
ఆ బియ్యం మాకొద్దు
సాక్షి, కడప : పౌరసరఫరాలశాఖ అట్టహాసంగా ప్రారంభించిన జిలకర మసూర కేంద్రాలు అభాసుపాలు అవుతున్నాయి. సాక్షాత్తు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత ఆగస్టులో పలు జిలకర మసూర బియ్యం కేంద్రాలను ప్రారంభించారు. బియ్యంలో కల్తీ రావడం, నాణ్యత లోపించడంపై సర్వాత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం రూ. 30కే కేజీ జిలకర మసూర అంటూ ఎంతగా ఊదరగొట్టినా.....కడపలో కొనేవారు కరువయ్యారు. తక్కువ ధరకే ఇస్తున్నప్పుడు ప్రజలు సాధారణంగా ఎగబడి కొనాల్సింది పోయి కేంద్రాలు బోసిపోవడం గమనార్హం.
జిలకర మసూర పేరుతో బియ్యంలో కల్తీ
కడపలో ప్రారంభించిన కేంద్రాల్లో కల్తీ బియ్యం కనిపించడంతో ప్రజలు కొనడానికి ఆసక్తి చూపడం లేదు. కడపలోని రైతు బజారులో మంత్రి సునీత ఆగస్టులో ఒక కేంద్రాన్ని ప్రారంభించగా, జిల్లా పౌరసరఫరాల అధికారులు మండీబజారులో ఒకటి, చిన్నచౌకు పంచాయతీ కార్యాలయం వద్ద మరొకటి ప్రారంభించారు. అయితే ఏ కేంద్రం వద్ద కూడా బియ్యం కొనడానికి జనాలు ముందుకు రావడం లేదు. జిలకర మసూర బియ్యాన్ని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి కడపకు తెప్పిస్తున్నారు.
అక్కడ పండే సోనా మసూరితోపాటు మరింత పాలీష్ పట్టించిన స్టోర్ బియ్యం, మరో ఒకట్రెండు రకాల బియ్యాలను కలబోసి ఇక్కడికి పంపుతున్నారని పౌరసరఫరాలశాఖలోనే చర్చ సాగుతోంది. బియ్యంలో నాణ్యత లోపించడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. జిలకర మసూర బియ్యం సాధారణంగా బయటి మార్కెట్‌లో 50 కిలోల బస్తా దాదాపు రూ. 2 వేల పైచిలుకు పలుకుతుంటే ఇక్కడ మాత్రం రూ. 1500కే ఇస్తామన్నా ఎవరూ ముందుకు రావడం లేదు.
పౌరసరఫరాలశాఖ అధికారులు ఆయా కేంద్రాల్లో అటెండర్లను పెట్టి విక్రయించేందుకు ఏర్పాట్లు చేశారు. మొదట్లో ఒకబస్తాను ఊడదీసి కిలోల ప్రకారం ఇచ్చేవారు. అలా కొనుగోలు చేసేవారు లేకపోవడంతో బస్తా ప్రకారమే ఇస్తామని మెలిక పెట్టారు. ఈ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన బియ్యంతో వంట చేసిన అన్నం కూడా సక్రమంగా ఉండటం లేదని...ఒకసారి కొనుగోలు చేసిన వారు మరోసారి కొనుగోలుకు ముందుకు రారని పలువురు పేర్కొంటున్నారు. దీంతో కడపలోని కేంద్రాలు కొనుగోలు దారులు లేక వెళవెళబోతున్నాయి.
రెండు కేంద్రాలు మూత
కడపలోని జిలకర మసూర బియ్యం విక్రయ కేంద్రాలు విజయవంతం కాగానే, జిల్లాలోని అన్ని నియోజకవర్గకేంద్రాల్లో ఏర్పాటు చేయాలని పౌరసరఫరాలశాఖ భావించింది. అయితే కడపలో స్పందన కొరవడటంతో మిగతా ప్రాంతాల్లో కూడా కేంద్రాలను ప్రారంభించలేదు. కడపలో మూడు కేంద్రాలను ఏర్పాటు చేస్తే అందులో రైతు బజారులో ఉన్న కేంద్రం మాత్రమే నడుస్తోంది.
చివరకు మిల్లర్లు కూడా జిలకర మసూర పేరుతో ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం నాణ్యతపై పెదవి విరుస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలోనే రైతుల వద్ద నాణ్యమైన బియ్యాన్ని కొనుగోలు చేసి కేంద్రాల్లో ఉంచితే వినియోదారులు బారులు తీరుతారని...ప్రభుత్వం ఈ రకంగానైనా ఆలోచించాలని పలువురు కోరుతున్నారు.
40 టన్నులు తెచ్చినా....
మూడు నెలల క్రితం రెండు లారీల్లో దాదాపు 40 టన్నుల జిలకర మసూర బియ్యాన్ని కాకినాడ నుంచి తెప్పించారు. మూడు నెలలవుతున్నా 40 టన్నులే కొనుగోలు కాకపోవడంతో పౌరసరఫరాలశాఖ అధికారులు మరొకమారు తెప్పించే అంశంపై ఆలోచిస్తున్నారు. 40 టన్నుల్లో మరో నాలుగు టన్నుల బియ్యం మిగిలి ఉన్నాయి. బియ్యంలో కల్తీ వ్యవహారం అధికారులను కూడా ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపధ్యంలో కొత్తగా స్టాకు తెప్పించడానికి సాహసించడం లేదు.
పౌరసరఫరాలశాఖ డీఎం ఏమంటున్నారంటే!
పౌరసరఫరాలశాఖకు సంబంధించి ఏర్పాటు చేసిన బియ్యంలో నాణ్యత లోపించడంతోపాటు కేంద్రాలు మూసివేసిన విషయాన్ని ‘సాక్షి ప్రతినిధి’ ఆ శాఖ జిల్లా మేనేజర్ బుల్లయ్య దృష్టికి తీసుకు వెళ్లగా....కొనుగోలు దారులు లేకపోవడంతో ఇటీవలే రెండు కేంద్రాలను మూసివేశామన్నారు.కాకినాడ నుంచి బియ్యం తెప్పిస్తున్నామని...వినియోగదారులు వినియోగించుకోవాలని కోరారు. ఉన్న స్టాకు అయిపోగానే కొత్త స్టాకు తెప్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. బియ్యంలో కల్తీ విషయమై ఆయన మాట దాటవేశారు.