సాక్షి, నల్లగొండ: పల్లెలకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. ఇప్పటికే ఆర్థికలేమితో కొట్టుమిట్టాడుతున్న పంచాయతీలకు విద్యుత్ షాక్ తగలనుంది. మైనర్, మేజర్ గ్రామ పంచాయతీల్లో (జీపీ) తాగునీటి పథకాలు, వీధి దీపాలకు సంబంధించిన విద్యుత్‌చార్జీలు ఇకపై పంచాయతీలే భరించాల్సి ఉంటుంది. అంతేగాక ఇప్పటివరకు ఉన్న బకాయిలు కూడా చెల్లించాల్సిందేనని సర్కారు స్పష్టం చేసింది. ఈ మేరకు మూడు రోజుల క్రితం జీఓ జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పల్లెలు మరింత అధోగతికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి.
కష్టకాలమే..
జిల్లాలో మొత్తం 1169 పంచాయతీలు ఉన్నాయి. ఇందులో మేజర్ 15పోను మిగిలినవన్నీ మైనర్ పంచాయతీలే. ఆయా గ్రామాలకు సంబంధించిన విద్యుత్ చార్జీలను మొన్నటి వరకు ప్రభుత్వమే నేరుగా రాష్ట్రస్థాయిలో చెల్లించేది. ఈ చర్య ద్వారా పల్లెలకు విద్యుత్ భారం తప్పేది. ఆర్థికంగా వెసులుబాటు కలిగేది. ఇకపై పల్లెల్లో ప్రతి వీధిలోని స్తంభానికి బల్బులు ఏర్పాటు చేయాలన్నా పంచాయతీలు ఒకటికి మూడుసార్లు ఆలోచించాల్సిందే. ముఖ్యంగా చిన్న పంచాయతీలు ఆచిచూచి అడుగేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు పంచాయతీల విద్యుత్ బకాయిలు, నెలవారీ బిల్లులు చెల్లిస్తూ వస్తున్న ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకోవడమే అందుకు ప్రధాన కారణం.
బకాయిలూ....
13వ ఆర్థిక సంఘం, ఎస్‌ఎఫ్‌సీ (రాష్ట్ర ఆర్థిక సంఘం) నిధుల నుంచి విద్యుత్ శాఖకు వెళ్లాల్సిన బకాయిల మొత్తాన్ని రెండు వాయిదాల్లో చెల్లించాలని చెప్పింది. అంతేగాక ఇక మీదట పంచాయతీలే విద్యుత్ చార్జీలు ఎప్పటికప్పుడు చె ల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. స్థానిక సంస్థలకు నిధులు లేకుండా ప్రభుత్వం ఇప్పటికే నిర్వీర్యం చేసింది. ఇప్పుడు విద్యుత్‌చార్జీలను మళ్లీ పాత పద్ధతిలో పంచాయతీలే చెల్లించాలని పేర్కొనడం జీపీలకు శరాఘాతమే. పల్లెల్లో చీకటి వీధులు దర్శనమివ్వడం ఖాయమని పలువురు పేర్కొంటున్నారు.
గతంలో ప్రభుత్వమే..
2008 వరకు విద్యుత్ బిల్లులు పంచాయతీలే చెల్లించేవి. ప్రభుత్వాలు అభివృద్ధి పనులకే సరిగా నిధులు విడుదల చేయలేకపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో విద్యుత్ బిల్లులు చెల్లించడం జీపీలకు తలకుమించిన భారంగా మారింది. ఇలా ఏటికేడు బకాయిల కుప్ప పేరుకుపోయింది. వీటిని చెల్లించకపోతే పల్లెలకు విద్యుత్ కట్ చేస్తామని ట్రాన్స్‌కో అధికారులు పలుమార్లు లేఖలు పంపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే నేరుగా బాధ్యత తీసుకొని అప్పుడప్పుడు కొంతమేర బకాయిలు చెల్లిస్తూ వస్తోంది.
పెండింగ్‌లో రూ 56 కోట్లు...
జిల్లాలోని పంచాయతీలకు ప్రతినెలా సుమారు రూ 4.50 కోట్ల విద్యుత్ బిల్లులు వస్తున్నాయి. వీటిని అప్పుడప్పుడు ప్రభుత్వం చెల్లిస్తూ వస్తోంది. అయినా ఇంకా జీపీలపై రూ 56 కోట్ల బకాయిల భారం ఉందని విద్యుత్ శాఖాధికారులు పేర్కొం టున్నారు. ఈ మొత్తాన్ని చెల్లించడం పంచాయతీలకు శక్తికి మించిన భారమే. అంతేగాక ప్రతినెలా వచ్చే బిల్లులు కూడా చెల్లించాలి. చాలా గ్రామాలకు ఎటువంటి ఆదాయమూ సమకూరడం లేదు. పన్ను వస్తున్న పంచాయతీలు చాలా అరుదు. ఇటువంటి సమయంలో విద్యుత్ బిల్లులు చెల్లించమనడం.. పంచాయతీలను మరింత దిగజార్చేందుకు తీసుకున్న నిర్ణయమేనని పలువురు పేర్కొంటున్నారు.
బిల్లులు గ్రామ పంచాయతీలే చెల్లించాలని ఉత్తర్వులు
Published Mon, Dec 23 2013 4:16 AM | Last Updated on Sat, Sep 29 2018 5:21 PM
Advertisement
Advertisement