కడప కల్చరల్, న్యూస్‌లైన్: ఓ ప్రాణ మిత్రుని పరిచయం.. పది మందిలో జరిగిన సన్మానం.. కొత్త మోటర్‌బైక్ కొన్న రోజు.. మురిపాల పాప పుట్టినరోజు.. ఇలా ఎన్నో... ఎన్నెన్నో మరపురాని సంఘటనలు గుర్తుకు తెచ్చే నేస్తమది.. కాస్త మరపు వచ్చినా ప్రతి పుటలో కనిపించే నిన్నటి దృశ్యాలు.. అపురూపమైన జ్ఞాపకాల దొంతరులు.. ఒకే పేజీలో మనోహరమైన భావనల వర్ణాలు.. మైమరపించే మధురమైన పరిమళ వీచికలు అందిస్తుంది.. అదే డైరీ.
డైరీ రాయడం ఒక కళ. క్రమశిక్షణ, అందుకే కొత్త సంవత్సరం సందర్భంగా జిల్లాలో డిసెంబరు నుంచి మార్చి ఆఖరు వరకు సుమారు 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు డైరీల వ్యాపారం జరుగుతోంది. క్యాలెండర్‌తో పోలిస్తే సంఖ్య తక్కువే అయినా, పలు ప్రముఖ కంపెనీలు తమ స్థాయికి తగినట్లుగా డైరీ వేయించి తమకు కావలసిన వారికి కానుకగా బహూక రిస్తారు. ప్రస్తుతం మార్కెట్‌లో రూ.5 నుంచి 2 వేల వరకు ధర పలికే డైరీలు అందుబాటులో ఉన్నాయి. మంచి డైరీలో గత సంవత్సరం వచ్చే సంవత్సర క్యాలెండర్‌లు, ప్రత్యేకదినాలు, ఇంకా ఇతర సమాచారం ఉంటుం ది. పలు రంగులు, సైజుల్లో ఇవి లభిస్తున్నాయి.
కొందరు ప్రతి రోజు డైరీ రాస్తారు. దానిలో కొందరు మర్మగర్భంగా రాస్తే ఇంకొందరు స్వీయచరిత్రలా రాస్తారు. డైరీని చాకలి, పాల పద్దు పుస్తకంగా ఉపయోగించేవాళ్లు కూడా లేక పోలేదు. ఏది ఏమైనా డైరీని మధుర జ్ఞాపకాల దొంతరలా సంవత్సరం పాటు, అవసరమనిపిస్తే జీవితాంతం దాచుకుంటారు. అనుమతి లేనిదే ఒకరి డైరీని మరొకరు చదవడం సంస్కారం కాదు సుమా. డైరీని సక్రమంగా ఉపయోగించుకుంటే నిన్నటి తీయని జ్ఞాపకాలను అవసరమైనపుడంతా నెమరువేసుకోవచ్చు.