కలెక్టరేట్ / ఇందూరు, న్యూస్‌లైన్ : జిల్లాలోని రెండు పంచాయతీలు, రెండు వార్డు స్థానాలకు శనివారం నిర్వహించిన ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మరో నాలుగు వార్డు స్థానాల ఎన్నికలు వాయిదా పడ్డాయి. సదాశివనగర్ మండలంలోని పోసానిపేట, ఎల్లారెడ్డి మండలంలోని అడవి లింగాల సర్పంచ్ స్థానాలతోపాటు మద్నూర్ మండలం హండేకేలూర్‌లోని 3, 9 వార్డులకు ఓటింగ్ నిర్వహించారు. మద్నూర్ మండలంలోని మేనూర్ పంచాయతీ పరిధిలో 9, 10,11, 12 వార్డులకూ ఎన్నికలు జరగాల్సి ఉన్నా.. ఆయా స్థానాలకు నామినేషన్లు రాకపోవడంతో ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి. మిగతా చోట్ల ఎన్నికలు సజావుగా జరిగాయి. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభించారు. కౌంటింగ్ అనంతరం ఫలితాలను ప్రకటించారు.
మైక్రో పరిశీలకులు..
ఉప ఎన్నికల మైక్రో పరిశీలకులుగా శ్రీనివాస్‌రెడ్డి, లింగం, రమేశ్ వ్యవహరించారు. వీరు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటింగ్ సరళిని పరిశీలించారు.
పోసానిపేటలోనే..
పోసానిపేటలో రెండు వెబ్‌కాస్టింగ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ జరుగుతున్న పోలింగ్ విధానాన్ని మైక్రో పరిశీలకులు తమ ల్యాప్‌టాప్‌ల ద్వారా, కలెక్టర్ కార్యాలయంలోని ఎన్‌ఐసీ కార్యాలయంలో జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌బాబు కంప్యూటర్ లైవ్ వెబ్‌కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. ఈ వెబ్ కాస్టింగ్ సిస్టమ్‌ను శనివారం జరిగిన ఉప ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కడా ఏర్పాటు చేయలేదు. కేవలం మన జిల్లాలోని పోసానిపేటలోనే ఏర్పాటు చేశారని డీపీఓ తెలిపారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని కలెక్టర్ ప్రద్యుమ్న ఓ ప్రకటనలో తెలిపారు.
అడవి లింగాల..
ఎల్లారెడ్డి : అడవి లింగాల సర్పంచ్‌గా టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థి పడమటి విమల గెలుపొందారు. ఆమె తన ప్రత్యర్థి బత్తుల పార్వతిపై 106 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. పంచాయతీ పరిధిలో మొత్తం 1,698 ఓట్లుండగా 1,410 ఓట్లు పోలయ్యాయి. విమలకు 747 ఓట్లు రాగా, బత్తుల పార్వతికి 641 ఓట్లు వచ్చాయి. 22 ఓట్లు చెల్లలేదు. సర్పంచ్ పడమటి సావిత్రి అనారోగ్యంతో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. సావిత్రి సోదరి విమల ఈ ఎన్నికల్లో విజయం సాధించారు.
పోసానిపేట్..
సదాశివనగర్ : పోసానిపేట్ సర్పంచ్‌గా టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థి దార రాజవ్వ 1,161 ఒట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. పంచాయతీలో 2,350 ఓట్లుండగా 1,455 మందే ఓటు హక్కు వినియోగించుకున్నారు. దార రాజవ్వకు 1,291 ఓట్లు రాగా ప్రత్యర్థి భూపెల్లి సాయిలుకు 130 ఓట్లు వచ్చాయి. 34 ఓట్లు చెల్లలేదు. గత ఎన్నికల్లో గెలిచిన పోచయ్య అనారోగ్యంతో మరణించడంతో ఈ ఉప ఎన్నిక జరిగింది. ప్రజలు ఆయన భార్యకే పట్టం కట్టారు.
మద్నూర్ మండలంలో..
మద్నూర్ : హండేకేలూర్‌లో గతంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించినప్పుడు 3, 9 వార్డులకు నామినేషన్లు రాకపోవడంతో ఉప ఎన్నికలు నిర్వహిం చారు. మూడో వార్డులో సావిత్రిపై హన్మాబాయి రెండు ఓట్లతో గెలుపొందారు. తొమ్మిదోవార్డులో దృపతిబాయిపై పంచపాల్ 13 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
మేనూర్ పంచాయతీలోని 9, 10, 11, 12 వార్డులకు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. పంచాయతీ పరిధిలోని మారెపల్లి, లచ్మాపూర్‌లలో ఈ వార్డులున్నాయి. అయితే పంచాయతీని విభజించి మారేపల్లి పంచాయతీగా ఏర్పాటు చేయాలని ఈ రెండు గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కొత్త పంచాయతీ ఏర్పాటు చేస్తేనే ఎన్నికల్లో పాల్గొంటామని హెచ్చరిస్తున్నారు.
ఎన్నికల సిబ్బంది నిరసన
సదాశివనగర్ : పంచాయతీ ఎన్నికలు నిర్వహించి ఆరు నెలలవుతున్నా తమకు ఇప్పటి వరకు టీఏ డీఏ చెల్లించలేదని ఎన్నికల సిబ్బంది ఆందోళనకు దిగారు. పోసానిపేట పోలింగ్ కేంద్రం వద్ద సుమారు 20 నిమిషాలపాటు నిరసన తెలిపారు. అక్కడే ఉన్న ఎంపీడీఓ చంద్రకాంత్‌రావు పోలింగ్ సిబ్బంది వద్దకు వచ్చి మాట్లాడారు. జిల్లా అధికారులతో మాట్లాడి టీఏ డీఏ వచ్చేలా చూస్తానని హామీ ఇవ్వడంతో సిబ్బంది ఆందోళన విరమించి, ఎన్నికల విధులు నిర్వహించారు.
కారు జోరు
Published Sun, Jan 19 2014 4:31 AM | Last Updated on Tue, Aug 14 2018 7:49 PM
Advertisement
Advertisement