మాజీ సైనికులను ఆదుకుంటాం | The former soldiers adukuntam | Sakshi
Sakshi News home page

మాజీ సైనికులను ఆదుకుంటాం

Published Mon, Jan 19 2015 1:53 AM | Last Updated on Tue, Aug 21 2018 4:18 PM

మాజీ సైనికులను ఆదుకుంటాం - Sakshi

మాజీ సైనికులను ఆదుకుంటాం

నాలుగు రాష్ట్రాల లెఫ్టినెంట్ జనరల్ జగ్‌ధీర్‌సింగ్
 
 విద్యానగర్(గుంటూరు) : మాజీ సైనికులను, దేశరక్షణలో భర్తలను కోల్పోయిన వితంతువులను అన్ని విధాలా ఆదుకుంటామని సేవాపురస్కార్, విశిష్ట సేవాపురస్కార్, జీవోసీ, అవార్డుల గ్రహీత, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఏరియా లెఫ్టినెంట్ జనరల్ జగ్‌ధీర్‌సింగ్ తెలిపారు. ఆదివారం గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఆర్మీ ఆధ్వర్యంలో మాజీ సైనికుల రాష్ట్ర స్థాయి సదస్సు, సమస్యల పరిష్కారానికి అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
 
 ముఖ్య అతిథిగా లెఫ్టినెంట్ జనరల్ జగ్‌ధీర్‌సింగ్ పాల్గొని మాట్లాడారు. మాజీ సైనికులు, సైనిక వితంతువుల సమస్యలను సమీప సైనిక సంక్షేమ శాఖ కార్యాలయం ద్వారా తెలియపరిస్తే వాటిని సంబంధిత శాఖల అధికారులతో చర్చించి పరిష్కరిస్తామన్నారు. ఇంటి పన్నులు, భూమి శిస్తు లేకుండా జీవోలున్నాయని వాటిని అనుసరించి సమస్యలు పరిష్కరించుకోవచ్చన్నారు. వితంతువులు, మాజీ సైనికుల కుమార్తెల పెళ్లిళ్లకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసు కోవాలన్నారు.
 
 అశోక చక్ర, విశిష్ట సేవామెడల్ ఆంధ్రా సబ్‌ఏరియా మేజర్ జనరల్ సీఏ     పీఠావలా మాట్లాడుతూ మాజీ సైనికులకు ప్రభుత్వం మెట్ట అయితే ఐదు ఎకరాలు, మాగాణి భూమి అయితే  2.5 ఎకరాలు ఇస్తుందని తెలిపారు. ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణాలకు, పొలాల కొనుగోలుకు మాజీ సైనికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రుణా లను అందిస్తున్నాయన్నారు.
 
 సికింద్రాబాద్ ఈఎమ్‌ఈ సెంటర్ బ్రిగేడియర్ జె. సిథానా మాట్లాడుతూ దేశ రక్షణలో పాల్గొన్న వారికి విశిష్ట పురస్కారాలు అందించనున్నట్టు తెలిపారు.
 
 జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే మాట్లాడుతూ మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఇళ్ల స్థలాలు, ఇతర సమస్యలు తన దృష్టికి తీసుకువచ్చారని వీలైనంత త్వరగా వాటిని పరిష్కరిస్తామని తెలిపారు.
 
 జిల్లా అర్బన్ ఎస్పీ రాజేష్‌కుమార్ మాట్లాడుతూ ప్రతి సోమవారం తన కార్యాలయంలో ఫిర్యాదుల దినోత్సవం జరుగుతుందని మాజీ సైనికులకు ఎటుంటి సమస్యలు న్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
 
 కార్యక్రమంలో భాగంగా ఆర్మీ ఏఎమ్‌సీ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల్లో మాజీ సైనికులకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.
 
 మాజీ సైనికులలో పేదలు, యుద్ధంలో పనిచేసి నేడు నడవలేని స్థితిలోఉన్న వారిని గుర్తించి మోటార్‌సైకిళ్లు, ట్రైసైకిళ్లు అందజేశారు. అలాగే దాదాపు 200 మంది వితంతువులకు చీరలు, ఆర్థిక సాయంగా రూ. 5వేలు అందజేశారు.
 ఈ కార్యక్రమంలో కల్నల్ శేషా, రిక్రూట్‌మెంట్ సెక్టార్ కల్నల్ జాఫ్రి, ఈసీహెచ్‌ఎస్ గుంటూరు మేనేజర్ హనుమంతరావు, క్యాంటిన్ మేనేజర్ శ్రీనివాసరావు, మేజర్ అజిత్‌రెడ్డి, భాష్యం రామకృష్ణా, పద్మశ్రీ టౌన్‌షిప్ డెరైక్టర్ శ్రీనివాసరావు, రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సైనికులు, మహిళలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement