ఈపీడీసీఎల్ ఉద్యోగులకు శుభవార్త
- రూ.22,45,43,256 రుణాలు, అడ్వాన్స్‌లు
- 2014-15 ఆర్థిక సంవత్సర గ్రాంట్ విడుదల
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ ఈపీడీపీసీఎల్) ఉద్యోగులకు శుభవార్త. వరుస ఎన్నికలు, కోడ్ అమలు నేపథ్యంలో నిలిచిన సంస్థాగత రుణ సౌకర్యానికి ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఈపీడీసీఎల్ పరిధిలోని ఐదు జిల్లాల్లో పనిచేస్తున్న సిబ్బందికి రుణాలు, అడ్వాన్సులు చెల్లిం చేందుకు నిధులు కేటాయించింది.
2014-15 ఆర్థిక సంవత్సరానికి రూ.22 కోట్ల 45 లక్షల 42 వేల 256తో నగదు గ్రాంట్‌ను విడుదల చేస్తూ ఈపీడీసీఎల్ రెండు రోజుల కిందట ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో బైక్, మోటార్ సైకిల్, మోపెడ్, వివాహం, పర్సనల్ కంప్యూటర్ (పీసీ), ఇంటి మరమ్మతులు తదితర అవసరాలకు రుణం, అడ్వాన్స్ రూపంలో రూ.3 కోట్ల 92 లక్షల 92 వేల 256, కారు, గృహనిర్మాణ కేటగిరీలో రుణం, అడ్వాన్స్ రూపంలో రూ. 18 కోట్ల 52 లక్షల 51 వేలు కేటాయించారు.
నామమాత్రపు వడ్డీ : ఏటా నామమాత్రపు వడ్డీ (5-6 శాతం)తో సంస్థలో పనిచేస్తున్న సిబ్బందికి నగదు రూపంలో రుణాలిస్తున్నారు. సైకిల్, మోటార్ సైకిల్, మోపెడ్, వివాహ వ్యయం, కారు, పీసీలు, ఇంటి భవనం మరమ్మతులు, స్థలాల కొనుగోళ్లు, ఇంటి కొనుగోళ్లు తదితర అవసరాలకు ఈ రుణాలందింస్తున్నారు. నిర్దేశిత వ్యవధిలో దరఖాస్తు చేసుకున్నవారికి సీనియార్టీ ఆధారంగా రుణం మంజూరు చేస్తారు.
ఈ ఏడాది మార్చి 31లోగా వివాహ అడ్వాన్స్‌లు, పీసీ, బైక్ కొనుగోళ్లకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఈపీడీసీఎల్ సాయం దక్కింది. కార్లు, గృహ నిర్మాణ రుణాలకు దరఖాస్తు చేసుకున్నవారివి మాత్రం గత ఆర్థిక సంవత్సరం నాటి దరఖాస్తులు కూడా ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి ప్రస్తుతం ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
సర్కిళ్లవారీ కేటాయింపులు : ఈపీడీసీఎల్ పరిధిలోని ఐదు సర్కిళ్లు, కార్పొరేట్ కార్యాలయ పరిధిలో మొత్తం 878 మందికి వివిధ అవసరాల నిమిత్తం రూ.22,45,43,256లు కేటాయించారు. వీరిలో ఎవరైనా విముఖత చూపితే ఆ స్థానంలో తర్వాతి దరఖాస్తుదారునికి అవకాశం కల్పించనున్నారు.