తెగబడిన స్నాచర్లు
పండుగ రోజు శుక్రవారం ఆరు చోట్ల చోరీ
► 28 తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లిన వైనం
► ఇదే రీతిలో గుత్తి, గుంతకల్లులో శనివారం ఘటనలు
► కలకలం సృష్టించిన ‘చైన్ బ్యాచ్’
- ఆచూకీ తెలిపితే రూ.25 వేలు పారితోషికం
అనంతపురం క్రైం : అనంతపురం నగరంలోని పోలీసులకు వినాయక చవితి పండుగ రోజున చైన్ స్నాచర్లు ఝులక్ ఇచ్చారు. శుక్రవారం ఆరు చోట్ల చోరీలకు తెగబడ్డారు. మహిళలనే లక్ష్యంగా చేసుకుని 28 తులాల బంగారు చైన్లు, తాళి బొట్టు చైన్లు లాక్కెళ్లారు. ఒకచోట దొంగతనం జరిగిందని తెలిసి పోలీసులు అక్కడికి వెళ్లి విచారిస్తుండగానే మరో ప్రాంతంలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడి సవాల్ విసిరారు. వన్‌టౌన్, టూటౌన్, త్రీటౌన్ ఇలా మూడు పోలీస్‌స్టేషన్ల పరిధిలోనూ చేతివాటం ప్రదర్శించడం గమనార్హం.
ఒకరు బైక్ నడుపుతూ మహిళలకు సమీపంలోకి వెళ్లగా, వెనుక కూర్చొన్న యువకుడు ఒక్క ఉదుటున చైను లాగేసుకుంటూ ఉడాయించారు. కాగా, శనివారం గుత్తి, గుంతకల్లులోనూ ఇదే రీతిలో ఇద్దరు యువకులు చోరీలకు తెగించారు. అన్ని సంఘటనలూ ఒకే రీతిలో జరగడం చూస్తుంటే ఒకే గ్రూపు ఈ ఘటనలకు పాల్పడి ఉంటుందనే నిర్ధారణకు పోలీసులు వచ్చారు. పోలీసులు తెలిపిన మేరకు చైన్‌స్నాచింగ్ ఘటనల వివరాలిలా ఉన్నాయి.
ముగ్గు వేస్తుండగా...
ఎంపీడీఓ జయరాం భార్య అలివేణి టీచరు. వీరు జీసస్‌నగర్‌లో ఉంటున్నారు. ఉదయం 5-50 గంటల ప్రాంతంలో అలివేణి ఇంటి ముందు ముగ్గు వేస్తోంది. ఒక అపరిచిత వ్యక్తి వచ్చి అలివేణి మెడలో నుంచి బలవంతంగా ఐదు తులాల బంగారు చైను లాక్కుని ఉడాయించాడు. కాస్త దూరంలో మరో వ్యక్తి సిద్ధంగా ఉంచుకున్న బైకులో ఎక్కి వెళ్లిపోయాడు. రెప్పపాటులో కనుమరగయ్యారు.
ఆంటీ అని పిలిచి...
ఆర్టీసీ బస్టాండు వెనుకవైపు ఉన్న షిరిడీ నగర్‌లో ఉంటున్న రమాదేవి ప్రధానోపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. ఈమె ఉదయం 6.30 గంటల సమయంలో ఇంటిముందు చెట్టు నుంచి పూలు కోస్తుండగా వెనుకవైపు నుంచి వచ్చిన ఓ వ్యక్తి ‘ఆంటీ...’ అని పిలిచాడు. వెనక్కు తిరిగి చూడగానే ఆమె కాలిపై తొక్కిపెట్టి ఒక్క ఉదుటున మెడలో ఉన్న 7 తులాల బంగారం చైను లాక్కుని వెళ్లాడు. కాస్త దూరంలో మరో వ్యక్తి సిద్ధంగా ఉంచిన బెకైక్కి వెళ్లిపోయాడు.
వృద్ధురాలి మెడలోని చైన్ అపహరణ
హౌసింగ్ బోర్డులోని ఇండేన్ గ్యాస్ ఎదురుగా రెవెన్యూ కాలనీలో అంజనమ్మ అనే వృద్ధురాలి మెడలో నుంచి మూడు తులాల బంగారు చైనును లాక్కుని ద్విచక్రవాహనం నుంచి ఉడాయించారు. పెద్దావిడ కేకలు వేసినా.. అప్పటికే వారు కనింపిచకుండా వెళ్లిపోయారు.
ఇంటిముందు కూర్చుని ఉండగా...
శ్రీనగర్‌కాలనీలో వి. పార్వతమ్మ అనే వృద్ధురాలు ఉదయం 7.30 గంటల సమయంలో ఇంటి ముందు వసారాలో కూర్చుని ఉంది. నిర్మానుష్య ప్రదేశం కావడంతో స్నాచర్లు పార్వతమ్మ వద్దకు నేరుగా వచ్చి 4 తులాల బంగారు చైను లాక్కొని పరారయ్యారు. పెద్దావిడ కేకలు వేసినా ఫలితం లేకపోయింది.
కసువు ఊడ్చుతున్న మహిళ నుంచి...
ఆజాద్‌నగర్‌లో నివాసం ఉంటున్న శారదాంబ వృత్తి రీత్యా టీచరు. ఉదయాన్నే ఇంటి ముందు కసువు ఊడ్చుతోంది. ఆమె వద్దకు వచ్చిన ఆగంతకుడు ఆమె మెడలో నుంచి 5 తులాల బంగారు చైను బలవతంగా లాక్కుని పరిగెత్తాడు. కాస్త దూరంలో ద్విచక్రవాహనంలో సిద్ధంగా ఉన్న మరో వ్యక్తితో కలిసి పారిపోయాడు.
‘ఎవరు మీరు’ అని అడిగితే...
బళ్లారిరోడ్డులోని వైశ్యా బ్యాంకు కాలనీలో నివాసం ఉంటున్న గంగావతి ఉదయం పక్కింట్లోకి వెళ్లింది. అప్పటికే ఆమె ఇంటిముందు ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు. తన ఇంట్లోకి వెళ్తూవెళ్తూ ‘ఎవరు మీరు’ అని అడిగింది. సమాధానం చెప్పినట్లే చెప్పి.. దగ్గరకు వచ్చి ఒక్కసారిగా ఆమె మెడలో నుంచి 4 తులాల బంగారు చైనును లాక్కెళ్లారు. ఆమె షాక్ నుంచి తేరుకుని గట్టిగా కేకలు పెట్టేసరికే కనుమరుగయ్యారు.
మహిళ మెడలోని బంగారు గొలుసు అపహరణ
గుంతకల్లు టౌన్ : పట్టణంలోని గంగానగర్‌కి చెందిన సరళ శనివారం ఉదయం ఇంటి ఆవరణలో గేదెకు పాలు పితుకుతున్న సమయంలో వెనుక నుంచి గుట్టుచప్పుడు కాకుండా వచ్చిన ఓ దుండగుడు ఆమె మెడలోని తులం బంగారు గొలుసును లాక్కుని వెళ్లాడు. సమీపంలో సిద్ధంగా ఉన్న మరో వ్యక్తి పల్సర్ బైక్‌పై ఉడాయించారు. బాధితురాలు ఒన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
రూ.60 వేల విలువైన బంగారు చైన్ అపహరణ
గుత్తి: గుత్తి ఆర్‌ఎస్‌లోని రైల్వే క్వార్టర్స్‌లో రైల్వే ఉద్యోగి ఎల్లప్ప, పార్వతమ్మ దంపతులు నివాసముంటున్నారు. పార్వతమ్మ శనివారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో పక్కింటిలోకి వెళుతుండగా ఇద్దరు గుర్తు తెలియని దొంగలు బ్లాక్ కలర్ పల్సర్ బైక్‌లో వచ్చి ఆమె మెడలోని మూడు తులాల బంగారు చైన్‌ను లాక్కెల్లారు. దొంగ దొంగ అని బాధితురాలు గట్టిగా అరిచినా ఎవ్వరూ పట్టించుకోలేదు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఆచూకీ తెలిపితే రూ.25 వేలు పారితోషకం
చైన్ స్నాచింగ్ ఘటనలను ఎస్పీ రాజశేఖరబాబు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని స్టేషన్లను అప్రమత్తం చేశారు. సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. చైన్ స్నాచింగ్‌లకు పాల్పడిన ముఠా ఆచూకీ తెలిపినా, లేదా పట్టించినా రూ.25 వేలు పారితోషికం ఇస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల ఎస్పీలతో కూడా మాట్లాడి వారిని అప్రమత్తం చేశారు. జిల్లా కేంద్రంలో ‘చైన్ గ్యాంగ్’ కోసం సుమారు 50 బృందాలు గాలింపు చేపట్టాయి.
స్నాచింగ్‌లకు పాల్పడిన ముఠా ఉత్తరాది రాష్ట్రాలకు చెందినదిగా అనుమానిస్తున్నారు. నల్ల రంగు ద్విచక్ర వాహనంలోని ఇద్దరు అగంతకుల్లో ఒకరికి బట్టతల ఉందని, హిందీ భాషలో మాట్లాడినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. కాగా, స్థానిక యువకులే ఈ ఘటనలకు పాల్పడి ఉండవచ్చని, స్థానికేతరులన్నట్లు హిందీలో మట్లాడి ఉండవచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా వరుస చోరీలు పోలీసు శాఖ ప్రతిష్టకు మచ్చ తెస్తున్నాయి.