేజరు గానీ, ఏజెంట్ గానీ పట్టించుకోవడం లేదని పేర్కొంది. అధికారులెవరైనా ఔట్‌పాస్ ఇప్పించి తన భర్తను జైలు నుంచి విడిపించాలని శ్రీదీప వేడుకుంటోంది.
కంపెనీ మోసంతో కటకటాలకు..
Published Wed, Nov 20 2013 4:15 AM | Last Updated on Sat, Sep 2 2017 12:46 AM
Advertisement
Advertisement