తొలి దశకు రూ.52,548 కోట్లు
అమరావతి మౌలిక సదుపాయాలపై సీఆర్‌డీఏ అంచనా
♦ 2018 డిసెంబర్ నాటికి రూ.34,772 కోట్లు
♦ వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.3,216 కోట్లు కావాలి
♦ రాజధాని ప్రాంత ఎత్తు పెంపునకు రూ.750 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాజధాని అమరావతిలో తొలి దశ లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.52,548 కోట్ల వ్యయం అవుతుందని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) అంచనా వేసింది. ఈ మొత్తం నిధులు 2021-22 సంవత్సరం నాటికి అవసరం అవుతాయంది. 2018 డిసెం బర్ నాటికి మౌలిక సదుపాయాల కల్పనకు రూ.34,772 కోట్లు అవసరమంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2016-17) రూ. 3,216 కోట్ల్లు కావాలంది. తొలి దశ పనులకు, నిర్మాణాలకు సంబంధించి రంగాల వారీగా సీఆర్‌డీఏ ప్రతిపాదనలు రూపొందించింది. ప్రధానంగా కొండవీటి వాగువల్ల రాజధాని ప్రాంతం ముంపునకు గురవుతుందనే విషయం తెలిసిందే.
వరద నిర్వహణ పనులకే రూ.2941 కోట్లు వ్యయం అవుతుందని సీఆర్‌డీఏ పేర్కొంది. మొత్తం రాజధాని ప్రాంతం ముంపునకు గురికాకుండా చూసేం దుకు ప్లాట్‌ఫాం ఎత్తును పెంచాల్సి ఉందని, ఇందుకు రూ.750 కోట్ల వ్యయం అవుతుందని సీఆర్‌డీఏ అంచనా వేసింది. కొండవీటి వాగు ప్రధానడ్రెయిన్ నిర్వహణ పనులకు రూ.295 కోట్లు,ఎర్రవాగు, కట్టెలవాగు, అయ్యన్నవాగు, పాలవాగు నిర్వహణ పనులకు రూ.370 కోట్లు అవుతుందని అంచనా వేసింది. నీరుకొండ, కృష్ణయ్యపాలెంలో డైవర్షన్ పాండ్స్ నిర్మాణానికి రూ.800 కోట్ల వ్యయం అవుతుంది. వరద నీటి మళ్లింపు పనులకు రూ.406 కోట్ల అవసరం అవుతుందని అంచనా వేసింది.
ప్రభుత్వ కార్యాలయాలకు రూ.2,371 కోట్లు
అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకు రూ.2,371 కోట్లు ఖర్చు అవుతుందని సీఆర్‌డీఏ పేర్కొంది. 67,73,560 చదరపు అడుగుల్లో అసెంబ్లీ, మండలి, హైకోర్టు, సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, రాజభవన్, రిక్రియేషన్ కార్యకలాపాల నిర్మాణాలను చేపట్టనున్నారు. ప్రభుత్వ నివాస కాంప్లెక్స్‌ల నిర్మాణాలకు రూ.1473 కోట్లను అంచనా వేసింది. 46,96,750 చదరపు అడుగుల్లో అమరావతి గెస్ట్ హౌస్, సీఎం నివాసం, మంత్రుల బంగ్లాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాసాలు, ప్రధాన న్యాయమూర్తి నివాసం, జడ్జీల నివాసాలు, అఖిల భారత సర్వీసు అధికారుల నివాసాలు, గెజిటెడ్ ఆఫీసర్ల నివాసాలు, నాన్ గెజిటెడ్ ఆఫీసర్ల నివాసాలు, నాలుగో తరగతి ఉద్యోగుల నివాసాలను నిర్మించాలని నిర్ణయించారు.
రవాణా మౌలిక సదుపాయాలు, యుటిలిటీ డక్ట్ పనులు, నీటి సరఫరా, వృధా నీటి నిర్వహణ, డ్రైనేజీ నిర్వహణ, వ్యర్ధ పదార్థాల నిర్వహణ, కృష్ణా నది ఒడ్డున పార్కులు, గ్రీనరీ అభివృద్ధి , విద్యుత్ సరఫరా, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, స్కూల్స్, ఆసుపత్రులు నిర్మాణాలు, 900 ఎకరాల్లో ప్రభుత్వ కాంప్లెక్స్ క్యాంపస్‌లో సదుపాయాలు, 17 వేల ఎకరాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఎంత వ్యయం అవుతుంతో సీఆర్‌డీఏ అంచనాలను రూపొందించింది.