అరుణమ్మపై సీనియర్ల గుర్రు
సాక్షి, తిరుపతి: ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ మంత్రి గల్లా అరుణకుమారిపై ఆ పార్టీ సీనియర్ల జంట గుర్రుగా ఉంది. సొంత నియోజకవర్గాలకు వెళ్లిన సమయంలో తప్పితే జిల్లా లో జరిగే పార్టీ కార్యక్రమాలకు ఎప్పుడూ ఒకటిగా వెళ్లే ఈ సీనియర్లు పార్టీలో అరుణమ్మ చేరికను జీర్ణించుకోలేకపోతున్నారు.
జిల్లాలో గల్లా కుటుం బానికి అంతోఇంతో పేరుంది. దీంతోపాటు ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నారు. నిన్నటి వరకు రాష్ట్ర కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. దీంతో భవిష్యత్తులో అధినేత చంద్రబాబు దగ్గర తమ ప్రాధాన్యం తగ్గుతుంద నేది సీనియర్లయిన మాజీ మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, గాలి ముద్దుకృష్ణమనాయుడుల ఆందోళనగా టీడీపీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇందుకు పలు ఉదాహరణలు కూడా ఆ వర్గాలు వివరిస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న సమయంలోనే గల్లా అరుణకుమారి కుటుంబ సభ్యులు టీడీపీలో చేరుతారనే ఊహాగానాలు వచ్చాయి. ఆ మేర కు అరుణకుమారి కుమారుడు గల్లా జయదేవ్ తిరుపతి అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు ముందుకువచ్చారు. ఆ తర్వాత పరిణామాల్లో ఆయన మనసు మార్చుకుని గుంటూరు నుం చి లోక్‌సభకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. కుమారుని రాజకీ య భవిష్యత్తు దృష్ట్యా గల్లా అరుణకుమారి కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ నెల 8వ తేదీన చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ మొత్తం వ్యవహారం ఏడాది కాలంగా నడుస్తున్నప్పటికీ బొజ్జల గాని ముద్దుకృష్ణమ గాని గల్లా చేరికపై పెదవి విప్పలేదు. రాష్ట్ర కేబినెట్ నుంచి వైదొలిగి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు అరుణకుమారి ప్రకటించిన తర్వాత కూడా ఇద్దరు సీనియర్ల నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం గమనార్హం. అంతేకాకుండా వారి చేరిక సమయంలోనూ జిల్లా పార్టీలో కీలకం గా వ్యవహరిస్తున్న బొజ్జల, ముద్దుకృష్ణమ లేరు.
ఈ కార్యక్రమానికి వారిని ఆహ్వానించినా వెళ్లలేదని తెలిసింది. అరుణకుమారితో ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని వారు భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిన్నటివరకు విమర్శించిన నోటితోనే ఆమెను ప్రశంసిస్తూ ఆహ్వానం పలకడమంటే ప్రజల్లో చులనభావం ఏర్పడే ప్రమాదం ఉన్నందునే తాము ఆ కార్యక్రమానికి హాజరు కాలేదని సీనియర్లు అక్కడక్కడ మాట్లాడుతున్నట్టు చెబుతున్నారు. నిజానికి వారి గైర్హాజరు వెనుక ఉన్న అసలు విషయం వీలైనం త వరకు అరుణమ్మకు దూరంగా ఉండాలన్న అభిప్రాయమని తెలిసిం ది.
టీడీపీలో చేరిన తర్వాత కూడా ముగ్గురు మాజీ మంత్రులు ఒక వేదికపైకి వచ్చిన సందర్భం లేదు. మరీ ముఖ్యంగా నగరి ఎమ్మెల్యే ముద్దుకృష్ణమనాయుడు అంతర్గతంగా రగిలిపోతున్నట్టు సమాచారం. ఒకే సామాజికవర్గం కావడంతో తన అవకాశాలను అరుణమ్మ ఎక్కడ ఎగరేసుకుపోతారోనన్న ఆందోళన ఆయనలో ఉన్నట్టు టీడీపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పటివరకు ఒకటిగా ఉంటూ వస్తున్న ముద్దుకృష్ణమ, గోపాలకృష్ణారెడ్డి ఇదే ఐక్యత కొనసాగించాలనే నిర్ణయంతో ఉన్నట్టు తెలిసింది. ఎవరి అవకాశాలకు అరుణమ్మ గండికొట్టే ప్రయత్నం చేసినా ఇద్దరూ కలసికట్టుగా ఎదుర్కోవాలని వారు భావిస్తున్నారు.
చంద్రగిరిలో అరుణమ్మకు పొగబెట్టే ప్రయత్నం?
చంద్రగిరి నియోజకవర్గంలో అరుణకుమారికి పొగబెట్టేప్రయత్నం జరుగుతున్నట్టు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. ముద్దుకృష్ణమనాయుడుకు అత్యంత సన్నిహితంగా మెలిగే చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ నేతలు అరుణమ్మకు ఏ మాత్రం సహకరించడంలేదు. ఈ నియోజకవర్గ టికెట్టుపై ఆశలు పెట్టుకున్న పేరం హరిబాబు, వలపల దశరథనాయుడు తదితరులను తెరవెనుక నుంచి ముద్దుకృష్ణమ ప్రోత్సహిస్తున్నారని అంటున్నారు. ఇటీవల నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ అరుణమ్మ ఏర్పాటు చేసిన పార్టీ సమావేశాల్లో కార్యకర్తల నుంచి ఆగ్రహావేశాలు రావడం కూడా ఇందులో భాగమేనని చెబుతున్నారు.
ఎంపీ శివప్రసాద్‌పైనా సీనియర్ల ఆగ్రహం
కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన మాజీ మంత్రి గల్లా అరుణకుమారికి పూర్థిస్థాయిలో సహకారం అందిస్తున్న చిత్తూరు లోక్‌సభ సభ్యులు ఎన్.శివప్రసాద్‌పై కూడా శ్రీకాళహస్తి, నగరి ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు దగ్గర సొంత ఇమేజ్ పెంచుకునేందుకు అవసరానికి మించి శివప్రసాద్ వ్యవహరిస్తున్నారనే భావన ఇద్దరు సీనియర్లలో ఉందని అంటున్నారు. మొత్తానికి టీడీపీలో అరుణమ్మ చేరిక వ్యవహారం ఒక వర్గానికి ఇబ్బందికరంగా ఉందనేది మాత్రం స్పష్టం అవుతోంది.