అనంతపురం క్రైం, న్యూస్‌లైన్ : అసాంఘిక శక్తులపై రౌడీషీట్ తెరిచిన పోలీసులు.. అందులో వారి వివరాలు పొందుపరచడం మరిచిపోయారు. జిల్లా వ్యాప్తంగా ఎంతమంది రౌడీషీటర్లు ఉన్నారు.. ఇందులో పాతవారు ఎందరు.. కొత్తగా నమోదైన వారెందరు.. ఎవరైనా తమ ప్రవర్తనను మార్చుకుని ప్రశాంత జీవనం గడుపుతున్నారా.. వంటి సమాచారమేదీ ఉన్నతాధికారుల వద్ద లేదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రౌడీ షీటర్లపై పోలీసులు దృష్టి సారించకపోవడం ఆందోళనకు గురి చేస్తోంది.
చిన్నా చితకా దందాలు చేసి పూట గడిపే రౌడీషీటర్లు ప్రస్తుతం నగరాన్ని శాసించే స్థాయికి ఎదిగారు. కిరాయి హత్యలు, మాట వినకపోతే బెదిరింపులు, ల్యాండ్ సెటిల్మెంట్లు, అధిక వడ్డీలు, అత్యాచారాలకు తె గబడుతున్నారు. పోలీసుల ఉదాసీన వైఖరే ఇందుకు కారణమనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి రౌడీ షీటరూ ఏదో ఒక రాజకీయ పార్టీ అండ చూసుకుని పేట్రేగిపోతున్నాడు. రాజకీయ పార్టీల నేతలు అడిగిన పని చిటికెలో చేసి పెడుతున్నారు. ఒకప్పుడు పోలీసులను చూస్తే వణికిపోయే రౌడీమూకలు నాయకుల పేరు చెప్పుకుని ఏకంగా పోలీస్‌స్టేషన్లలోనే పంచాయితీలు చేస్తున్నారు.
జిల్లా కేంద్రం అనంతపురంలో 229 మంది రౌడీషీటర్లు ఉన్నట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఇందులో వన్‌టౌన్ పరిధిలో అత్యధికంగా 130, టూటౌన్ పరిధిలో 80, త్రీటౌన్ పరిధిలో 38 మంది ఉన్నారు. వీరిలో ఇద్దరు వయసు మళ్లినవారు ఉండటంతో వారిపై రౌడీషీట్ ఎత్తేశారు. మరో పది మందిపై రౌడీషీట్లు తెరిచేందుకు పోలీసు ఉన్నతాధికారుల అనుమతి కోసం జాబితాను పంపారు. రూరల్ పోలీస్‌స్టేషన్‌లో 100 మందికి పైగా రౌడీషీటర్లు ఉన్నారు. వీరిలో అత్యధికులు వృద్ధులు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి.
పెద్దలకు కౌన్సెలింగ్ లేదట : రాజకీయ పార్టీల ముసుగులో ఉన్న రౌడీషీటర్ల (పెద్దల)కు పోలీస్ కౌన్సెలింగ్ ఉండదట. చిన్నా చితక పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారిపై మాత్రం విరుచుకుపడే పోలీసులు.. ఆ పెద్దలకు ఎందుకు కౌన్సెలింగ్ ఇవ్వలేదని అడిగితే... వారు ప్రశాంత జీవనం సాగిస్తున్నారని సమాధానమిస్తున్నారు. నగర శివారులోని 44వ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఓ పెద్దమనిషి దందాలు చేస్తున్నా.. అధికారులకు కనిపించవు.. వినిపించవు అని స్థానికులు ఆరోపిస్తున్నారు.
కొన్ని రాజకీయ పార్టీలకు రౌడీషీటర్లే అస్త్రాలు:ఎన్నికలు సమీపిస్తుండటంతో కొన్ని రాజకీయ పార్టీలు ఓట్ల శాతం పెంచుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలకు అండగా ఎవరు నిలుస్తున్నారనే దానిపై రహస్య సర్వేలు చేయించి గుర్తించాయి. ఆ వ్యక్తులను బెదిరించి.. ఆయా వర్గాల ఓట్లను తమవైపు మళ్లించుకునేందుకు రౌడీషీటర్లను అస్త్రాలుగా వాడుకునేందుకు నేతలు సిద్ధమయ్యారు. ఇందు కోసం రౌడీషీటర్లు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కొన్ని సెటిల్మెంట్లు.. దందాలు అప్పగించారని తెలిసింది.
బకాయి వేతనం చెల్లించండి వీవోఏల సంఘం వినతి
అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్: ఇందిరా క్రాంతి పథకంలో పనిచేస్తున్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు (వీవోఏ)లకు ఏడు నెలల బకాయి వేతనం వెంటనే చెల్లించాలని వీవోఏ ఉద్యోగుల సంఘం నేతలు డీఆర్‌డీఏ-ఐకేపీ పీడీ కె.నీలకంఠరెడ్డికి విజ్ఞప్తి చేశారు. సంఘం అధ్యక్షుడు ఎం.బాబు, ప్రధాన కార్యదర్శి ఈఎస్ వెంకటేష్, ఉద్యోగులు సోమవారం పీడీని కలిసి వినతిపత్రం అందజేశారు.గత ఏడాది ఆగస్టు నుంచి వేతన బకాయిలు ఉన్నట్లు తెలిపారు.
ఇటీవల విడుదల చేసిన జూన్,జూలై మాసాల వేతనం కూడా ఇంతవరకూ అందలేదన్నారు. రూ.2 వేల వేతనం ఇస్తామన్న హామీ ఇప్పటిదాకా అమలులోకి రాలేదన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామన్నారు. వెంటనే బకాయి వేతనాలు చెల్లించి, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సంఘం నేతలు టి.శివ, నాగరాజు, శ్రీనివాసులు, పి.నాగయ్య, గంగభూషణ, డాక్యానాయక్, శీనప్ప తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
అనంతపురం టౌన్, న్యూస్‌లైన్: రీజియన్ పరిధిలోని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నేషనల్ మస్దూర్ యూనియన్ నాయకులు ఆర్టీసీ ఆర్‌ఎంకు విన్నవించారు. సోమవారం ఆర్‌ఎం చాంబర్‌లో ఆయనను కలిసి 38 సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ రీజనల్ కార్యదర్శి భాస్కర్‌నాయుడు మాట్లాడుతూ, సంస్థ ప్రగతి కోసం నిరంతరం శ్రమించే కార్మికులు కొందరు అధికారుల వైఖరితో సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు.
టికెటింగ్ యంత్రాల వినియోగంతో డ్రైవర్లకు విశ్రాంతి లేకుండా పోయిందని, ఫలితంగా ప్రమాదాలు జరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి డ్యూటీలను యాక్టుకు అనుగుణంగా మార్చాలని డిమాండ్ చేశారు. బెంగుళూరులో బస్సులకు పార్కింగ్ ప్లేస్‌లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మేజర్ డ్యామేజీ అయిన బస్సులను జడ్‌డబ్ల్యుఎస్‌కు పంపాలన్నారు.
పేట్రేగుతున్న రౌడీషీటర్లు
Published Tue, Jan 21 2014 4:29 AM | Last Updated on Tue, Aug 21 2018 7:26 PM
Advertisement
Advertisement