19 రూట్లకు 1414 దరఖాస్తులు
లాటరీ పద్ధతిలో ‘అద్దెబస్సులు’ ఖరారు
విశాఖపట్నం: అవసరమైన రూట్లలో అద్దె బస్సులు నడపడానికి విశాఖ ఆర్టీసీ రీజియన్‌లో పిలిచిన టెండర్లకు అనూహ్య స్పందన లభించింది. 19 రూట్లకు గాను జిల్లాలో 23, నగరంలో 68 వెరసి 91 అద్దెబస్సుల కోసం మంగళవారం టెండర్లను ఆహ్వానించింది. ఆయా బస్సు యజమానుల నుంచి 1414 టెండర్లు దాఖలయ్యాయి. అంటే సగటున ఒక్కో రూటుకు 70 మంది పోటీ పడ్డట్టయింది. ఇందులో అత్యధికంగా నర్సీపట్నం-విశాఖపట్నం మధ్య నడపనున్న 12 నాన్‌స్టాప్ డీలక్స్ సర్వీసులకు 307 టెండర్లు దాఖలు చేశారు. ఆ తర్వాత శ్రీకాకుళం-విశాఖల మధ్య నడిచే 4 నాన్‌స్టాప్ డీలక్స్ సర్వీసులకు 246 టెండర్లు పడ్డాయి. అత్యల్పంగా విశాఖ(మధురవాడ)-కర్నూలు, ఆరిలోవ-రైల్వేస్టేషన్ (69వ నం.సర్వీసు), సింహాచలం-ఆర్కేబీచ్ (28జెడ్) సర్వీసులకు ఒక్కో టెండరు మాత్రమే దాఖలయింది. అలాగే సింహాచలం-చోడవరం మధ్య ఆరు మెట్రో సర్వీసులకు 182, మద్దిలపాలెం-రైల్వేస్టేషన్- తగరపువలస మధ్య ఆరు మెట్రో సర్వీసులకు 135 టెండర్లు పడ్డాయి. 91 అద్దెబస్సుల్లో మూడు తెలుగు వెలుగు (నర్సీపట్నం-తుని), నాలుగు సూపర్ లగ్జరీ, 16 డీలక్స్, 24 సిటీ ఆర్డినరీ, 44 మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసులు ఉన్నాయి. అత్యధికంగా 735 కిలోమీటర్ల దూరం ఉన్న విశాఖ-కర్నూలు రూటుకు ఒకే టెండరు దాఖలయింది. మొత్తమ్మీద చూస్తే ప్రైవేటు బస్సు యజమానులు రోడ్లు సిటీ రూట్లకు, నాన్‌స్టాప్ రూట్లకు బాగా మొగ్గు చూపారు.
లాటరీ ద్వారా కేటాయింపు: మంగళవారం రాత్రికి టెండర్ల ప్రక్రియ ముగిసింది. ఆర్టీసీ అధికారులు బుధవారం ఆయా టెండర్లను లాటరీ పద్ధతిలో ఖరారు చేశారు. ఆశించిన రూటు దక్కని బస్సు యజమానులకు ఒక్కో టెండరు దాఖలైన రూట్లకు అవకాశం కల్పించారు. అయితే దీనికీ పోటీ పెరగడంతో వాటినీ లాటరీ ద్వారా ఎంపిక చేశారు. ఈఎండీ కింద చెల్లించిన రూ.50 వేలను టెండరు దక్కని వారికి బుధవారం తిరిగి చెల్లించారు.
టెండర్.. వండర్!
Published Thu, Jan 7 2016 12:30 AM | Last Updated on Sun, Sep 3 2017 3:12 PM
Advertisement
Advertisement