అధికారుల నిర్లక్ష్యం.. విధుల్లో నిర్లిప్తత విలువ.. అక్షరాల అరకోటి పైమాటే. రైతుల సొమ్మును భద్రంగా ఉంచాల్సిన ఉద్యోగులు గాలికొదిలేశారు. కనీస భద్రత చర్యలు తీసుకోకపోవడంతో దొంగలు వచ్చి తాపీగా ఉన్నదంతా ఊడ్చేశారు. వారు ఇంటి దొంగలా? బయట దొంగలా? అనేది విచారణలో తేలనుంది. కాటారం దక్కన్ గ్రామీణ బ్యాంకులో బంగారం మాయం ఘటన మరవకముందే ధర్మపురి ప్రాథమిక సహకార సంఘంలో చోరీ జిల్లావాసులను ఆందోళనకు గురిచేస్తోంది. - న్యూస్‌లైన్, ధర్మపురి
ధర్మపురి న్యూస్‌లైన్ : ధర్మపురి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో భద్రత ఏర్పాట్లు లేకనే దొంగలు చొరబడ్డారని తేలిపోయింది. పట్టణంలోని నం బరు 63 జాతీయ రహదారిపై నిత్యం వాహనా లు రాకపోకలు సాగుతుంటాయి. సంఘానికి కేవలం 50మీటర్ల దూరంలోనే తహశీల్దార్, మండల పరిషత్ తదితర ప్రభుత్వ కార్యాలయా లు ఉన్నాయి. జనసంచారం అధికంగా ఉంటుం ది. అయినా వీటి సమీపంలోని పీఏసీఎస్‌లో చోరీ జరగడం గమనార్హం. నగదుతోపాటు రూ.లక్షల విలువైన బంగారు ఆభరణాలు భద్రపర్చే సింగిల్ విండోలో భద్రతా పరమైన ఎలాంటి ఏర్పాట్లూ చేయలేదు. కనీసం సీసీ కెమెరాలు బిగించలేదు. వాచ్‌మన్ సైతం లేడు. ఇది అధికారుల నిర్లక్ష్యానికి అద్దంపడుతోంది.
షట్టర్లు పగులగొట్టి.. లాకర్లు తెరచి..
ముందుగా పీఏసీఎస్ షట్టర్ల తాళాలను వేటకొడవలితో కోసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. గదిలో ఓ మూలకు పడిఉన్న వేటకొడవలి ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. షట్టర్లు తెరిచిన దొంగలు.. నేరుగా లోనికి ప్రవేశించారు. ఆ తర్వాత తాళాలతో లాకర్లు తెరిచినట్లు అధికారులు గుర్తించారు. ఈ సమయంలో దొంగలు మద్యం తాగినట్లు అనుమానిస్తున్నారు. పీఏసీఎస్‌లో ఆరుగురు సిబ్బంది ఉన్నారు.
రెండు లాకర్లు, నాలుగు బీరువాలు ఉన్నాయి. ఒక లాకరులో ఆభరణాలు, మరోదానిలో నగదు భద్రపరుస్తున్నారు. వాటికి సంబంధించిన తాళం చెవులు మేనేజరు వద్ద ఉండాలి. మేనేజర్ బుచ్చన్న మంగళవారం ఆఫీస్ పనిపై కరీంనగర్ వెళ్లగా మిగతా వారు విధుల్లో ఉన్నారు. తాళం చెవులను బీరువాలోని రహస్య లాకర్‌లో పెట్టి విధులు ముగించుకుని ఎవరి ఇళ్లకు వారు వెళ్లారు. వీటిని చూసిన వారే ఈ చోరీకి పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాళాలతో నేరుగా బీరువా తెరిచి అందులోని లాకర్ తాళాలు తీసుకుని లాకర్ తెరిచి ఆభరణాలు ఎత్తుకెళ్లారంటే బాగా తెలిసిన వారి పనే అయి ఉంటుందని భావిస్తున్నారు.
రూ.50 లక్షల వరకు చోరీ
పీఏసీఎస్‌లో రూ.50 లక్షల విలువైన బంగారం(1345.42 గ్రాములు), రూ.2.85 లక్షలు నగదు అపహరణకు గురైందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ధర్మపురి సింగిల్‌విండో పరిధిలో 16 గ్రామాలకు చెందిన 27మంది బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టారు. సుమారు రూ.25 లక్షల రుణాలు పొందారు. తాకట్టు పెట్టిన ఆభరణాలపై యాభై శాతం వరకు రుణం అందిస్తారు. ఈ లెక్కన ఆభరణాల అసలు విలువ సుమారు రూ.50 లక్షలు ఉంటుందని అంచనా. విండోపై ఎంతో నమ్మకంతో విలువైన ఆభరణాలు కుదవపెట్టిన వారికి ఈ సంఘటనతో ఆందోళన మొదలైంది.
దొంగలను పట్టుకుంటాం
పీఏసీఎస్‌లో చోరీకి పాల్పడిన దొంగలను పట్టుకుంటామని సీఐ మహేందర్ తెలిపారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌తో కలిసి పరిశీలించారు. ఎస్సై జగన్‌మోహన్ ఆధ్వర్యంలో విచారణ వేగవంతం చేశారు. కరీంనగర్ నుంచి క్లూస్ టీంను రప్పించారు. జాగిలాలతోనూ పరిశీలించారు. సంఘటనా స్థలం నుంచి స్థానిక ఆర్‌అండ్ బీ వసతి గృహం వరకు వెళ్లిన జాగిలం.. దర్గా వద్దకు వెళ్లే రహదారి వద్ద ఆగిపోయింది. కాగా, వేలిముద్ర నిపుణులు.. అనుమానితులతో పాటు సిబ్బంది వేలిముద్రల్ని సేకరించారు.
భద్రత డొల్ల..
Published Thu, Dec 26 2013 4:11 AM | Last Updated on Sat, Sep 2 2017 1:57 AM
Advertisement
Advertisement