సాక్షి ప్రతినిధి, కడప:కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను జిల్లా యంత్రాంగం అమలు పర్చింది. అందుకు ఇంజనీరింగ్ అధికారులను పావులుగా వాడుకుంది. ఎన్నికలు సజావుగా పూర్తి అయ్యాయి, ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు అయ్యాయి. అందుకోసం శ్రమించిన అధికారులకు మాత్రం వేదన తప్పడం లేదు. బిల్లులు మంజూరు చేయకుండా తమను నిండా ముంచారని వాపోతున్నారు.
ఎన్నికల నిధులకు జమ ఖర్చులు ఉండవు. ఎన్నికల అధికారి విచక్షణ మేరకు ఖర్చు చేయవచ్చు. అయినప్పటికీ జిల్లాలో రూ. 55 లక్షల నిధులకు బ్రేకులు పడ్డాయి. కేంద్ర ఎన్నికల సంఘం వికలాంగులు వీల్ ఛైర్‌లో పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా నిర్ణయం తీసుకుంది. అందుకోసం పోలింగ్ కేంద్రాలకు ర్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో మండలానికి పది పోలింగ్ కేంద్రాల చొప్పున ర్యాంపులను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా సుమారు 500 ర్యాంపులు నిర్మించారు. ఒక్కో ర్యాంపు రూ.11 వేలు చొప్పున ఎస్టిమేషన్ వేసి ఆమేరకు ఏర్పాటు చేశారు. అందుకోసం రూ. 55లక్షలు వెచ్చించినా బిల్లులు మాత్రం ఇప్పటికీ మంజూరు కాలేదని పలువురు ఇంజినీరింగ్ అధికారులు వాపోతున్నారు.
జిల్లా యంత్రాంగం ఆదేశాల మేరకే..
జిల్లా కలెక్టర్, జెడ్పీ సీఈఓ ఆదేశాల మేరకు మండలానికి పది ర్యాంపుల ప్రకారం పోలింగ్ బూత్‌ల వద్ద ఏర్పాటు చేశారు. ఎస్‌ఎస్‌ఏ గ్రాంటు ద్వారా 50 శాతం, జెడ్పీ ద్వారా 50శాతం నిధులు చెల్లిస్తామని జిల్లా కలెక్టర్ నోట్ ఆర్డర్ సైతం జారీ చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎవరి స్థాయిలో వారు ఖర్చును భరించి రా్యాంపులు ఏర్పాటు చేసినా బిల్లులు చెల్లించకపోవడం దారుణమని వాపోతున్నారు. ఎస్‌ఎస్‌ఏ గ్రాంటు ద్వారా కేటాయించిన నిధుల్లో అరకొరగా మంజూరయ్యాయని, జెడ్పీ గ్రాంటులో మాత్రం నిధులు విడుదల కాలేదని సమాచారం. ఇదే విషయాన్ని సోమవారం ఇంజినీరింగ్ అధికారులు జెడ్పీ సీఈఓ మాల్యాద్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అయితే అందుకు సంబంధించి నిధులు విడుదలకు సంబంధించిన ఫైల్ డీఆర్వో వద్ద పెండింగ్‌లో ఉందని ఆయన చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ఆగ్రాంటును విడుదల చేసి, కింది స్థాయి సిబ్బందిలో తమ పరువు నిలపాలని ఇంజనీరింగ్ అధికారులు కోరుతున్నారు.
నిండా ముంచారు!
Published Wed, Jul 16 2014 2:22 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement
Advertisement