
హక్కుల కోసం ఐక్య పోరాటం
కొప్పళ మాజీ ఎంపీ విరుపాక్షప్ప
హొళగుంద:
హక్కుల కోసం కురవలంతా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని కర్ణాటక రాష్ట్రం కొప్పళ మాజీ ఎంపీ విరుపాక్షప్ప పిలుపునిచ్చారు. శనివారం హొళగుందలో కురువ సంఘం గౌరవ అధ్యక్షుడు కాళికప్రసాద్ ఆధ్వర్యంలో భక్త కనకదాసు 327వ జయంతిని నిర్వహించారు. భీరప్ప గుడి నుంచి కనకదాసు చిత్ర పటంతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ఊరేగింపులో ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన కురువలు బీరప్ప డోళ్లు వాయించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విరుపాక్షప్ప మాట్లాడుతూ..మూఢ నమ్మకాలను వీడి పిల్లలను చదివించాలన్నారు. దేశంలో 12 శాతం ఉన్న కురువలు ఆది నుంచి అన్యాయానికి గురవుతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భక్త కనకదాసు జయంతిని ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలో కురువలకు ఉన్న గుర్తింపు ఆంధ్రప్రదేశ్‌లో దొరకకపోవడం విచారకరమన్నారు.
కార్యక్రమంలో కురువ సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు రామచంద్రయ్య, గిడ్డయ్య, గడ్డం రామకిృష్ణ, జెడ్పీటీసీ సభ్యురాలు గంగమ్మ, సుం కన్న, నాగన్న, దేవరగట్టు మాజీ చైర్మన్ ముద్దుబసవనగౌడ్, మాజీ సర్పంచ్ పంపన్నగౌడ్, శేషగిరి పాల్గొన్నారు.