తహశీల్దార్ల వెబ్‌సైట్లకు పంపిన ప్రభుత్వం
7,600 పేజీలతో జాబితా
నేడు పంచాయతీ కార్యాలయాలకు
మచిలీపట్నం : పంట రుణమాఫీకి సంబంధించిన జాబితాలను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. వాటిని అన్ని మండల తహశీల్దార్ల వెబ్‌సైట్లకూ పంపింది. రుణమాఫీకి సంబంధించి అర్హుల జాబితాను తయారుచేసిన ప్రభుత్వం దాని వివరాలను తహశీల్దార్ కార్యాలయ వెబ్‌సైట్‌కు పంపి, అక్కడి పాస్‌వర్డ్‌తోనే ఓపెన్ అయ్యేలా ఏర్పాటు చేసింది. ఈ జాబితా 7,600 పేజీల్లో ఉందని పలువురు తహశీల్దార్లు తెలిపారు. రుణమాఫీకి సంబంధించిన మండలం.. అందులోని రెవె న్యూ గ్రామాల వారీగా ప్రకటించినట్లు పేర్కొన్నారు. రుణం తీసుకున్న రైతు పేరు, ఏ బ్యాంకులో తీసుకున్నారు, ఎంత తీసుకున్నారు, రైతు పేరున ఉన్న భూమి వివరాలు ఈ జాబితాలో ఉన్నాయని తహశీల్దార్లు వివరించారు. ఈ జాబితాను శనివారం ఆయా గ్రామాలకు పంపుతామని.. పంచాయతీ కార్యాలయాల్లో వీటిని ప్రదర్శించనున్నామని వారు వివరించారు.
20 శాతమే నగదు జమ...
ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించిన జాబితాను ప్రకటించటంతో అందులో ఎంతమంది పేర్లు ఉన్నాయి. ఎవరెవరి పేరున ఎంత రుణమాఫీ జరిగింది అనే అంశంపై రైతుల్లో ఉత్కంఠ నెలకొంది. పంట రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక కుటుంబానికి రూ.1.50 లక్షలు మాత్రమే రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఈ జాబితాలో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న పంట రుణాలకు సంబంధించిన వివరాలు ఉన్నాయా లేదా అనే అంశంపైనా పలువురు చర్చించుకుంటున్నారు. ఇటీవల ప్రభుత్వం రుణమాఫీ కింద మంజూరు చేయనున్నట్లు ప్రకటించిన రూ.5 వేల కోట్ల నగదును ఒక్కొక్క రైతు పేరున ఉన్న బకాయిలో 20 శాతం మేర జమ చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
అంతా మాయేనా...
ఎన్నికల ప్రచారంలో వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదవీ స్వీకారం రోజున వ్యవసాయ రుణాలన్నీ రద్దు చేస్తామని ప్రకటించారు. దీంతో పాటు రుణమాఫీ ఫైలు పైనే తొలి సంతకం చేస్తామని ఈ ప్రకటనల్లో వివరించారు. ప్రమాణస్వీకారం చేసే సమయంలో రుణమాఫీకి సంబంధించి విధి విధానాలు ఖరారు చేసేందుకు కోటయ్య కమిటీని నియమిస్తున్నట్లు సంతకం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వ్యవసాయ రుణాలు రైతులెవ్వరూ కట్టవద్దని, బంగారం తాకట్టు పెట్టిన రుణాలు తీసుకుంటే ఆ రుణాలు చెల్లించి మీ బంగారం మీ ఇంటికే తీసుకువచ్చి ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ కాలక్రమేణా అరటి, పసుపు, మిర్చి, కూరగాయలు, పూలతోటలు తదితర ఉద్యానవన పంటలకు రైతులు తీసుకున్న రుణాలను రుణమాఫీ జాబితాను తొలగించారు. మహిళల పేరుతో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న పంట రుణాలే రద్దవుతాయంటూ మెలిక పెట్టారు. పట్టాదారు పాస్‌పుస్తకం ఉండాలని, ఆధార్ కార్డు, అడంగల్ కాపీలు ఈ వివరాలు ఉండాలని ఆంక్షలు విధించారు. ఖరీఫ్ సీజన్ పూర్తయ్యే దశలో ఉన్నా ఇంతవరకు రైతులకు రుణాలు ఇప్పించటంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వం నిర్లక్ష్యానికి తోడు వరుణుడు కరుణించకపోవటంతో రైతులు పంటలు ఎండిపోయి దిగుబడులు ఆశించిన మేర రావని ఆందోళనకు గురవుతున్నారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రుణాలు సకాలంలో చెల్లించకపోవటంతో వడ్డీ లేని పంట రుణాలు తీసుకున్న రైతులు నేడు 14 శాతం వడ్డీ చెల్లించాల్సిన దుస్థితి నెలకొంది. సకాలంలో వడ్డీ చెల్లిస్తే రైతులు చెల్లించిన వడ్డీలో మూడు శాతం ఇన్సెంటివ్‌గా కేంద్ర ప్రభుత్వం భరించే అవకాశం ఉండేది. దీనిని రైతులు కోల్పోయారు. బ్యాంకుల ద్వారా పంట రుణాలు అందకపోవడంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు చేసి మరీ పంటలు సాగు చేశారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకోకపోవటంతో పంట బీమా సొమ్ము చెల్లించని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవటం, రైతులు తీసుకున్న రుణాలు మార్చి 31లోపు చెల్లించకపోవటంతో రుణాలు తీసుకున్న రైతులంతా డిఫాల్టర్లుగా మారారు. ఇలాంటి స్థితిలో ప్రస్తుతం రుణమాఫీకి సంబంధించిన జాబితాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జాబితాల్లోని వివరాలు బయటపడితే ప్రభుత్వం రుణమాఫీపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలిసే అవకాశం ఉంది.
బ్యాంక్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్
విజయవాడ సిటీ : నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోని కొత్తపేట, సూర్యారావుపేట, నున్న, పటమట పోలీసు స్టేషన్ల పరిధిలో భారతీయ స్టేట్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రొబేషనరీ ఆఫీసర్స్ (పీఓ) పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ నగర పోలీసు కమిషనర్, మెట్రోపాలిటన్ ప్రాంత అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఎ.బి.వెంకటేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 9, 15, 23, 29, 30 తేదీల్లో ఈ ఉత్తర్వులు ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో అమలులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. పరీక్షలు అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఉత్తర్వులు జారీ చేసినట్టు కమిషనరేట్ అధికారులు తెలిపారు. సెక్షన్ 144 అమలులో ఉన్నందున పరీక్షలు జరిగే రోజుల్లో.. పరీక్షా కేంద్రాలకు 250 మీటర్ల పరిధిలో ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడరాదని, కర్రలు, రాళ్లు సహా మారణాయుధాలు కలిగి ఉండరాదని తెలిపారు. పరీక్షా కేంద్రాలకు సమీపంలోని ఇంటర్‌నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు తెరిచి ఉంచరాదని వివరించారు.
రుణమాఫీ జాబితాలు విడుదల
Published Sat, Nov 8 2014 1:55 AM | Last Updated on Mon, Apr 8 2019 6:46 PM
Advertisement
Advertisement