సాక్షి, అమరావతి : ఎంపీటీసీ, జడ్పీటీసీలతో పాటు పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు బుధవారం అర్ధరాత్రికల్లా ఖరారు కానున్నాయి. పంచాయతీ ఎన్నికలలో ఎస్సీలకు 19.08 శాతం, ఎస్టీలకు 6.77 శాతం, బీసీలకు 34 శాతం చొప్పున మొత్తం 59.85 శాతం స్థానాలను ఆయా సామాజికవర్గాలకు రిజర్వ్ చేస్తూ వారం రోజుల క్రితం రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా.. జిల్లా, మండలాల వారీగా సర్పంచి, ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవులతో పాటు ఎంపీపీ పదవులను ఎవరెవరికి కేటాయించాలన్న దానిపై జిల్లాలో సోమవారం నుంచే కసరత్తు మొదలైంది.
రాజకీయ పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా జరిగే సర్పంచి ఎన్నికల కన్నా ముందు పార్టీ గుర్తు ప్రతిపాదికన జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఆసక్తిగా ఉండడంతో పంచాయతీరాజ్ శాఖాధికారులు రిజర్వేషన్లు ఖరారు చేసే ప్రక్రియను చేపట్టారు. రిజర్వుడ్ స్థానాలను ఏ ప్రతిపాదికన ఎంపిక చేయాలన్న దానిపై ఇప్పటికే పంచాయతీరాజ్ కమిషనర్ అన్ని జిల్లాల కలెక్టర్లకు, జిల్లా పంచాయతీ అధికారులు, జడ్పీ సీఈఓలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. దీంతో జిల్లాల్లో కలెక్టరు కార్యాలయ సిబ్బందితోపాటు పంచాయతీరాజ్ శాఖ అధికారులందరూ రెండు రోజులుగా రిజర్వేషన్ల ప్రక్రియను ఖరారుచేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. జిల్లాల వారీగా బుధవారంకల్లా ఈ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులంటున్నారు.
3న హైకోర్టుకు అందజేత
ఇదిలా ఉంటే.. రిజర్వేషన్ల వివరాలను జనవరి 3న రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు అందజేయనుంది. అన్ని జిల్లాల్లోనూ రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ బుధవారం పూర్తికాగానే గురువారం పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయ అధికారులు వాటిని క్షుణ్ణంగా పరిశీలించి శుక్రవారం హైకోర్టుకు సమర్పిస్తారు.
ఎన్నికలకు ముందే కొత్త పంచాయతీలు
కాగా, గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందే పెద్దఎత్తున కొత్త పంచాయతీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే, కొన్ని పంచాయతీలను విలీనం కూడా చేసింది. వీటికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మంగళవారం ఒక్కరోజే 66 వేర్వేరు ఉత్తర్వులను జారీచేశారు.
నేటి అర్ధరాత్రికల్లా.. ‘స్థానిక’ రిజర్వేషన్ల ఖరారు
Published Wed, Jan 1 2020 4:13 AM | Last Updated on Wed, Jan 1 2020 4:13 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment