= జిల్లా వాసులపై నెలకు రూ.7.75 కోట్ల భారం
=యూనిట్‌కు 55 పైసలు పెంపు
= రానున్న ఏప్రిల్ నుంచి అమలు
=ఉచిత విద్యుత్ హుష్!
సాక్షి,విజయవాడ : వరుస ఘటనలతో అతలాకుతలమవుతున్న జనానికి ప్రభుత్వం మళ్లీ ధరల షాక్ ఇవ్వనుంది. ఈ మేరకు 2014-15 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ చార్జీలను పెంచేందుకు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు అనుమతిచ్చింది. నష్టాల బాటలో నడుస్తున్నాయనే సాకుతో వినియోగదారులపై చార్జీల సవారీ చేసేందుకు డిస్కంలు సిద్ధమౌతున్నాయి. యూనిట్‌కు 55 పైసలు వరకు పెంచే అవకాశాలున్నాయని తెలుస్తుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి కొత్త విద్యుత్‌చార్జీలు అమల్లోకి రానున్నాయి. ఈసారి పేదల్ని కూడా వదలిపెట్టకుండా చార్జీలు పెంచి వడ్డించేందుకు డిస్కంలు సిద్ధమవుతున్నాయి.
జిల్లాపై రూ.7.5 కోట్ల భారం
జిల్లాలో 14.25లక్షల మంది విద్యుత్ వినియోగదారులున్నారు. వీరిలో సుమారు 11లక్షల మంది గృహవిద్యుత్ వినియోగదారులే. ప్రతిరోజూ జిల్లాలో 50లక్షల యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. యూనిట్‌కు అర్ధరూపాయి చొప్పున పెంచినా...జిల్లాపై రోజుకు రూ.25లక్షల చొప్పున నెలకు రూ.7.75 కోట్ల భారం పడుతుందని అధికారులు చెబుతున్నారు. రెండేళ్లుగా విద్యుత్ చార్జీలు భారీగా పెరిగాయని, సర్‌చార్జీలతో కలుపుకుని రెట్టింపు కావడంతో విద్యుత్ బిల్లుల్ని పట్టుకుంటేనే షాక్ కొడుతున్నాయని వినియోగదారులు వాపోతున్నారు.
ఉచిత విద్యుత్ హుళక్కేనా?....
జిల్లాలో నెలకు 0-50 యూనిట్లులోపు విద్యుత్‌ను వినియోగించే ఎస్సీ,ఎస్టీ వర్గాల వారికి ‘ఇందిరమ్మ కలలు’ పథకం కింద ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. జిల్లాలో 50 యూనిట్లు లోపు విద్యుత్‌ను ఉపయోగించే ఎస్సీ కుటుంబాలు 45వేల వరకు ఉండగా, ఎస్టీ కుటుంబాలు మరో 5వేలున్నాయి. వీరు నెలకు 22.50లక్షల విద్యుత్ యూనిట్లు ఉపయోగిస్తున్నారు. ప్రతి నెలా చెల్లించాల్సిన రూ.32.62లక్షలను ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇప్పటి వరకు యూనిట్ రూ.1.45 పైసలుండగా, రాబోయే రోజుల్లో రెండు రూపాయలకు చేరనుంది. దీంతో మరో రూ 12.37లక్షల అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
ఇప్పటికే ఇందిరమ్మ కలలు పేదలకు ఉచిత విద్యుత్ ఇప్పిస్తున్న ప్రభుత్వం.... బిల్లులు మాత్రం చెల్లించడం లేదని ఆశాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు పెరిగిన చార్జీలతో కలిపి బిల్లులు చెల్లించేందుకు ముందుకు వస్తుందా? లేక ఆభారం పేదలపైనే మోపుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోతే కొత్తగా వచ్చే ప్రభుత్వం పాత బకాయిలు చెల్లించేం దుకు ఇష్టపడకపోతే ఆ చార్జీలు ప్రజల నుంచే వసూలు చేస్తామని అధికారులు చెబుతున్నారు.
మళ్లీ ధరల ‘షాక్’....
Published Thu, Dec 5 2013 1:42 AM | Last Updated on Sat, Jul 6 2019 3:20 PM
Advertisement
Advertisement