పాల ‘ప్రోత్సాహకం’పై సీలింగ్!
♦ ఆర్థికభారం తగ్గించుకునేందుకు సర్కారు కసరత్తు
♦ పాడి రైతుల వివరాలివ్వాలని విజయ డెయిరీకి ఆదేశం
♦ రైతులకే ప్రోత్సాహక సొమ్ము అందేలా త్వరలో మార్గదర్శకాలు
♦ మండిపడుతున్న డెయిరీ సంఘాలు
♦ భవిష్యత్తులో ప్రోత్సాహకాన్ని ఎత్తేసే కుట్రగా ఆరోపణ
సాక్షి, హైదరాబాద్: విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు అందిస్తున్న నగదు ప్రోత్సాహకంపై సీలింగ్ విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రోత్సాహక సొమ్ము చెల్లింపు వల్ల ఆర్థిక భారం పెరగడంతో దాన్ని తగ్గించుకునేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. విజయ డెయిరీకి పాలు పోసే రైతుల్లో ఎంతమంది ఎన్ని లీటర్లు పాలు పోస్తున్నారో కేటగిరీలవారీగా వివరాలు ఇవ్వాల్సిందిగా డెయిరీ అధికారులను ఆదేశించింది. ఆ వివరాల ఆధారంగా సన్న, చిన్నకారు రైతులు, పెద్ద రైతులు, డెయిరీ వ్యాపారుల్లో ఎందరు ప్రోత్సాహకం తీసుకుంటున్నారో తెలుసుకొని కేవలం రైతులకే ప్రోత్సాహకం అందేలా మళ్లీ మార్గదర్శకాలు రూపొందించనుంది. వ్యాపారుల నుంచి పాలు సేకరించినా వారికి ప్రోత్సాహకం ఇవ్వరాదని సర్కారు భావిస్తోంది.
ప్రోత్సాహకం ఉంటుందా?
విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు లీట రుకు అదనంగా రూ. 4 నగదు ప్రోత్సాహకం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది అక్టోబర్ 29న ఉత్తర్వులు జారీచేసింది. అదే ఏడాది నవంబర్ ఒకటో తేదీ నుంచి ఆ ఉత్తర్వులను అమలు చేస్తూ ఒక్కో లీటరుకు రూ. 28 చెల్లిస్తోంది. ప్రోత్సాహకపు ఉత్తర్వులు అమల్లోకి రాక ముందు విజయ డెయిరీ గతేడాది అక్టోబర్‌లో 1.18 లక్షల లీటర్ల పాలను రైతుల నుంచి సేకరించగా ఉత్తర్వుల అమలు ప్రారంభమైన గతేడాది నవంబర్ నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు పాల సేకరణ సర్కారు అంచనాలకు మించి 5.27 లక్షల లీటర్లకు పెరిగింది.
అయితే ప్రోత్సాహక సొమ్ము చెల్లింపులకు 2015-16 బడ్జెట్లో సర్కారు కేటాయించిన రూ. 12 కోట్లు అయిపోవడంతో అక్టోబర్ వరకు రైతులకు ప్రోత్సాహకపు సొమ్మును సక్రమంగానే అందించిన విజయ డెయిరీ....ఆర్థిక ఇబ్బందుల కారణంగా నవంబర్ రెండో వారం నుంచి ఇప్పటివరకు రైతులందరికీ బిల్లుల సొమ్మును నిలిపేసింది. అలాగే 10 ప్రైవేటు డెయిరీలకూ పూర్తిగా చెల్లింపులు నిలిపేస్తూ నిర్ణయం తీసుకుంది. బకాయిల చెల్లింపులకు రూ. 60 కోట్లు అదనంగా కావాలంటూ లేఖ రాసినా ఇప్పటివరకు సర్కారు నుంచి స్పందన లేదు. ఈ నేపథ్యంలో ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం ఇప్పుడు సీలింగ్ విధానంపై కసరత్తు మొదలుపెట్టింది.
అయితే సీలింగ్ వల్ల నిజమైన రైతులు కూడా అర్హత కోల్పోయే ప్రమాదముందని, భవిష్యత్తులో పాల ప్రోత్సాహకాన్ని ఎత్తివేసేందుకే సర్కారు కుట్ర పన్నిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం డెయిరీ ఫారాలకు ప్రోత్సాహకాన్ని నిలిపివేయడం సమంజసం కాదని ఆదర్శ పాల రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కందాల బాల్‌రెడ్డి విమర్శించారు. పెద్ద ప్రైవేటు డెయిరీ సంస్థలను కాపాడటానికే అధికారులు సిద్ధపడుతున్నారని ఆయన ఆరోపించారు.