సెజ్‌లో గ‘లీజ్’ | The 'soft' to the possibility of fraud | Sakshi
Sakshi News home page

సెజ్‌లో గ‘లీజ్’

Published Fri, Jun 24 2016 2:48 AM | Last Updated on Mon, Sep 4 2017 3:13 AM

The 'soft' to the possibility of fraud

అదే ‘సాఫ్ట్’ మోసానికి అవకాశం
మంత్రి గంటా అండ ఉందని ప్రచారం
ఆర్భాటం చూసి నమ్మేసిన నిరుద్యోగలు
రూ.12 కోట్లు దండేసి బిచాణా ఎత్తేసిన ‘ఎక్సాల్ట్’
ఎన్నాళ్లీ ఐటీ సంస్థల వసూళ్ల మేత

 

ఊరూ పేరూ లేని ఓ కంపెనీ.. సాఫ్ట్‌వేర్‌కున్న డిమాండ్‌ను సొమ్ము చేసుకొని కోట్లు కొల్లగొట్టేందుకు భారీ స్కెచ్ వేసింది. ఐటీ సెజ్‌లో పక్కా భవనం కలిగిన మరో సాఫ్ట్‌వేర్ సంస్థ నుంచి కార్యాలయ భవనాన్ని లీజుకు తీసుకొని పాగా వేసింది. ఏకంగా రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావును తీసుకొచ్చి ప్రారంభోత్సవం పేరుతో అట్టహాసం చేసింది. ఐటీ సెజ్‌లో ఆఫీసు..  మంత్రితో ప్రారంభం.. ఇంకేం.. యువత నమ్మేశారు. ఉద్యోగాల కోసం ఎగబడ్డారు. ఇదే అదనుగా కౌంటర్ తెరిచేశారు. రూ.కోట్లు దండేశారు. ఆర్నెలల్లోనే దుకాణం చక్కబెట్టి బిచాణా ఎత్తేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఐటీ సెజ్‌లో ఓ కంపెనీ ఆఫీసు తీసుకుని హడావుడి చేస్తుంటే ఇన్నాళ్లూ అధికారులు ఏం చేస్తున్నట్టు?.. అలాంటి కంపెనీల ప్రారంభానికి బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న గంటా ఎలా వెళ్లారన్నదే ఇప్పుడు చర్చాంశనీయంగా మారింది.

 

విశాఖపట్నం : నవ్యాంధ్రప్రదేశ్‌లో ఐటీ రాజధానిగా విశాఖను అభివృద్ధి చేస్తామన్న పాలకుల ఆర్భాటం ఎలా ఉన్నా.. దాన్నే అవకాశంగా తీసుకొని కొన్ని సంస్థలు ‘సాఫ్ట్’గా  మోసాలకు పాల్పడుతూ విశాఖ యువతను రోడ్డున పడేస్తున్నాయి. విశాఖ ఐటీ సెజ్‌లో ఎన్నో ఏళ్ల కిందట భూములు తీసుకున్న 12 సాఫ్ట్‌వేర్ సంస్థల్లో నాలుగు కంపెనీలు ఇప్పటికీ కార్యకలాపాలు ప్రారంభించలేదు. ఇక భవనాలు నిర్మించిన కొన్ని కంపెనీలు నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి ప్రామాణికాలు లేని నకిలీ ఐటీ సంస్థలకు ఆ భవనాలను అద్దెకిచ్చి వాటి మోసాలకు పరోక్షంగా తోడ్పడుతున్నాయి. ఇటీవల నిరుద్యోగుల నుంచి రూ.12 కోట్లు వసూలు చేసి బిచాణా ఎత్తేసిన ఎక్సాల్ట్ సంస్థ నిర్వాకం వెనుక సర్కారు తప్పిదమూ కనిపిస్తోంది. రుషికొండలోని ఐటీ సెజ్ హిల్ నెం-2లో హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌సోల్ కంపెనీకి 2007లో ప్రభుత్వం ఎకరా స్థలం కేటాయించింది. నిబంధనల మేరకు ఆ సంస్థ అందులో కార్యకలాపాలు ప్రారంభించి వందమందికి ఉద్యోగాలు కల్పించాలి. కానీ ఆ స్థలంలో భవన నిర్మాణం పూర్తి చేసిన సాఫ్ట్‌సోల్ సంస్థ ఇప్పటివరకు ఎటువంటి ఐటీ కార్యకలాపాలు ప్రారంభించలేదు. పైగా నిబంధనలకు విరుద్ధంగా ఎక్సాల్ట్ ఇండియా లిమిటెడ్ అనే బోగస్ సంస్థకు ఇటీవల తన భవనాన్ని లీజు ప్రాతిపదికన అద్దెకు ఇచ్చింది.

 
మంత్రి అండ ఉందని ప్రచారం

అద్దెకు తీసుకున్న సదరు సంస్థ తమకు  ప్రభుత్వ పెద్దల అండ ఉందని ప్రచారం చేసుకుంది. దానికి బలం చేకూర్చేలా గత జనవరిలో జరిగిన ప్రారంభోత్సవానికి మంత్రి గంటా శ్రీనివాసరావుతో సహా అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రముఖులందరినీ ఆహ్వానించింది. స్వయంగా మానవ వనరుల శాఖ మంత్రి గంటా వెళ్లి  ప్రారంభించడంతో విశాఖ యువతలో.. అది మంచి కంపెనీనే.. అన్న భావన ఏర్పడింది. దీంతో వందలాదిమంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎగబడ్డారు. ఇదే అదనుగా కంపెనీ నిర్వాహకులు దాదాపు రూ.12 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. సరిగ్గా రెండు నెలల కూడా జీతాలు చెల్లించని సంస్థ ప్రతినిధులు వారం కిందట పత్తా లేకుండా పోయారు. హైదరాబాద్‌లో ఉన్న శాఖ కార్యాలయాన్ని కూడా ఎత్తేశారు. మోసపోయామని భావించిన బాధితులు పీఎం పాలెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


ఇదేనా ఐటీ ప్రగతి
వాస్తవానికి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత గత రెండేళ్లలో విశాఖలో మూడు సాఫ్ట్‌వేర్ సంస్థలు ఉద్యోగులను నట్టేట ముంచాయి.  డాబాగార్డెన్స్‌లో గత ఏడాది రెండు కంపెనీలు రూ.3 కోట్లు పోగేసుకుని బోర్డు తిప్పేయగా.. తాజాగా ఎక్సాల్ట్ కంపెనీ ఏకంగా రూ.12 కోట్లకు ముంచేసింది. విశాఖలో ఉద్యోగాల కోసం రూ.2 కోట్లు వసూలు చేసిన ఎక్సాల్ట్ ప్రతినిధులు.. మలేసియాలో ఉద్యోగం ఇస్తామన్న ఆశ చూపి మరో పదికోట్లు వసూలు చేశారని అంటున్నారు. ఐటీ సెజ్‌లో భూములు తీసుకున్న చాలా సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించకపోగా, ఎట్టకేలకు తెరుస్తున్న  కంపెనీలు ఇలా నిరుద్యోగులను నట్టేట ముంచుతున్నాయి. కాగా, మురళీనగర్‌లో ఉన్న ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ కూడా ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితిలో మూసివేత దిశగా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.

 

ఎక్సాల్ట్ ఎండీ పట్టివేతకు ప్రత్యేక బృందాలు:సీఐ
పరారీలో ఉన్న ఎక్సాల్ట్ సంస్థ ఎండీ కిరణ్‌కుమార్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని భీమిలి సీఐ టి.అప్పలనాయుడు తెలిపారు. రూ.2 కోట్ల మేర నష్టపోయామని బాధితులు ఫిర్యాదు చేశారని చెప్పారు. హైదరాబాద్‌లోని కంపెనీని కూడా ఎత్తివేశారని, ప్రధాన నిందితుడు విదేశాలకు పారిపోకుండా త్వరలోనే అరెస్టు చేస్తామని  చెప్పారు.

 

అలాంటి కంపెనీలను నమ్మకూడదు
-జి.శ్రీధర్‌రెడ్డి, మిలీనియం సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ సీఈవో (పొటో: 23వీఎస్‌సీ310ఎ) మోసపూరిత సాఫ్ట్‌వేర్ సంస్థల పట్ల నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలి.  ఉద్యోగాలు ఇస్తామంటే డబ్బులు చెల్లించడం సరైంది కాదు. ముందుగా కంపెనీ విధివిధానాలు తెలుసుకోవాలి. డబ్బులు తీసుకొని ఆరు నెలల శిక్షణ తర్వాత ఉద్యోగాలిస్తాం.. అని చెప్పే సంస్థలను నమ్మకూడదు. ఒక పేరు మీద ఉన్న సంస్థ మరో సంస్థకు లీజుకు ఇవ్వకూడదు. ఎక్సాల్ట్ వంటి కంపెనీలపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి.

 

మంత్రికి బాధ్యత లేదా?
-జాన్ వెస్లీ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి (పొటో: 23వీఎస్‌సీ310  మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారంటే ఆ కంపెనీ నిబంధనల మేరకు పక్కాగా ఉంటుందని ప్రజలు నమ్ముతారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు అలాంటి కంపెనీల గురించి ముందుగా తెలుసుకోవాలి. అన్నీ నిబంధనల మేరకు ఉన్నాయంటేనే ప్రారంభించాలి. లేదంటే ఎక్సాల్ట్  కంపెనీల వంటి అనుభవాలే ఎదురవుతాయి. ఇప్పటికైనా మంత్రి గంటా స్పందించి ఎక్సాల్ట్ ప్రతినిధులను పట్టుకునేలా పోలీసులకు ఆదేశాలివ్వాలి. నష్టపోయిన వారికి పరిహారం వచ్చేలా బాధ్యత తీసుకోవాలి.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement