
‘సర్వే’జన సమస్య తీరేదెన్నడో!
భూ వివాదాలకు చాలా వరకు మూలం సర్వే సమస్యలు.
► భూ వివాదాలకుమూలం సర్వే సమస్యలే
► గడువుదాటినా పరిష్కారానికి నోచుకోని దరఖాస్తులు
► మామూళ్లు ముట్టచెబితేనే సర్వే
► లెసైన్స్‌డ్ సర్వేయర్లదే హవా
కర్నూలు (అగ్రికల్చర్) : భూ వివాదాలకు చాలా వరకు మూలం సర్వే సమస్యలు. భూములను సర్వే చేయడంచ, సబ్ డివిజన్‌ల ఏర్పాటులో తీవ్ర అలసత్వం నెలకొని ఉండటం వల్లే వివాదాలు పెరిగిపోతున్నాయి. మరోవైపు జిల్లాలో సర్వేయర్ల కొరత ఉండడం, లైసైన్స్‌డ్ సర్వేయర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండడంతో సమస్య తీవ్రత ఎక్కువవుతోంది. ఇది ఎప్పుడు పరిష్కారమవుతుందా అని జనాలు ఎదురుచూస్తున్నారు. ప్రతివారం జరిగే మీ కోసం కార్యక్రమం, డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి సర్వే సమస్యలే ఎక్కువగా వస్తుండటం గమనార్హం. సర్వేయర్ల కొరత, ఉన్న సర్వేయర్లలో నిర్లక్ష్యం అవినీతిపెరుగిపోవడం వల్లే భూముల సర్వే, సబ్‌డివిజన్‌ల ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతోంది. నిబంధనల ప్రకారం భూములను సర్వే చేయడం (కొలవడం) సబ్ డివిజన్‌లు చేయడం రైతులు చలానా కట్టిన రోజు నుంచి 45 రోజుల్లో పూర్తి చేయాలి.
కానీ నాలుగు నెలలు గడచినా పట్టించుకునే వారే లేకపోవడంతో రైతులు పడుతున్న ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. పలు మండలాలకు సర్వేయర్లు లేకపోవడం, లెసైన్స్ సర్వేయర్లు హవా నడుపుతుండటంతో రైతులు సర్వే సమస్యలతో నలుగుతున్నారు. జిల్లాకు 37 సర్వేయర్ల పోస్టులు ఉండగా 36 మంది పనిచేస్తున్నారు. అలాగే జిల్లాలో 37 మంది లైసన్స్‌డ్ సర్యేయర్లు పనిచేస్తున్నారు. వీరు మండలాల్లో రాజ్యమేలుతున్నారు. వీరిలో చాలా మంది అధికార పార్టీకి చెందిన వారే ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని మండలాలకు రెగ్యులర్ సర్వేయర్లను నియమించకుండా వీరు దేశం నేతల ద్వారా అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది.
మామూళ్లు ముట్టచెబితేనే
మామూళ్లు ముట్టచెబితేనే సర్వేయర్లు, భూములను కొలవడం, సబ్ డివిజన్‌లు చేయడం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రైతు అవసరం, భూమి విలువను బట్టి కొందరు సర్వేయర్లు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు వసూళ్లు చేస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. కొందరు సర్వేయర్లు లెసైన్స్‌డ్ సర్వేయర్లతో పనులు చేయిస్తూ సంతకాలు పెట్టడం మామూళ్లు తీసుకోవడానికి పరిమితం అవుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సర్వేయర్లు పొలాలు కొలవాలంటే ప్రత్యేకంగా వాహనాలతో పాటు విందు ఏర్పాటు చేయాల్సి ఉంది.
గడువు దాటినా పట్టించుకోని వైనం
2015-16లో మార్చి నెల 20 వరకు భూములను సర్వే చేసేందుకు 4476 దరఖాస్తులు వచ్చాయి. రైతులు చలానాలు కట్టి సంబంధిత తహసీల్దార్ కార్యాలయాల్లో ఇచ్చారు. వీటిని 45 రోజుల్లోగా పరిష్కరించాలి. కానీ నెలలు గడుస్తున్నా పట్టించుకునే వారు లేరు. ఇందులో 4000 దరఖాస్తులకు నిర్ణీత గడువు దాటి పోయిన పట్టించునే వారు కరువయ్యారు. ఇటు తహసీల్దార్లు, అటు సర్వేయర్లు పట్టించుకోకపోవడంతో రోజురోజుకు నిర్ణీత గడువుదాటి పోతున్న దరఖాస్తుల సంఖ్య పెరిగిపోతోంది. సర్వేనంబర్ల సబ్‌డివిజన్‌ల కోసం వచ్చిన దరఖాస్తులు పెండింగ్‌లో పడిపోతున్నాయి. సబ్ డివిజన్ కోసం ఇప్పటి వరకు 559 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 80 శాతం దరఖాస్తులకు నిర్ణీత గడువు దాటి పోయినా స్పందనలేదు.
సర్వే సమస్యలు తగ్గిస్తున్నాం
భూములు సర్వే సమస్యలు తగ్గించేందుకు కృషి చేస్తున్నాం. ఇటీవల కాలంలో ప్రభుత్వ భూముల సర్వే పనులు పెరిగిపోవడం వల్ల సమస్యలు కొంతవరకు పెరిగాయి. గడువు దాటినా పరిష్కారం కాని దరఖాస్తుల సంఖ్య పెరుగుతోంది. సర్వే, సబ్ డివిజన్ చేయడానికి ఎంత ఫీజు తీసుకోవాలనే దానిపై మార్గదర్శకాలు ఇచ్చాం. - మనోహర్‌బాబు, సర్వే ఏడీ