సాక్షి ప్రతినిధి, కడప: రిజర్వేషన్ల ప్రక్రియలోనూ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. సంబేపల్లె మండలం శెట్టిపల్లె ఎంపీటీసీ పరిధిలో 1148 మంది ఎస్టీ ఓటర్లు ఉన్నారు. గతంలో ఆ స్థానాన్ని ఎస్టీలకు రిజర్వుడు చేశారు. ఆతర్వాత 164 ఓట్లు ఉన్న రెడ్డివారిపల్లె 4.69 శాతంతో ఉంది.
నిబంధనల మేరకు రెడ్డివారిపల్లెను ఎస్టీలకు రిజర్వుడు చేయాల్సి ఉంది. 48 ఎస్టీ ఓట్లు కల్గిన దేవపట్ల ఎంపీటీసీ 1.78 శాతం ఓట్లు మాత్రమే కల్గి ఉంది. అయితే 27మంది పురుషులు, 127 మంది మహిళలు ఓటు హక్కు కల్గిఉన్నట్లు రూపొందించి, 5.09 శాతం ఓట్లుగా తేల్చి ప్రస్తుతం ఎస్టీలకు రిజర్వుడు చేశారు. 27 మంది మహిళా ఓటర్ల స్థానంలో 127గా చేరుస్తూ చేతివాటం ప్రదర్శించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన యంత్రాంగమే చేతివాటం ప్రదర్శిస్తోంది. తప్పుల తడకగా ఓటర్ల వివరాలను పొందుపర్చి ఒక ఎంపీటీసీ స్థానంలో మరో స్థానాన్ని రిజర్వుడు చేస్తున్నారు.
అదనపు ఆదాయం కోసం కక్కుర్తిపడుతూ ప్రక్రియనే తారుమారు చేస్తున్నారు. జిల్లాలో ఎంపీటీసీల రిజర్వేషన్ల ఎంపిక ప్రక్రియను శుక్రవారం నిర్వహించారు. అధికారులను మభ్యపెట్టి రిజర్వేషన్ల ప్రక్రియను మమ అనిపించారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. సంబేపల్లె మండలంలో ఎంపిక చేసిన జాబితా పరిశీలిస్తే అందుకు రుజువుగా నిలుస్తోంది. రెడ్డివారిపల్లె స్థానాన్ని ఎస్టీలకు కేటాయించాల్సి ఉండగా దేవపట్లను ఎంపిక చేశారు. దీంతో ఆమండలం రిజర్వేషన్ జాబితానే తారుమారైంది.
చేతులు బరువెక్కడంతోనే....
ప్రతి పనిలో కక్కుర్తి పడే ఓ ఉన్నతాధికారి చేతులు బరువెక్కడంతో నిబంధనలను కాలరాసినట్లు తెలుస్తోంది. 27 మంది పురుషులు 27 మంది మహిళలు ఎస్టీ ఓటర్లుగా ఉంటే, 27 సంఖ్యకు ముందువైపు 1ని చేర్చి 127గా రూపొందించినట్లు సమాచారం. నిజంగా ఒక గ్రామంలో 27 మంది పురుషులు ఉంటే 127 మంది మహిళలు ఉండడం విచిత్రంగానే పరిగణించవచ్చు. ఇలాంటి కనీస జాగ్రత్తలను పాటించకుండా ఎస్టీ ఓటర్ల పర్సంటేరూ. పెంచితే ఆమేరకు రిజర్వుడు చేయవచ్చునే కుత్సిత బుద్దితోనే ఆవిధంగా వ్యవహరించారని పలువురు ఆరోపిస్తున్నారు.
లోపభూయిష్టంగా రిజర్వేషన్లు :
మారూ. ఎంపీపీ నరసారెడ్డి
ఎంపీటీసీల రిజర్వేషన్ల ప్రక్రియను లోపభూయిష్టంగా నిర్వహించారు. గత పంచాయితీ ఎన్నికలల్లో ఇలానే వ్యవహరించి దేవపట్లను రిజర్వేషన్లులో చేర్చారు. ప్రస్తుతం 164 ఓట్లున్న రెడ్డివారిపల్లెను ఎస్టీలకు రిజర్వు చేయాల్సి ఉండగా, 48 ఓట్లున్న దేవపట్లను ఎంపిక చేశారు. ఓటర్ల శాతం పెంచుతూ నిబంధలను అతిక్రమిస్తున్నారు. మొత్తం మండలంలోని రిజర్వేషన్లనే తారుమారు చేశారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ కోన శశిధర్‌తో పాటు ఎన్నికల సంఘం ధృష్టికి తీసుకుపోతా.
తారుమారు
Published Sat, Mar 8 2014 2:26 AM | Last Updated on Sat, Sep 2 2017 4:27 AM