గప్ చుప్
- తొలి విడత 22 మండలాల్లో నేటితో ప్రచారానికి తెర
- అంతటా అభ్యర్థుల హడావుడి
- రాజకీయ వేడితో గ్రామాలు గరం గరం
- 22 జెడ్పీటీసీ, 379 ఎంపీటీసీలకు 6న పోలింగ్
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: ప్రాదేశిక తొలి విడత ఎన్నికల ప్రచార హోరుకు నేటితో తెరపడనుంది. పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు ఆపేయాలన్న నిబంధన మేరకు శుక్రవారం సాయంత్రంతో అంతటా గప్‌చుప్ వాతావరణం నెలకొన నుంది. దీంతో ఆఖరి రోజు ప్రచారానికి అభ్యర్థులు తమదైన శైలిలో ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఉన్న కొద్ది సమయాన్ని పల్లె వాసులను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు.
జిల్లాలో 39 జెడ్పీటీసీ, 656 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటికి రెండు దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. తొలి దశగా 6న 22 జెడ్పీటీసీ, 379 ఎంపీటీసీలకు, రెండో విడతగా 11న 17 జెడ్పీటీసీ, 277 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతగా 7,37,269 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
పోలింగ్‌కు రెండు రోజులే గడువుండడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు తమ వద్ద ఉన్న అస్త్రాలన్నింటినీ ప్రయోగిస్తున్నారు. రకరకాల విన్యాసాలతో జనానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఇంటింటికి తిరిగి తమ వారికి ఓట్లను వేయాలంటూ అభ్యర్థిస్తున్నారు.
గ్రామాల్లో నాయకుల మకాం
‘పరిషత్’ పోలింగ్‌కు సమయం సమీపిస్తున్నకొద్దీ నియోజకవర్గ నేతలంతా గ్రామాల్లోనే తిష్టవేశారు. వీరంతా స్థానిక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూనే సార్వత్రికం దృష్ట్యా తమ పనులు చక్కబెట్టుకుంటున్నారు. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నచందంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులతో పాటు తమను బలపరచాలని కోరుతూ గ్రామాల్లో రాజకీయాలు నడుపుతున్నారు. పగలంతా ప్రచారంలో మునిగి, రాత్రిళ్లు మండలాల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల ఇళ్లలోను, పట్టున్న నేతల విడిదిలోను బస చేస్తూ వ్యూహాలు పన్నుతున్నారు. దీంతో గ్రామాల్లో రాజకీయాలు ఊపందుకున్నాయి.
గెలుపే లక్ష్యంగా తాయిలాలు
ఆయా పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు కూడా గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు దీటుగా ఖర్చుకు సైతం వెనుకాడడం లేదు. పల్లెల్లో కులసంఘాలు, మహిళా సంఘాలకు తాయిళాల ఎర వేసి తమ వైపు తిప్పుకోడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా గంపగుత్తుగా ఓటర్లను కొనుగోలు చేస్తున్నారు.
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలకు మించి డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఒక్కో ఓటుకు రూ.500 నుంచి రూ.1000 వరకు ముట్టజెబుతున్నారు. ప్రధానంగా యువతకు క్రీడా సామాగ్రి, ఆటవస్తువులు, మహిళలకు చీరలు పంచిపెడుతున్నారు. తాగినోడికి తాగినంత అన్నట్టు పీకలదాక మందు పట్టిస్తున్నారు. గెలుపు గుర్రం ఎక్కేందుకు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఈ ఎన్నికలను పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో స్థానిక పోరు రసవత్తరంగా మారుతోంది.
ఎన్నికల సిబ్బందికి బస్సులు
తొలి దశలో ఆనందపురం, భీమిలి, పద్మనాభం, పెందుర్తి, పరవాడ, సబ్బవరం, అనకాపల్లి, బుచ్చెయ్యపేట, చోడవరం, చీడికాడ, కశింకోట, కె.కోటపాడు, మునగపాక, అచ్యుతాపురం, యలమంచిలి, రాంబిల్లి, నర్సీపట్నం, పాయకరావుపేట, మాకవరపాలెం, కోటవురట్ల, ఎస్.రాయవరం, నక్కపల్లి మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఆయా మండలాల్లో ఎన్నికల విధులకు 2633 మందిని అధికారులు నియమించారు. వీరు ఆయా పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం తెల్లవారు జామున ఆర్టీసీ కాంప్లెక్సు నుంచి ఐదు బస్సులు బయలు దేరుతాయని జెడ్పీ సీఈవో ఎం.మహేశ్వరెడ్డి తెలిపారు.