ఖాకీల దెబ్బలకు వ్యక్తి కన్నుమూత
మడకశిర: కొద్ది రోజుల్లో జరగనున్న తన కుమార్తె పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్న ఓ వ్యక్తి పోలీసు దెబ్బలకు బలై ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ దారుణ సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. మడకశిర పట్టణానికి చెందిన లక్ష్మీనారాయణ (50) అలియాస్ అప్పి పెద్ద కుమార్తె చంద్రకళ వివాహం ఈ నెల 25న ఉంది. పెళ్లి పత్రికలు పంచేందుకు అతను మడకశిర మండలంలోని పలు గ్రామాలకు ఆదివారం వెళ్లాడు. తిరుగు పయనంలో పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని గౌడేటి వద్ద కొందరు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి తీసుకువస్తున్న పోలీసులకు అప్పి తారసపడ్డాడు.
అతడినీ జూదగాడని ఆరోపిస్తూ అమరాపురానికి చెందిన కానిస్టేబుళ్లు నాగరాజు, నరసింహమూర్తి దాడిచేసి రాళ్లతో కొట్టారు. విషయం తెలుసుకున్న స్థానిక ప్రజాప్రతినిధులు.. జోక్యంచేసుకొని అప్పిని ఆదివారం రాత్రి ఇంటికి పంపారు. దెబ్బలతో ఇంటికి వచ్చిన బాధితుడు.. సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇంట్లోనే కుప్పకూలిపోయాడు. కుటుంబీకులు మడకశిర ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆగ్రహించిన మృతుడి బంధువులు, అప్పి మృతదేహంతో పోలీస్‌స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ఎమ్మెల్యే ఈరన్న తదితరులు పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకుని ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి బాధిత కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని కోరారు. దీంతో అప్పి మృతికి కారకులైన కానిస్టేబుళ్లపై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని పెనుకొండ డీఎస్పీ ప్రకటించడంతో బాధితులు ఆందోళన విరమించారు.