అసత్య ప్రచారాలు చేయడంలో సీఎం చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య అని శాసనమండలి విపక్షనేత సీ.రామచంద్రయ్య ధ్వజమెత్తారు.
కడప అగ్రికల్చర్ : అసత్య ప్రచారాలు చేయడంలో సీఎం చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య అని శాసనమండలి విపక్షనేత సీ.రామచంద్రయ్య ధ్వజమెత్తారు. శుక్రవారం కడప ఇందిరాభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం అపద్దాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాడన్నారు. ఆ రోజుల్లో టీడీపీ రాష్ట్ర విభజనకు మద్దతుగా లేఖ ఇవ్వడం వల్లనే విభజన అయిందని, దీన్ని ప్రజలలో అపోహ సృష్టించి ఏడు నెలలు గడచినా ఇంకా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించడం తగదన్నారు.
జనవరి 1వ తేదీన కూడా ఇవి చేశాం, అవి చేశామని తప్పుడు ప్రచారం చేసుకోవడం విచారకరమన్నారు. ప్రజా రాజధాని పేరుతో గుంటూరు జిల్లా తుళ్లూరులో బలవంతంగా భూములు లాక్కుంటున్నారని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడచిపోయిందని ఈ కాలంలో ఏమేమి చేశావో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
రుణమాఫీ చేశామని చెబుతున్నా రాష్ట్రంలోని ఏఏ బ్యాంకులో ఎంత మొత్తంలో రైతుల ఖాతాల్లో వేశారో గుండెల మీద చెయ్యి వేసుకుని సీఎం చెప్పాలని సవాల్ విసురుతున్నామన్నారు. రాష్ట్ర విభజనలో సీతారామలక్ష్మణులు కొలువుండే భద్రాచలం తెలంగాణకు వెళ్లిపోయిన నేపథ్యంలో ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని అభివృద్ధి చేసి రాబోయే శ్రీరామ నవమికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు అందజేసి కల్యానం జరిపించేందుకు చర్యలు చేపట్టాలని లేఖ పంపుతున్నట్లు రామచంద్రయ్య ప్రకటించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్.నజీర్ అహ్మద్, సేవాదళ్ అధ్యక్షుడు బండి జకరయ్య, ఐఎన్‌టీయుసీ జిల్లా అధ్యక్షుడు ఇంతియజ్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి సత్తార్, పార్టీ అధికార ప్రతినిధి నీలి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.