
ఉత్సాహం రంకేసింది
జన సంద్రమైన రంగంపేట
పదిమందికి గాయాలు
ఉత్సాహం రంకెలేసింది.. సంప్రదాయం ఉట్టిపడింది.. పశువుల పండుగ కనువిందు చేసింది.. సంక్రాంతి సందర్భంగా శనివారం చంద్రగిరి మండలం ఏ.రంగంపేటలో నిర్వహించిన జల్లికట్టు యువకుల్లో కొత్త జోష్‌ను నింపింది. మొదట కోడెగిత్తల కొమ్ములకు చెక్కపలకలు కట్టి వీధుల్లో పరుగెత్తించారు. వాటిని నిలువరించి, పలకలను చేజిక్కించుకోవడానికి యువకులు పోటీపడ్డారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన జనంతో పరిసరాలు కిక్కిరిసిపోయాయి. వాహనరాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.
చంద్రగిరి: కోడెగిత్తల రంకెలు హోరెత్తించాయి. గిత్తలను పట్టుకోవడానికి యువకులు హుషారుగా పరుగులు తీశారు. మండలంలోని ఏ.రంగంపేటలో శనివారం జల్లికట్టు కోలాహలంగా సాగింది. ఈ సందర్భంగా కోడెగిత్తలకు కట్టిన పలకలను చేజిక్కిచ్చుకోవడానికి యువకులు పోటీలు పడ్డారు. పలకలను దక్కించుకున్న యువకులు ఆనందంగా ఈలలు వేసి, కేరింతలు కొట్టారు. ఆనందకేళిలో మునిగి తేలారు.
ఇరువర్గాల మధ్య గొడవ
జల్లికట్టులో అక్కడక్కడ యువకుల గ్రూపుల మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. ఎద్దులను నిలువరించే సమయంలో తాము పట్టామంటే.. తామని గొడవలకు దిగా రు. దీంతో యువకులు చెక్క పలకల కోసం కొట్టుకునే స్థాయికి దిగారు. దీంతో పోలీసులు స్వల్పంగా లాఠీకి పని చెప్పడ ంతో గొడవలు సద్దుమణిగాయి. పశువుల నుంచి చెక్క పలకలను సొంతం చేసుకునే క్రమంలో సుమారు పది మందికి యువకులకు గాయాలయ్యాయి.
గట్టి బందోబస్తు
మండలంలో జల్టికట్టు చట్టవిరుద్ధమని మూడు రోజులు గా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అయినా తరతరాలుగా జరుపుకుంటున్న పండుగను నిలిపే ప్రసక్తే లేద ని గ్రామస్తులు తేల్చిచెప్పారు. దీంతో పోలీసులు ముందస్తుగా చంద్రగిరి, తిరుపతి పోలీసులు, స్పెషల్‌ఫోర్సుతో బందోబస్తును ఏర్పాటు చేశారు.