
సీఎం పర్యటన విజయవంతం చేయాలి
- మంత్రి అయ్యన్నపాత్రుడు
విశాఖ రూరల్: సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజుల జిల్లా పర్యటన విజయవంతానికి అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సి.హెచ్.అయ్యన్నపాత్రుడు అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం ప్రభుత్వ అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్, ఎస్పీ ప్రవీణ్, ఏఎస్పీ కిషోర్, డీసీపీ శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ మహేశ్వరరెడ్డి, డుమా పీడీ శ్రీరాములునాయుడులతో సమావేశమయ్యారు.
సీఎం జిల్లా పర్యటన ఏర్పాట్లను సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ ఈ నెల 30 , 31 తేదీల్లో సీఎం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఎటువంటి విమర్శలకు తావులేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. సీఎం పర్యటించే ప్రతీ వేదిక వద్ద సీనియర్ అధికారులను ఇన్‌చార్జ్‌లుగా నియమించాలని చెప్పారు. ముఖ్యమంత్రి ప్రజలతో ఎక్కువగా మమేకమవుతూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశమున్నందున పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు.
పర్యటన ఇలా
సీఎం పర్యటన అధికారికంగా ఖరారు కానప్పటికీ ఈ నెల 30న ఉదయం స్పైస్‌జెట్ విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకొని అక్కడ నుంచి నేరుగా అనకాపల్లి బయలుదేరుతారని కలెక్టర్ తెలిపారు. అనకాపల్లి, చోడవరంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ రోజు రాత్రి అనకాపల్లిలో బసచేసి మరుసటి రోజు కశింకోట, యలమంచిలి, నక్కపల్లి ప్రాంతాల్లో పర్యటిస్తారన్నారు. సాయంత్రం విమానంలో తిరిగి వెళతారన్నారు.
ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ
నక్కపల్లి: నక్కపల్లి మండలంలో ఈనెల 30,31 తేదీల్లో సీఎం చంద్రబాబునాయుడు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఎస్పీ ప్రవీణ్ శని వారం పరిశీలించారు. ఉపమాక వేంకటేశ్వరస్వామిని సీఎం దర్శించుకోనుండడంతో ఆల య పరిసరాలను పరిశీలించారు. తొలుత స్వామిని దర్శించుకున్నారు. అర్చకులు ఆలయ మర్యాదలతో ఎస్పీకి స్వాగతం పలికారు. గోత్రనామాలతో అర్చనలు, అభిషేకాలు నిర్వహించి తీర్థప్రసాదాలు అంద జేశారు. సీఎం బహిరంగ సభ ప్రాంతాన్ని పరిశీలించారు. ఎస్పీ వెంట ఏఎస్పీ విశాల్‌గున్ని, సీఐ మల్లేశ్వరరావు, ఎస్‌ఐవిజయ్‌కుమార్ ఉన్నారు.