జీబీసీ హెడ్ రెగ్యులేటర్ వద్ద ఉద్రిక్తత
ఉరవకొండ :
జీబీసీ హెడ్ రెగ్యులేటర్ వద్ద శుక్రవారం ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. హంద్రీ-నీవా నీటిని తమ పొలాలకూ మళ్లించి ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు హెచ్చెల్సీ 9, 10వ డిస్ట్రిబ్యూటరీల కింద విడపనకల్లు మండలం పాల్తూరు, రాయంపల్లి, నెరిమెట్ల రైతులు కొందరు జీబీసీకు మళ్లించిన నీటిని గుర్తు తెలియని రైతులు గంటికొట్టారు. విషయం తెలుసుకున్న జీబీసీ ఆయకట్టు రైతులు వందలాది మంది జీబీసీ హెడ్ వద్దకు తరలివచ్చారు. జీబీసీకు ప్రభుత్వం హంద్రీ-నీవా నీటిని మళ్లించిందని, నీటిని మీరేలా తీసుకెళ్తారంటూ హెచ్చెల్సీ ఆయకట్టు రైతులను ప్రశ్నించారు. ‘మా పంటలు ఎండి పోతున్నాయ్...మాకు నీరివ్వండంటూ’ హెచ్చెల్సీ రైతులు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ చాలా సేపు ఘర్షణ వాతవరణం నెలకొంది.
పోలీసుల రంగప్రవేశం
విషయం తెలుసుకున్న వెంటనే పాల్తూరు, వజ్రకరూరు ఎస్‌ఐలు ఖాన్, జనార్దన్, ఉరవకొండ ఏఎస్‌ఐ మహేంద్ర తమ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. జీబీసీ అధికారులు సైతం వచ్చారు. రైతులను నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. అయితే వారు ఎవరిమాటా వినలేదు. హంద్రీ-నీవా నీరు కేవలం జీబీసీ ఆయకట్టుకు మాత్రమే అందుతున్నాయని, తమ పంటలకూ నీరు ఇవ్వాల్సిందేనంటూ హెచ్చెల్సీ రైతులు పట్టుబట్టారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది.