
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో ఈ నెల 25వ తేదీన జరగనున్న నేషనల్ అసెంబ్లీతోపాటు, 4 ప్రొవిన్షియల్ అసెంబ్లీల ఎన్నికల ప్రచార పర్వం సోమవారం అర్ధరాత్రితో ముగిసింది. ఈ ఎన్నికల్లో కరుడుగట్టిన మత గురువులు సహా 12,570 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. పెద్దగా ఉత్సాహం చూపని ఓటర్లు, ఉద్రిక్త వాతావరణం మధ్య చివరి నిమిషం వరకు అభ్యర్ధులు సభలు, సమావేశాలు, ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నేషనల్ అసెంబ్లీ స్థానాలకు 3,675 మంది ప్రొవిన్షియల్ పదవులకు 8,895 మంది పోటీ పడుతున్నారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్(పీఎంఎల్–ఎన్) నేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ జైలులో ఉండటం, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నేత అసిఫ్ అలీ జర్దారీపై పలు ఆరోపణల నేపథ్యంలో అనిశ్చిత వాతావరణం కొనసాగుతోంది.