కొత్త రాజకీయం | The new politics | Sakshi
Sakshi News home page

కొత్త రాజకీయం

Published Sat, Mar 8 2014 4:18 AM | Last Updated on Sat, Sep 2 2017 4:27 AM

The new politics

 ప్రజాగ్రహానికి గురికాకుండా కాంగ్రెస్ పడవ నుంచి దూకేసిన జిల్లా ఎమ్మెల్యేలు ఏ ఒడ్డుకు చేరుకోవాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. దరి ఎంపిక చేసుకునే సమయంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత కుంపటి ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడంతో కొంత అయోమయం చోటుచేసుకుంది.

కొత్త పార్టీ ప్రకటన తర్వాత కిరణ్ సోదరుడు కిషోర్ జిల్లాలో పావులు కదపడం ప్రారంభించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆకర్షించే పనిలో ఉన్నారు. అందులో భాగంగా పలువురితో మంతనాలు జరిపినట్టు తెలిసింది. దీంతో వారు ఎటూ తేల్చుకోలేక ఊగిసలాట ధోరణిలో  ఉన్నారు. నిన్నటి వరకు అధికార పార్టీ పేరు చెప్పుకున్న వారు ఇప్పుడు కాంగ్రెస్ పేరు చెబితేనే ఈసడించుకుంటున్నారు. ప్రత్యామ్నాయం కనిపించక అంతే స్థాయిలో ఆందోళన చెందుతున్నారు. గంగాధరనెల్లూరు, పూతలపట్టు, మదనపల్లె, చిత్తూరు ఎమ్మెల్యేలు గుమ్మడి కుతూహలమ్మ, డాక్టర రవి, షాజహాన్‌బాషా, సీకే.బాబులు రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోలేని పరిస్థితి.

మాజీ మంత్రి గల్లా అరుణకుమారి మాత్రం ఒక అడుగు ముందుకేశారు. శనివారం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు అనుచరులతో హైదరాబాద్ చేరుకున్నారు. అయితే ఆమె ఆశించినట్టుగా పెద్ద సంఖ్యలో ఆమె వెంట కాంగ్రెస్ శ్రేణులు వెళ్లలేదు. చంద్రగిరి నియోజకవర్గం నాయకులతో పాటు ఇద్దరుముగ్గురు పడమటి మండలాలకు చెందిన ద్వితీయశ్రేణి నాయకులు ఉన్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ రవి, అరుణమ్మతో పాటు టీడీపీలో చేరుతారని ప్రచారం జరిగిన ప్పటికీ ఆయన ప్రస్తుతానికి ముఖం చాటేసినట్టు చెబుతున్నారు. సెల్‌ఫోన్‌లో కూడా అందుబాటులో లేరు.
 

 కిరణ్‌ను కలిసిన కుతూహలమ్మ
 మాజీ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డితో గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే గుమ్మడి కుతూహలమ్మ శుక్రవారం భేటీ అయ్యారు. మధ్యాహ్నంగా కిరణ్ ఇంటికి వెళ్లిన ఆమె గంటకు పైగా మంతనాలు జరిపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆమె తెలుగుదేశం పార్టీలో చేరుతారని విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే కిరణ్‌తో భేటీ కావడంతో అనుమానాలకు తెరతీస్తోంది. భేటీ వివరాలు తెలియరానప్పటికీ ఏ పార్టీలో చేరాలన్న విషయమై డోలాయమానంలో ఉన్నట్టు సమాచారం. కుతూహలమ్మను కిరణ్ ఇంటికి రప్పించడంలో ఆయన సోదరుడు కిషోర్‌కుమార్‌రెడ్డి కీలకపాత్ర పోషించారని చెబుతున్నారు.

కాగా మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్‌బాషా రెండు రోజులుగా అందుబాటులో లేరు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నట్టు చెబుతున్నారు. ఒకవైపు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులతో సంప్రదింపులు కొనసాగిస్తూనే మరోవైపు ఇతర ప్రత్యామ్నాయాల వైపు కూడా దృష్టి సారించారని సమాచారం. నియోజకవర్గ నాయకులతో ఆయన టచ్‌లో లేరు. షాజహాన్‌కు అత్యంత సన్నిహితుడైన మదనపల్లె వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీరాం చినబాబు టీడీపీలో చేరేందుకు అరుణమ్మతో హైదరాబాద్ వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న షాజహాన్, అరుణమ్మపై ఆగ్రహంతో ఉన్నారని అంటున్నారు. శని, ఆదివారాల్లో  హైదరాబాద్ చేరుకుంటారని చెబుతున్నారు. చిత్తూరు ఎమ్మెల్యే సీకే బాబు ఇంకా గుంభనంగా వ్యహరిస్తున్నారు. ఆయన ఎటువైపు మొగ్గుతారనేది ఊహకు అందడం లేదు. ప్రస్తుతం చిత్తూరు కార్పొరేషన్‌కు జరుగుతున్న ఎన్నికలపై ఆయన దృష్టి సారించారు.

దీనికి సంబంధించిన కసరత్తు పూర్తి చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారని సీకే అనుచరవర్గాలు అంటున్నాయి. నగరి మాజీ ఎమ్మెల్యే రెడ్డివారి చెంగారెడ్డి పరిస్థితి కూడా ఇంతే. మున్సిపల్ ఎన్నికలు ముగిసే వరకు భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో లేరని ఆయన అనుచరవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
 

 కిరణ్ పార్టీలోకి రెడ్డివారి రాజశేఖర్‌రెడ్డి
 మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేస్తున్న కొత్త పార్టీలో చేరేందుకు మాజీ ఎమ్మెల్యే రెడ్డివారి రాజశేఖర్‌రెడ్డి సన్నాహాలు చేస్తున్నారు. ఆ మేరకు చర్చలు జరిగినట్టు తెలిసింది. చంద్రగిరి నియోజకవర్గం నుంచి రాజశేఖర్‌రెడ్డి సతీమణి భార్గవిని పోటీ చేయించే విషయమై వారి మధ్య చర్చకు వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. అదేవిధంగా తిరుచానూరు మాజీ సర్పంచ్ సీఆర్ రాజన్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement