అప్పుల బాధ తాళలేక చిత్తూరు జిల్లా కలికిరి మండలంలో గురువారం ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అప్పుల బాధ తాళలేక చిత్తూరు జిల్లా కలికిరి మండలంలో గురువారం ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల కథనం మేరకు కొమ్మేపల్లి గ్రామానికి చెందిన రైతు గజ్జెల సురేంద్రరెడ్డి (40)కి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. నాలుగు ఎకరాల పొలం ఉంది. వ్యవసాయం కోసం కలికిరి ఆంధ్రా బ్యాంకులో రూ.40 వేలు రుణం తీసుకున్నాడు. వ్యసాయ బోర్లు వేసేందుకు, కుమార్తెలకు పెళ్లి చేయడానికి బయటి వ్యక్తుల నుంచి రూ.5 లక్షలకు పైగా అప్పు చేశాడు.
పొలంలో మూడు బోర్లు వేయించాడు. నీరు పడకపోవడంతో నష్టపోయాడు. దానికి తోడు రుణమాఫీ కూడా కాలేదు. బయటి వ్యక్తుల వద్ద తీసుకున్న అప్పునకు వడ్డీలు పెరిగిపోయాయి. వడ్డీ, అసలు కలిపి సుమారు రూ.6లక్షల అప్పు మిగిలింది. రుణదాతల ఒత్తిడి పెరిగింది. ఇదిలా ఉండగా ఇటీవల వర్షాలు కురవడంతో చెరువుల్లోకి నీరుచేరింది. వరి సాగుచేసేందుకు పొలాన్ని సిద్ధం చేశాడు. కూలీలు, ఎరువులకు డబ్బు లేకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. గురువారం తెల్లవారుజామున పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.