వారు ఎవరో తెలియదు, ఎప్పుడూ విధులకు రారు.. కానీ వేతనాలు మాత్రం పొందుతున్నారు. ఈ తతంగం కావలి మున్సిపాలిటీలో ఏళ్లుగా సాగుతోంది.
♦ జీతాల పేరిట ఏడాదికి రూ16.32 లక్షలు డ్రా
♦ విచారిస్తామంటున్న కమిషనర్
కావలి : వారు ఎవరో తెలియదు, ఎప్పుడూ విధులకు రారు.. కానీ వేతనాలు మాత్రం పొందుతున్నారు. ఈ తతంగం కావలి మున్సిపాలిటీలో ఏళ్లుగా సాగుతోంది. నకిలీల కారణంగా మున్సిపాలిటీలో ఏడాదికి రూ.16.32 లక్షలు గోల్‌మాల్ అవుతున్నాయి. మున్సిపాలిటీలోని కొందరు ఉద్యోగులు, పెద్దలు ఈ గోల్‌మాల్‌లో భాగస్వామ్యులైనట్లు ఆరోపణలున్నాయి. సమ్మె చేస్తున్న మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు అధికారులు నోటీసులు ఇవ్వడంతో ఈ దోపిడీ వెలుగులోకి వచ్చింది. గత పదేళ్లుగా ఇదే రీతిలో మున్సిపాలిటీలో వేతనాల గోల్‌మాల్ జరుగుతుందని సమాచారం.
నోటీసులలో 39 మంది మున్సిపల్ రెగ్యులర్ పారిశుధ్య కార్మికులు ఉన్నట్లు వారి పేర్లను కూడా అందులో ఉంచారు. పట్టణంలో మూడు డివిజన్ల కింద పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వారిలో 165 మంది వరకు కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులు ఉండగా మరో 28 మంది రెగ్యులర్ పారిశుధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. సమ్మె చేస్తున్న మున్సిపల్ రెగ్యులర్ కార్మికులకు అధికారులు ఇచ్చిన నోటీసులలో అదనంగా మరో 11మందిని చేర్చారు. ఆ 11 మంది పేరున నెలకు రూ. 1.36 లక్షలు డ్రా అవుతున్నాయి. పదేళ్లకుపైగా ఈతంతు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇలా రూ. కోట్లలో ప్రజాధనాన్ని వేతనాల పేరిట కొందరు భోంచేశారు. నకిలీలను చూపి మున్సిపాలిటీలో పాతుకుపోయిన కొందరు ఉద్యోగులు, పెద్దలు వ్యవహారం నడిపినట్లు ఆరోపణలున్నాయి.
విధులకు రాకున్నా జీతాలు డ్రా
11 మంది పారిశుధ్య కార్మికులు విధులకు రాకున్నా వారి పేరిట జీతాలను కొందరు అధికారులు డ్రా చేస్తున్నారని మున్సిపల్ పర్మినెంట్ వర్కర్స్ యూనియన్ పట్టణ అధ్యక్షుడు చేవూరి కొండయ్య, కార్యదర్శి పాముల సుబ్బరాయుడు తెలిపారు. వారి పేరిట నెలకు రూ.1.36 లక్షలు డ్రా అవుతున్నాయి. నకిలీ ఉద్యోగుల పేరిట వేతనాలు డ్రా చేస్తున్న వారిపై విచారణ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
విచారణ చేస్తాం: -శ్రీనివాసులు, కమిషనర్ కావలి
ఈ విషయం నా దృష్టికి వచ్చింది. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తాం. పూర్తిస్థాయిలో విచారిస్తే తప్ప వాస్తవాలు వెలుగులోకి రావు. దీనికి సంబంధించి వివరాలను తీసుకుంటున్నాను.