హైకోర్టు సింగిల్ జడ్జితో విచారణ చేయించాలి
వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ
పెనుకొండ : రాజధాని ముసుగులో రూ.లక్షల కోట్ల భూ దోపిడీకి పాల్పడిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆయన అనుయాయులపై హైకోర్టు సింగిల్ జడ్జితో విచారణ జరిపించాలని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి, ఆయన అనుచర వర్గం భూ దోపిడీ, అవినీతి అక్రమాలపై ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో బుధవారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం చంద్రబాబు తన తనయుడు లోకేష్ ద్వారా తమ అనుకూల పత్రికలో రోజుకొక కథనం రాయించి.. రాజధాని ఏర్పడే ప్రాంతంలో అక్కడ ధరలు పెరగకుండా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులను సైతం దారి మళ్లించారని ఆరోపించారు. టీడీపీ మంత్రులు, నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజధాని ప్రాంతంలో ఉన్న భూములను కారుచౌకగా కొట్టేసి, ఆ ప్రాంత రైతన్నల కడుపు కొట్టారని ధ్వజమెత్తారు.
దళితులను పూర్తీగా దగా చేశారన్నారు. రాజధాని ప్రాంతం ప్రకటించక ముందు జరిగిన భూ రిజిష్ట్రేన్లను వెంటనే రద్దు చేయాలని, రైతుల భూములను వారికే తిరిగి ఇచ్చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సింగిల్ జడ్జి విచారణకు సిద్ధం కావాలని సవాలు విసిరారు. భూ బాగోతం బయటపడుతుందనే సీఎం ముందుగానే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొనుగోలు చే శారని ఆరోపించారు. రూ.లక్షల కోట్లున్న ఈ భూ కుంభకోణంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని, బాధ్యులపై చర్యలు చేపట్టాలని శంకరనారాయణ డిమాండ్ చేశారు.
సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి గుట్టూరు శ్రీరాములు, రాష్ట్ర బీసీ సెల్ నాయకుడు కలిపి నేసే శ్రీనివాసులు, రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి భాస్కరరెడ్డి, పార్టీ కన్వీనర్ శ్రీకాంతరెడ్డి, టౌన్ కన్వీనర్ ఇలియాజ్, రొద్దం కన్వీనర్ నారాయణరెడ్డి, బీసీ సెల్ కార్యదర్శి ఎస్‌బీ.శీనా, సర్పంచులు చలపతి, రాజగోపాల్‌రెడ్డి, జిల్లా బీసీ సెల్ నాయకుడు కొండలరాయుడు, ముఖ్య నాయకుడు వైశాలి జయప్ప, పెనుకొండ మండల బీసీ సెల్ నాయకుడు రామాంజనేయులు, రైతు సంఘం నాయకుడు సోమశేఖర్‌రెడ్డి, నాయకుడు నరసింహ తదితరులు పాల్గొన్నారు.