రచ్చ..రచ్చ | Tension Tension | Sakshi
Sakshi News home page

రచ్చ..రచ్చ

Published Tue, Oct 18 2016 12:28 AM | Last Updated on Tue, Oct 9 2018 4:20 PM

రచ్చ..రచ్చ - Sakshi

రచ్చ..రచ్చ

అనంతపురం న్యూటౌన్‌ : కాపులను బీసీ జాబితాలో చేర్చే అంశంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి జస్టిస్‌ మంజునాథ కమిషన్‌ చేపట్టిన బహిరంగ విచారణ ఉద్రిక్తత నడుమ కొనసాగింది. అనంతపురంలోని లలితకళాపరిషత్తులో సోమవారం ఉదయం 10.45 నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు విచారణ సాగింది. జస్టిస్‌ కేఎల్‌ మంజునాథ్‌ నేతృత్వంలో కమిషన్‌ సభ్యులు ఆచార్య వేంకటేశ్వర సుబ్రమణ్యం, ఆచార్య మల్లెల పూర్ణచంద్రరావు, సత్యనారాయణ, కృష్ణమోహన్‌ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ మల్లికార్జునరావు నేతృత్వంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ  కాపులు, బీసీలు పరస్పరం వాగ్వాదానికి దిగారు. ఓసీ నుంచి బీసీ జాబితాలోకి మార్చాలని బలిజ, ఒంటరి, కాపు, తెలగ, దొర, గోపిత బలిజ, వేళ్లలార్‌ కులస్తులు, బీసీల్లోనే ఇతర గ్రూపుల్లోకి మార్చాలని కురుబ, ఉప్పర, దూదేకుల తదితర కులాల వారు కోరుతున్నారంటూ కమిషన్‌ సభ్యులు ఆయా కులస్తుల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలు, డిమాండ్ల సేకరణను ప్రారంభించారు. తొలుత ఉప్పర, కురుబ కులస్తులను ఆహ్వానించారు. ఈ రెండు కులాల వారు సభకు హాజరుకాలేదు. దీంతో దూదేకుల వారిని మాట్లాడించారు. ప్రస్తుతం బీసీ–బీలో ఉన్నామని, బీసీ–ఏలోకి మార్చాలని దూదేకుల సంఘం ప్రతినిధులు కమిషన్‌ను కోరారు. తాము ముస్లిం సంప్రదాయాలను పాటిస్తున్నప్పటికీ వారికి లభించే రాయితీలు తమకు అందడం లేదని వివరించారు. తర్వాత గోపిత బలిజ, దొర , వేళ్లలార్‌లకు అవకాశం ఇవ్వగా.. వీరూ గైర్హాజరయ్యారు. దీంతో బలిజలకు అవకాశం ఇచ్చారు. బలిజలు ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారని, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో సంబంధం లేకుండా రాయలసీమలోని బలిజలను బీసీల్లోకి చేర్చాలని ఆ సంఘం ప్రతినిధులు కోరారు. ఇదే సందర్భంలో బీసీ ఉద్యోగసంఘం జిల్లా అధ్యక్షుడు పుట్టా శ్రీధర్, బీసీ జాక్‌ రాష్ట్ర కన్వీనర్‌ అన్నా రామచంద్రయ్య, నాయకులు సుధాకర్‌ యాదవ్, చంద్రశేఖర్‌ యాదవ్‌ తదితరులు జోక్యం చేసుకున్నారు. జనాభాలో బీసీలు 51శాతం ఉన్నారని, అయితే 27శాతం మాత్రమే రిజర్వేషన్లు అందుతున్నాయని చెప్పారు. బీసీల పరిస్థితి నేటికీSదయనీయంగా ఉందన్నారు. బలిజలు, కాపులు బంగారు, వజ్రాల వ్యాపారాలు చేస్తున్నారని, రాజకీయాలు, సినిమాల్లోనూ వారిదే ఆధిపత్యమని అన్నారు. వారి వ్యాఖ్యలపై రాయలసీమ బలిజ సంఘం అధ్యక్షుడు వెంకట్రాముడు, నాయకులు అమర్‌నాథ్, జేఎల్‌ మురళి, వెంకటేశ్‌ తదితరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కొందరిని దృష్టిలో ఉంచుకుని వర్గం మొత్తాన్ని ఒకేలా పరిగణించడం సమంజసం కాదని, గాజుల వ్యాపారాలు, తోపుడుబండ్ల ద్వారా బతికేవారూ ఉన్నారని చెప్పారు. బలిజలు, కాపులను బీసీల్లో ప్రత్యేక కేటగిరీగా చేర్చాలని చెబుతున్నాం తప్ప బీసీలకు అన్యాయం చేయాలని కోరడం లేదన్నారు. దీంతో తిరిగి ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. 
 
బలిజ సంఘం నేతల నిరసన బైఠాయింపు
మంజునాథ్‌ కమిషన్‌ విచారణ ఏకపక్షంగా సాగిందంటూ బలిజలు లలితకళాపరిషత్‌ ఎదురుగా రోడ్డుపై బైఠాయించారు. బీసీలు ఘర్షణకు దిగుతున్నా పోలీసులు తమనే వారించారని ఆరోపించారు. కాపు ఉద్యమాన్ని అణచివేయడానికే ప్రభుత్వం ఇలా చేస్తోందన్నారు. వేర్వేరుగా విచారణ చేయాలని కమిషన్‌ను కోరినా వినకుండా కలిపి చేపట్టిందని, దీనివల్ల ప్రయోజనం లేదని అన్నారు.
 
కాపు రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం 
సామాజికంగా బలంగా ఉన్న కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడం రాజ్యాంగ విరుద్ధమని బీసీ సంఘాల నేతలు అన్నారు. తద్వారా ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరలేపారని విమర్శించారు. బీసీలు తమ అభిప్రాయాలను కమిషన్‌ ముందు చెప్పుకునేందుకు రాకుండా ప్రభుత్వం ఓ పథకం ప్రకారం టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌.క్రిష్ణయ్యతో కేఎస్‌ఆర్‌ కాలేజీలో సభ పెట్టించిందని దుయ్యబట్టారు.  కృష్ణయ్య కూడా బీసీల  సమస్యలను పక్కనపెట్టి టీడీపీకి దన్నుగా నిలిచేలా వ్యవహరించారని విమర్శించారు.
 
అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటాం
జస్టిస్‌ కేఎల్‌ మంజునాథ్‌ మాట్లాడుతూ ఏవర్గానికి అనుకూలంగా, వ్యతిరేకంగా కమిషన్‌ వ్యవహరించదని స్పష్టం చేశారు. కేవలం అభిప్రాయాలను సేకరించేందుకే వచ్చామన్నారు. ఎవ్వరూ అపోహలు చెందొద్దని సూచించారు. కమిషన్‌ ఎందుకు రావాల్సి వచ్చింది, కులాలు, వర్గీకరణ తదితర అంశాలపై మంజునాథ్‌ ప్రసంగించారు. కమిషన్‌ సూచించిన కులాలు కాకుండా ఇతర కులాల వారు తమ అభిప్రాయాలను చెప్పుకునేందుకు సభకు వచ్చారు. దీంతో వారి అభ్యర్థనను కమిషన్‌ సున్నితంగా తిరస్కరించింది.  ఇతరులు ఎవరైనా ఉంటే విజయవాడకు వచ్చి నేరుగా తమతో కలవొచ్చని చెప్పారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement