
విషాదం
కుమారుడి మరణవార్త విని తండ్రి మృతి
ఆదోని అర్బన్:
అనారోగ్యంతో కుమారుడు మృతి చెందగా ఆ వార్తను జీర్ణించుకోలేక తండ్రి అస్వస్థతకు గురై మరణించాడు. ఈ ఘటన ఆదోనిలో శనివారం చోటుచేసుకుంది. తండ్రీకొడుకులు 12గంటల వ్యవధిలోనే మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు చిన్నాన్న కొంకా గోవిందప్ప కుమారుడు కొంకా గోపాల్ (58) డయాలసిస్‌తో బాధపడుతూ కర్నూలు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
శుక్రవారం మధ్యాహ్నం పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. మృతదేహాన్ని బంధులు, కుటుంబ సభ్యులు స్వగ్రామమైన ఆదోనికి తీసుకొచ్చారు. కుమారుడి మృతదేహాన్ని చూసి తండ్రి గోవిందప్ప ఒక్కసారిగా సొమ్మసిల్లిపోయాడు. కుటుంబ సభ్యులు, బంధువులు గోవిందప్పను స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. బీపీ పూర్తిగా పడిపోవడంతో వైద్యసేవలందించినా ఫలితం లేకపోవడంతో గోవిందప్ప(90) అర్ధరాత్రి మృతి చెందాడు. 12గంటల వ్యవధిలోనే తండ్రికొడుకులు మృతి చెందడంతో కొంకా కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.