
అమలు కాని హామీలకు 6 నెలలు
అధికారమే పరమావధిగా అవధుల్లేని హామీలు గుప్పించిన చంద్రబాబు ఎన్నికల్లో గెలిచి సోమవారానికి ఆరు నెలలు పూర్తయింది. అధికారం చేపట్టాక అమలైన హామీ ఒక్కటీ కానరాదు. రుణమాఫీ అమలుకాక అన్నదాతలు..డ్వాక్రా మహిళల రుణాలు వడ్డీలతో కొండల్లా పేరుకు పోయాయి. ‘జాబు కావాలంటే బాబు రావాలి’ అన్న మాటకు జవాబే లేకుండా పోయింది. తొమ్మిది గంటల వ్యవసాయ విద్యుత్ ఊసే లేదు. ఫించన్ సొమ్ము ఐదు రెట్లు పెంచానని చెప్పి వేలాది మంది అర్హులను జాబితాల నుంచి తొలగించేశారు. ఇక విరుచుకుపడిన హుద్‌హుద్ ధాటికి దెబ్బకు కట్టుబట్టలతో రోడ్డున పడిన లక్షలాది మంది నిరుపేదల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నేటికీ సాయానికి నోచుకోక నరకం చూస్తున్నారు. అధికారంలోకి రాకముందు బాక్సైట్‌ను, పీసీపీఆర్‌ను వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడు వాటికి వత్తాసు పలుకుతున్నారు.
విశాఖపట్నం: అధికారమే పరమావధిగా అవధుల్లేని హామీలు గుప్పించిన చంద్రబాబు ఎన్నికల్లో గెలిచి సోమవారానికి ఆరు నెలలు పూర్తయింది. అధికారం చేపట్టాక ఒక్క హామీ కూడా నెరవేర్చలేదంటూ వివిధ వర్గాలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
నిరుద్యోగుల్లో నిరాశ, నిస్పృహ లు చోటుచేసుకుంటున్నాయి. బాబు వస్తే జాబు వస్తుందని కొండంత వీరంతా ఎదురు చూ శారు. ఆర్నెళ్లయినా ఒక్కరికి కూడా ఉద్యోగమొచ్చిన దాఖలాలు లేవు. మరోవైపు ఆదర్శ రైతులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, కమ్యూనిటీ ఫెసిలిటేటర్లు, హౌిసింగ్‌లోని అవుట్‌సోర్సింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాలో సుమారు ఆరు వేల మంది ఉద్యోగాలు కోల్పోయి నడి రోడ్డున పడ్డారు.
{పతీ ఒక్కరికి లక్షన్నరతో ఇంటిని నిర్మిస్తామన్న బాబు ఒక్క ఇల్లు కూడా కట్టిన పాపాన పోలేదు. పైగా వివిధ దశల్లో ఉన్న వాటికి ఒక్కరూపాయి బిల్లు కూడా మంజూరు చేయలేదు.
హుద్‌హుద్‌కు జిల్లాలో 46 మంది చనిపోయినట్టు, మరో 56 మంది క్షతగాత్రులైనట్టుగా నిర్ధారించారు. చనిపోయిన వారిలో 42మందికి రాష్ర్టప్రభుత్వం తరపున రూ.5లక్షల సాయం మాత్రమే అందజేశారు. మిగిలిన నలుగురికి ఎలాంటి సాయం లేదు. కేంద్రంనుంచి అందాల్సిన రూ.2లక్షల సాయం రాలేదు.
లక్షా 48వేల ఇళ్లు నేలమట్టమైతే రూ.75కోట్లు విడుదల చేశామంటున్నా కనీసం 10వేలమందికి కూడా పరిహారం అందలేదు. నేటికి లక్షలాది మంది మొండిగోడల మధ్య, ఫ్లెక్సీల మాటున చలిలోనే జీవనం సాగిస్తున్నారు. 86వేల ఎకరాల్లో పంటలు సర్వనాశనమైపోయినా ఒక్కరైతుకూ పరిహారం అందలేదు.
ఫిషింగ్ హార్బర్‌లో 670 మెకనైజ్డ్ బోట్లుంటే దాదాపు అన్నీదెబ్బతిన్నాయి. సగానికి పైగా ధ్వంసమైతే మిగిలిన వాటికి నష్టం వాటిల్లింది. పెనుగాలుల విధ్వంసానికి వలలతో పాటు ఉన్న బోట్లు 391 కొట్టుకుపోతే, వలలతో ఉన్న మరో 190 బోట్స్‌కు నష్టం వాటిల్లింది. మరో 431బోట్లు, 190 వలలు విడివిడిగా కొట్టుకుపోతే..మరో చిన్నా చితకా కలిపి 1301 వరకు దెబ్బ తిన్నాయి. బోట్లు, వలలకు నష్టం రూ. 24 కోట్ల 61లక్షల 14వేలుగా అంచనా. ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా పరిహారం అందలేదు. రెండున్నర లక్షల మంది రైతులకు చెందిన 3.87లక్షల ఖాతాల పరిధిలో పంట, బంగారు రుణాలు రూ.3,800కోట్ల వరకు ఉన్నాయి. ఎన్నికల ముందు ఇవన్నీ మాఫీ అన్నారు. అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రుణాలు కాదు కేవలం పంట రుణాలే అదీ కుటుంబానికి లక్షన్నర వరకే అంటూ మాట మార్చారు. అలా చూస్తే పంట రుణాలు దాదాపు రూ.వెయ్యి కోట్ల వరకు మాఫీ కావాలి. ఇప్పుడు 50 వేల లోపుపంట రుణాలు మాత్రమే అంటున్నారు.
ఆ జాబితాలో ఎవరి పేరుందో తెలియదు. ఇక జిల్లాలో 66,340 డ్వాక్రా సంఘాల పరిధిలో ఏడున్నర లక్షల మంది సభ్యులుగా ఉన్నా రు. వీరికి ఉన్న రూ.886 కోట్ల రుణాలు మాఫీ అవుతాయని ఇంతకాలం ఎదురు చూశారు. మాఫీ కాకపోగా 14 శాతం వడ్డీ తో కలిపి వీరిపై అప్పుల భారం వెయ్యి కో ట్లు దాటి పోయింది.పదవి చేపట్టకముందు మన్యంలో బాక్సైట్ తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పుడు అదే మనిషి మాట మార్చారు. ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.
పీసీపీఆర్ ఏర్పాటు చేస్తామని ఎవరైనా వస్తే చెట్టుకు కట్టేసి కొట్టమన్న వ్యక్తి ఇప్పుడు మాట మార్చారు. పీసీపీఐఆర్ ఏర్పాటుకు వేలాది ఎకరాలు ధారాదత్తం చేస్తూ, స్థానికులను నిరాశ్రయిలను చేస్తున్నారు.