నల్లగొండ, న్యూస్‌లైన్: జిల్లాలో విద్యుత్ బకాయిలు సుమారు రూ.200 కోట్ల మేర పేరుకుపోయాయి. మొత్తం బకాయిల్లో ప్రభుత్వ శాఖలదే అగ్రభాగం. బకాయిల విషయంలో సీపీడీసీఎల్ సీఎండీ రిజ్వీ ఇటీవల సమీక్షలు నిర్వహించి జిల్లా అధికారులకు చీవాట్లు పెట్టారు. దీంతో వారు ఇకనుంచి బకాయిల వసూళ్లకు కఠిన నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. జిల్లాలో గృహ వినియోగంతో పాటు వాణిజ్యం, పరిశ్రమలు, పవర్‌లూం, వ్యవసాయ, తాగునీటి పథకాలు, వీధిలైట్లు, ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలల నుంచి రావాల్సిన బకాయిలు రూ.193కోట్ల 49లక్షల 91వేల మేర ఉన్నాయి.
ప్రభుత్వ బకాయిలను పట్టించుకోకుండా...
నష్టాలు పూడ్చుకునే పనంటూ ప్రతి ఏడాది మాదిరిగానే చార్జీలు, సర్‌చార్జ్‌ల, వినియోగదారుల సేవాచార్జీల రూపంలో జిల్లా ప్రజలపై ఎప్పటికప్పుడు భారం మోపుతున్న ప్రభుత్వం.. ప్రభుత్వ శాఖల నుంచి సంస్థకు రావాల్సిన కోట్లాది రూపాయల బకాయిలను గాలికొదిలేస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. నష్టాలొస్తున్నాయంటూ చార్జీల భారాన్ని ప్రజలపై రుద్దే ప్రయత్నాలు మాని బకాయిలపై దృష్టి పెట్టాలని మేధావులు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు విద్యుత్ బిల్లుల విషయంలో ఒకడుగు ముందుకేస్తూ మచ్చలేకుండా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, అనుబంధ సంస్థలు, ఏజెన్సీల హెచ్‌టీ, ఎల్‌టీ సర్వీసుల బకాయిలు కుప్పలు, తెప్పలుగా పేరుకుపోయాయి.
నోటీసులకు స్పందన కరువు
బకాయిలకు సంబంధించి పలుమార్లు ప్రభుత్వ శాఖల బాధ్యులకు నోటీసులు జారీ చేసినా స్పందన కరువైంది. నోటీసుల మీద నోటీసులు వస్తున్నాయని ఉన్నతాధికారులకు తెలియజేసినా ప్రభుత్వం నుంచి అనుమతి లేనిది ఏమిచేస్తామంటూ సమాధానాలు తప్ప సమస్యకు పరిష్కారం మాత్రం లభించడం లేదు.
ప్రధాన ప్రభుత్వ శాఖలన్నీ పెద్ద మొత్తంలో విద్యుత్ శాఖకు బకాయిపడ్డాయి. ప్రధానంగా జిల్లాలోని గ్రామీణ తాగునీటి పారుదల వ్యవస్థ, వీధిలైట్లు, వసతిగృహాలు, పాఠశాలలకు సంబంధించి రూ.61 కోట్ల6 లక్షల 59వేల మేర బకాయిపడ్డాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రభుత్వ శాఖలు కోట్లల్లో బకాయిలు పేరుకుపోయినా, వాటికి సంబంధించి వందల్లో లేఖలు అందినా ఆయా శాఖల నుంచి స్పందన మాత్రం కానరావట్లేదు.
బకాయిలు రూ.200 కోట్లు
Published Fri, Aug 9 2013 2:43 AM | Last Updated on Sat, Sep 29 2018 5:21 PM
Advertisement
Advertisement