రెండో విడత.. అభ్యర్థులకు కలత
- 5 రోజులపాటు అదనపు వ్యయం
- ఒక్కో స్థానానికి రూ.2.5 కోట్లని అంచనా
- టీడీపీని వెంటాడుతున్న నైరాశ్యం
- ఏంచేయాలో పాలుపోని పరిస్థితి
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: ప్రాదేశిక ఎన్నికలు అభ్యర్థులకు సంకటంగా మారాయి. తొలి విడత 22 జెట్పీటీసీ, 379 ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 6న జరగనుండగా అయిదు రోజులు తరువాత రెండో విడత పోలింగ్ జరగనుంది. ఈనెల 11న రెండో విడత కింద 17 జెట్పీటీసీ, 277 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ అయిదు రోజులు ప్రచారాలకు సమయముందన్న ఆనందం కంటే.. అధిక వ్యయం రెండో దశ అభ్యర్థులకు కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. సాధారణ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
ఈ ఫలితాల ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై ఉంటుందని భావించిన పార్టీలు సర్వశక్తులు ఒడ్డయినా ఇందులో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రధానంగా గత పదేళ్లుగా అధికారం కోసం కొట్టుమిట్టాడుతున్న టీడీపీకి ఈ ఎన్నికలు చావోరేవోలా మారాయి. ఒకవైపు పార్టీపై ప్రజల్లో విశ్వాసం లేకపోవడం, ప్రతీ సర్వే ఫలితాలు వ్యతిరేకంగా వస్తుండడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంది.
ఎలాగైనా ఇందులో విజయం సాధించడానికి పార్టీలు కోట్లకు కోట్లను వెదజల్లుతున్నాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో అసెంబ్లీ ఎన్నికలకు ధీటుగా ఒక్కో స్థానానికి రెండు నుంచి రెండున్న కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధమయ్యాయి. సాధారణ ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్నా.. అభ్యర్థిత్వాలు ఖరారు కాని పార్టీల్లో ఆశావహులు తమ సీట్లను పదిలం చేసుకోడానికి మండలాల్లో విపరీతంగా డబ్బును కుమ్మరిస్తున్నారు. తొలి దశలో జరిగే స్థానాలకు ఒక్కో దానికి రూ.2 కోట్లు నుంచి రూ.2.5 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధమయ్యారు.
రెండో దశ గుబులు
తొలి ఎన్నికలకు ఇంకా అయిదు రోజులు సమయం మాత్రమే ఉంది. ఈ అయిదు రోజుల్లోనే అభ్యర్థులకు కోట్లు ఖర్చుకానున్నాయి. రెండు దశ ఎన్నికలకు 10 రోజులు సమయముంది. దీంతో ఈ దశలో జరిగే 17 స్థానాల అభ్యర్థుల్లో గుబులు మొదలైంది. తొలి దశ ఎన్నికల తరువాత అప్పటి ట్రెండ్స్‌కు అనుగుణంగా అవసరాన్ని బట్టి మరింత ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుందని అభ్యర్థులు భావిస్తున్నారు. అదనపు సమయంలో అభ్యర్థులు ఓటర్లకు డబ్బు, కానుకలు సమర్పణతో పాటు, మందు, విందులకు చేతి చమురు అధనంగా వదిలించుకోవాల్సిందేనని తర్జన భర్జన పడుతున్నారు.
కోట్లకు కోట్లు ఖర్చుపెట్టయినా ఈ స్థానిక ఎన్నికల్లో విజయం సాధించి ఆ ప్రభావంతో సాధారణ ఎన్నికలకు వెళ్లాలనుకున్న పార్టీలకు సుప్రీం కోర్టు తీర్పుతో చుక్కెదురైంది. ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు మే 7వ తేదీ తరువాత చేపట్టనుండడంతో ఆ పార్టీలకు ఏం చేయాలో దిక్కుతీచకుండా పోయింది. సాధారణ ఎన్నికల్లోపు ప్రజలను తమవైపునకు తిప్పుకోడానికి ఇప్పటికే విజయం కోసం కోట్లకు కోట్లు ఖర్చు చేసిన పార్టీలు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నాయి.