కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రభుత్వం కోరి కష్టాలు తెచ్చుకుంటోంది. రిజర్వాయర్లలో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ విద్యుత్ కోతలకు తెగబడింది. ఉత్పత్తి కేంద్రాల్లో తలెత్తిన సమస్యతో ఏర్పడిన లోటు కారణమని చెబుతున్నా.. ఎన్నికల సమయంలో నిరంతరాయంగా విద్యుత్‌ను అందించేందుకు ఇప్పడు ‘వాత’లు పెడుతున్నట్లు చర్చ జరుగుతోంది.
గత రెండు నెలలుగా ఎడాపెడా విద్యుత్ కోత విధిస్తుండగా.. ఆదివారం నుంచి అధికారిక కోతలకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. జిల్లాలోని 10.53 లక్షల వినియోగదారులకు రోజుకు 1.10 కోట్ల యూనిట్ల విద్యుత్ అవసరం కాగా.. ఇటీవల కాలంలో 82 లక్షల యూనిట్ల విద్యుత్ మాత్రమే సరఫరా అవుతోంది. ఇందులో 14 లక్షల యూనిట్ల విద్యుత్ లైన్‌లాస్‌గా లెక్కగట్టారు. ఈ కారణంగా రెండు నెలల నుంచి ట్రాన్స్‌కో అధికారులు హైదరాబాద్‌లోని డిశ్పాచ్, మానిటరింగ్ సెంటర్ నుంచి లోడ్ రిలీఫ్ పేరిట మెయిన్ లైన్ సబ్‌స్టేషన్లను స్తంభింపజేస్తున్నారు. ఫలితంగా కోతలతో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. జిల్లా అవసరానికి తగిన విద్యుత్ రాకపోవడంతో కోతల సమయాన్ని పెంచుతూ ఉన్నతాధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఆ వివరాలను ఏపీసీపీడీసీఎల్ అధికారులు విలేకరులకు వెల్లడించారు. దీంతో లోడ్ రిలీఫ్, కోతల షెడ్యూల్స్‌తో ఇప్పటికే అల్లాడుతున్న జనం ఇకపై మరిన్ని కష్టాలను ఎదుర్కోక తప్పని పరిస్థితి నెలకొంది. కోతల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో అంధకారం అలుముకోనుంది. ఈ కోతలు రానున్న ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులకు వాతలు కాక మానవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నేటి నుంచే కోతల అమలు:
రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ లోటు ఏర్పడడంతో కోతలు అనివార్యమయ్యాయి. ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచే ట్రాన్స్‌కో అధికారులు కోతలు విధిస్తూ వచ్చారు. ఇప్పుడు అధికారికంగా కోతల వేళలు ప్రకటించారు. వీటిని ఆదివారం నుంచే అమలు చేయనున్నాం. వినియోగదారులు సమస్యను అర్థం చేసుకొని అధికారులకు సహకరించాలి.
ఎం.ఉమాపతి, డీఈ, కర్నూలు
ఇ‘కట్’లే!
Published Sun, Feb 9 2014 3:26 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM
Advertisement