వచ్చే జూన్‌లో విద్యా సంవత్సరం ప్రారంభానికంటే ముందుగానే విద్యార్థులకు పైతరగతుల బోధన చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది.
♦ మార్చి 7 నుంచి 14లోగా 1నుంచి 9 తరగతుల పరీక్షలు
♦ ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు జూన్ 13నుంచి బడులు ప్రారంభం
♦ సీబీఎస్‌ఈ తరహా విధానం అమలు ఒంటిపూట బడులు రద్దు
♦ అమలుకు చర్యలు చేపట్టాలని డీఈవోలకు విద్యాశాఖ ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే జూన్‌లో విద్యా సంవత్సరం ప్రారంభానికంటే ముందుగానే విద్యార్థులకు పైతరగతుల బోధన చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు పై తరగతులకు సంబంధించిన బోధనను పాఠశాలల్లో చేపట్టాలని పేర్కొంది. అలాగే ఒంటి పూట బడుల విధానాన్ని తొలగించింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) తరహాలో బడుల విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. ఇందుకోసం అమలు చేయాల్సిన అకడమిక్ కేలండర్‌ను రూపొందించింది. దాని ప్రకారం విద్యాబోధన, పైతరగతుల నిర్వహణ చేపట్టాలని డీఈవోలను ఆదేశించింది.
ఈ మేరకు శుక్రవారం పాఠశాల విద్యా డెరైక్టర్ జి.కిషన్, డీఈవోలతో నిర్విహ ంచిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశాలు జారీ చేశారు. అకడమిక్ కేలండర్ ప్రకారం అన్ని రకాల చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా పాఠ్య పుస్తకాల్లో లోపాలపై ఆన్‌లైన్ ద్వారా అభ్యంతరాలు స్వీకరించి సవరించాలని విద్యాశాఖ నిర్ణయించింది. అలాగే కొత్త పాఠ్య పుస్తకాలను వచ్చే మార్చిలోగా విద్యార్థులకు అందించేలా చర్యలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు ఒకవేళ పుస్తకాల పంపిణీ ఆలస్యం అయినా మార్చిలో విద్యా బోధనకు ఇబ్బందులు తలెత్తుకుండా ఉండేందుకు కొన్ని పుస్తకాలను తీసుకుని స్కూళ్లలో బుక్ బ్యాంకు ఏర్పాటు చేసుకోవాలని, వేసవి సెలవులకు ముందు చేపట్టే బోధనను వాటి ఆధారంగా చేయాలని నిర్ణయానికి వచ్చింది.
ప్రధాన నిర్ణయాల్లో కొన్ని..
► ఒకటి నుంచి 9వ తరగతి వరకు ఫార్మేటివ్-4 పరీక్షలను ఫిబ్రవరి 28న, పదో తరగతి వారికి జనవరి 31న నిర్వహించాలి.
► ఫిబ్రవరి నాటికే అన్ని తరగతుల బోధన పూర్తి చేయాలి.
► 1 నుంచి 9 తరగతుల వారికి వార్షిక పరీక్షలు మార్చి 7 నుంచి 14 వరకు నిర్వహించాలి.
► మార్చి 21వ తేదీలోగా మూల్యాంకనం చేపట్టి విద్యార్థులకు ప్రొగ్రెస్ కార్డులను అందజేయాలి. తుది ఫలితాలు ప్రకటించాలి.
► మార్చి 21నుంచి ఏప్రిల్ 9 వరకు పదో తరగతి పరీక్షలు ఉంటాయి.
► మార్చి 21 నుంచి ఏప్రిల్ 23 వరకు వచ్చే విద్యా సంవత్సరపు బోధన చేపట్టాలి.
► ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ఉంటాయి. తిరిగి జూన్ 13న ప్రారంభించాలి.
► మైనారిటీ స్కూళ్లకు ఈ నెల 24 నుంచి 30 వరకు క్రిస్‌మస్ సెలవులు. ఇతర స్కూళ్లకు 2016 జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు. 2016లో దసరా సెలవులు కూడా ఈసారి లాగే అక్టోబర్ 10 నుంచి 25 వరకు ఇచ్చే అవకాశం ఉంది.