పాఠశాలల్లో ఇకపై ఎనిమిది పీరియడ్లు
సమయం ఒక్కటే కాలనిర్ణయ పట్టిక విడుదల
యలమంచిలి : ఇకపై ప్రతి పీరియడ్ కనీసం 45 నిమిషాలకు తగ్గకుండా సమయాన్ని నిర్దేశించారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో గతంలో అరగంట మాత్రమే ఒక్కో పీరియడ్ ఉండేది. ఉపాధ్యాయుడు విద్యార్థులు ఉన్న తరగతి గదిలోకి వెళ్లేలోపు కనీసం 5 నుంచి 10 నిమిషాలు అయ్యేది. ఐదు నిమిషాలు విద్యార్థులను సంసిద్ధత చేసేందుకు, మిగిలిన 15 నుంచి 20 నిమిషాలు పాఠాలు చెప్పే పరిస్థితి ఉండేది. కనీసం 45 నిమిషాలు ఒక పీరియడ్‌కు కేటాయిస్తే విద్యార్థులకు సరైన బోధన అందుతుందని నిపుణులు సూచించారు. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యా కమిషనర్ నుంచి సమయాన్ని, కాలనిర్ణయ పట్టికను మార్పుచేస్తూ ఉత్తర్వులు అన్ని పాఠశాలలకు అందాయి.
జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు, ఇతర పాఠశాలలు మొత్తం 5,341 ఉన్నాయి. జిల్లా వ్యా ప్తంగా ఆయా యాజమాన్య పరిధిలో మొత్తం 6.45లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 13,760 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో బోధిన వారి సంఖ్య వీరికి అదనం. ఆయా పాఠశాలల్లో పీరియడ్లు తగ్గాయి. ప్రతి పీరియడ్‌కు సమయం పెంచుతూ మొత్తం సమయం యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకోవడంతో ఉపాధ్యాయలోకం నుంచి కూడా ఎలాంటి వ్యతిరేకం వ్యక్తం కాలేదు.
8 పీరియడ్ల లెక్క ఇలా...: ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6 నుంచి 8వ తరగతి వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 4.10 గంటల వరకు సమయాన్ని నిర్దేశించారు. మొదటి బెల్ 9 గంటలకు ప్రారంభించి, 9.15 గంటలకు ప్రార్థన సమయం ముగించాలి. మొదటి పీరియడ్ 9.15 నుంచి 10 గంటల వరకు ఉంటుంది. 8వ పీరియడ్ 3.30 నుంచి 4.10గంటలతో ముగుస్తుంది. ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి పదో తరగతి వరకు సమయాన్ని నిర్దేశించారు. ఉదయం 9.30 గంటలకు పాఠశాల వేళలు ప్రారంభమై 9.35 గంటలకు ప్రార్థన సమయం ముగుస్తుంది. మొదటి పీరియడ్ 9.45 ప్రారంభమై 10.30 గంటలకు పూర్తవుతుంది. 8వ పీరియడ్ 4.05 ప్రారంభమై 4.45 గంటలకు ముగుస్తుంది.
కాలనిర్ణయ పట్టిక డీఈవో బ్లాగ్...: జిల్లాలో ఆయా పాఠశాలల్లో కాలనిర్ణయ పట్టికను డీఈవో బ్లాగ్‌లో అందుబాటులో ఉంచారు. సబ్జెక్టుల వారీగా వారానికి ఎన్ని పీరియడ్లు కేటాయించాలన్నది ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయా సబ్జెక్టులకు సంబంధించిన వెయిటేజీ నిర్ణయించారు. తెలుగు, హిందీ, ఆంగ్లం, గణితం, భౌతికం, జీవశాస్త్రం, ప్రయోగశాల, సాంఘికశాస్త్రం, వ్యాయామవిద్య, వాల్యూ ఎడ్యుకేషన్, ఆర్ట్ ఎడ్యుకేషన్, వర్క్ ఎడ్యుకేషన్, లైబ్రరీకి సంబంధించిన పీరియడ్లు నిర్ధారించారు. జిల్లాలో అన్ని యాజమాన్యాల పరిధిలో సవరించిన కాలనిర్ణయ పట్టిక మేరకే (టైంటేబుల్) నిర్వహించాలని డీఈవో వెంకటకృష్ణారెడ్డి పాఠశాలల ప్రిన్సిపాళ్లు, ప్రధానోపాధ్యాయులకు తెలిపారు. డీఈవో బ్లాగ్‌లో దిగుమతి చేసుకొని ఆ మేరకు కాలనిర్ణయ పట్టికను నిర్వహించుకోవాలని సూచించారు.