సాక్షి, కరీంనగర్ : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వేటకు రంగం సిద్ధమైంది. రానున్న సాధారణ ఎన్నికలకు పార్టీ అభ్యర్థులను గుర్తించేందుకు రాహూల్ దూతలు ఈ నెల 20, 21 తేదీల్లో జిల్లాకు వస్తున్నారు. కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని శాసనసభ సెగ్మెం ట్లలో అభ్యర్థులను గుర్తించనున్నారు. జిల్లాలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏడు కరీంనగర్ లోకసభ స్థానం పరిధిలో ఉండగా, జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలు నిజామాబాద్ లోకసభ పరిధిలో ఉన్నాయి.
ధర్మపురి, రామగుండం, పెద్దపల్లి, మంథని నియోజకవర్గాలు పెద్దపల్లి లోకసభ స్థానం పరిధిలో ఉన్నాయి. రాహుల్ దూతలుగా వస్తున్న నేతలు ఆశావాహుల నుంచి దరఖాస్తులు తీసుకోవడంతోపాటు వివిధ వర్గాలనుంచి సమాచారాన్ని తెలుసుకుంటారు. లోకసభ స్థానంతోపాటు వాటి పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విజయావకాశాలున్న ముగ్గురిని గుర్తించి వారి పేర్లను ఏఐసీసీకి అందజేస్తారు. అందులోంచి ఏఐసీసీ ఒకరిని ఎంపికచేసే అవకాశముంటుంది.
కరీంనగర్ లోకసభ, దాని పరిధిలోని శాసనసభ స్థానాల్లో అభ్యర్థుల నుంచి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్ కుమారుడు, ఎమ్మెల్యే అమిత్ దేశ్‌ముఖ్, పెద్దపల్లి లోకసభ, దాని పరిధిలోని శాసనసభ స్థానాల్లో అభ్యర్థుల నుంచి మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే విజయ్ వాడేటివార్, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల ఆశావాహుల నుంచి మహారాష్ట్రకు చెందిన ఎమ్మెల్యే యశ్వమతి ఠాకూర్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. లోక్‌సభ నియోజకవర్గాల కేంద్రాల్లోనే దరఖాస్తులు స్వీకరిస్తారు.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ మాజీ సభ్యులు, మాజీ ఎంపీపీలు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ మేయర్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, పార్టీ మండల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, పీసీసీ ఆఫీస్ బేరర్లు, ఏఐసీసీ సభ్యులు, నామినేటెడ్ సభ్యుల నుంచి పరిశీలకులు అభిప్రాయాలు తెలుసుకుంటారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆరాటపడుతున్న నేతలు దాదాపు అన్ని స్థానాల నుంచి పెద్దసంఖ్యలో పరిశీలకులను కలిసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తమ బయోడేటా, పార్టీ ఆధ్వర్యంలో తాము చేపట్టిన కార్యక్రమాలు తదితర వివరాలతో వారు సిద్ధంగా ఉన్నారు.
20,21 తేదీల్లో జిల్లాకు రాహుల్ దూతలు
Published Thu, Jan 16 2014 3:38 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement