పాడి రైతుపై పిడుగు | Vijaya Dairy In Planning To Reduce Milk Prices | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 5 2018 4:09 AM | Last Updated on Sat, Jul 6 2019 3:20 PM

Vijaya Dairy In Planning To Reduce Milk Prices - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌ : విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు చేదువార్త. వారికిచ్చే సేకరణ ధరను తగ్గించాలని డెయిరీ యాజమాన్యం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రధానంగా ఆవు పాలు పోసే రైతులకు లీటరుకు రూ.4 తగ్గించేందుకు కసరత్తు ముమ్మరం చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించి ఒకట్రెండు రోజుల్లో ఆదేశాలు జారీ చేసే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. డెయిరీలోని అనేక వర్గాలు దీన్ని వ్యతిరేకిస్తున్నా యంత్రాంగం మాత్రం వెనక్కి తగ్గనట్లు తెలిసింది. ప్రస్తుతం ఆవు పాల సేకరణ ధరను వెన్న శాతాన్ని బట్టి లీటరుకు రూ. 29.26 నుంచి రూ. 33.43 వరకు ఇస్తున్నారు. ఇక నుంచి ఆయా కేటగిరీల్లోని వాటన్నింటికీ రూ. 4 తగ్గించే అవకాశముంది. డెయిరీకి రైతుల నుంచి వచ్చే 4 లక్షల లీటర్ల పాలలో 20 వేల లీటర్లే గేదె పాలు కాగా, మిగిలిన 3.80 లక్షల లీటర్లు ఆవు పాలే. కాబట్టి ఆవు పాలు పోసే రైతులందరికీ ఇది పిడుగులాంటి నిర్ణయమంటున్నారు. ఈ నిర్ణయం తీసుకుంటే డెయిరీ మరింత సంక్షోభంలోకి వెళ్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి.  

4 లక్షల నుంచి 2 లక్షల లీటర్లకు.. 
విజయ డెయిరీ పాల విక్రయాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. ఏడాదిక్రితం రోజుకు 4 లక్షల లీటర్ల విక్రయాలు ఉండగా, ప్రస్తుతం 2 లక్షల లీటర్లకు పడిపోయాయి. కానీ రైతుల నుంచి సేకరణ మాత్రం అలాగే ఉంది. రూ. 4 ప్రోత్సాహకం ఇస్తుండటంతో దాదాపు 65 వేల మంది రైతులు విజయ డెయిరీకే పాలు పోస్తున్నారు. అయితే వినియోగదారులకు పాల విక్రయాలు పెరగకపోవడంతో అదనంగా 
వచ్చిన పాలను పొడి చేసి నిలువ ఉంచుతున్నారు. కానీ అవీ అమ్ముడుపోక గడువు తీరే దశకు చేరుతుండటంతో రూ.కోట్ల నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొంది. దీంతో ఏం చేయాలో అంతుబట్టక సేకరణ ధర తగ్గిస్తే పాలు పోయరనీ, దాంతో నష్టాలపాలవుకుండా చూసుకోవచ్చని యాజమాన్యం భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. విక్రయాలు పెంచుకోకుండా రైతుకిచ్చే ధరను తగ్గించడం డెయిరీ చరిత్రలో తొలిసారి అంటున్నారు.  
ఏజెంట్ల స్థానంలో డిస్ట్రిబ్యూటర్లు 
డెయిరీ నుంచి పాలను వినియోగదారులకు చేరవేసేది ఏజెంట్లే. 40 ఏళ్ల నుంచి ఏజెంట్ల ద్వారానే పాలు సరఫరా చేస్తున్నారు. వారే వినియోగదారుల నుంచి బిల్లులు వసూలు చేసి డెయిరీకి చెల్లిస్తున్నారు. రాష్ట్రంలో విజయకు పూర్తి స్థాయిలో హైదరాబాద్‌లోనే విక్రయాలుంటాయి. ఆ ప్రకారం నగరంలో 1,650 మంది ఏజెంట్లు పాలు సరఫరా చేస్తుండేవారు. కానీ 40 ఏళ్లుగా డెయిరీతో పెనవేసుకుపోయిన ఏజెంట్ల వ్యవస్థను యంత్రాంగం రద్దు చేసింది. వారి స్థానంలో 112 మందితో డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థను నెలకొల్పింది. ఏజెంట్ల వ్యవస్థను పర్యవేక్షించడం, వినియోగదారుల సమస్యలు పరిష్కరించడం కోసం నగరంలో 18 జోన్‌ కార్యాలయాలుండగా వాటినీ రద్దు చేశారని డెయిరీ వర్గాలు పేర్కొన్నాయి.  

కమీషన్‌ రూ.3.90కు పెంపు 
గతంలో ఏజెంటు కమీషన్‌ లీటరుకు రూ. 2.50 ఇచ్చేవారు. రవాణా ఖర్చుకు గాను 70 పైసలు డెయిరీ చెల్లించేది. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లకు కమీషన్‌ను రూ. 3.90కు పెంచేశారు. రవాణా ఖర్చు 70 పైసలు ఇస్తున్నారు. దీనిపై ఇప్పటివరకు ఏజెంట్లుగా పనిచేసినవారు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు ఏజెంట్ల వ్యవస్థ రద్దుతో పాల విక్రయాలు గణనీయంగా పడిపోయాయి. దీంతో అధికారుల్లోనూ విభేదాలు పొడసూపాయి. చివరకు ఉద్యోగులు సహాయ నిరాకరణ చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. మొత్తంగా డెయిరీని కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నా అధికారుల నిర్ణయాలు శాపాలుగా మారాయన్న చర్చ జరుగుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement