కళాకారుల వాహనం బోల్తా
- ఇద్దరు మృతి
- మృతులు, క్షతగాత్రులు దారకొండ వాసులు
సీలేరు, న్యూస్‌లైన్ : వారంతా గిరిజన నిరుపేద కుటుంబానికి చెందినవారు. ప్రభుత్వం చేయూత లేక పొట్టకూటి కోసం తమ పాటలనే రూపకాలుగా మలచి ఊరూరూ తిరుగుతూ నాటకాలు వేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కానీ రోడ్డు ప్రమాదం వారి బతుకులపై పిడుగుపాటుగా పరిణమించింది. నమ్ముకున్న కుటుంబాలకు కన్నీటిని మిగిల్చింది. జీకే వీధి మండలం దారకొండ గ్రామానికి చెందిన 40మంది కళాకారుల బృందం ఒడిశాలో ఒక జాతరలో నాటక ప్రదర్శనకు గురువారం సాయంత్రం వ్యాన్‌లో బయలుదేరారు.
రాష్ట్ర సరిహద్దు దాటాక ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా వర్కిల్ సమీపంలో వీరి వాహనం ప్రమాదానికి గురయింది. ఎదురుగా సైకిల్‌పై వస్తున్న బాలుడిని తప్పించే ప్రయత్నంలో వ్యాన్ బోల్తాపడింది. వాహనం సైకిల్‌పై వస్తున్న బాలుడిపైనే పడడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. జీపులో ప్రయాణిస్తున్న గోపి కూడా దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో 30మందికి తీవ్రగాయాలు కావడంతో మల్కన్‌గిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరు అక్కడ చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు శుక్రవారం ఆస్పత్రికి తరలివెళ్లారు. మృతదేహాలకు ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.
మద్యం మత్తులో పదిహేనేళ్ల డ్రైవర్!
వాహనం నడపడంలో నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని విదితమవుతోంది. 10మంది ప్ర యాణికులు పట్టే టాటా ఏస్ వ్యాన్‌లో 40మం ది కళాకారులు కిక్కిరిసి బయలుదేరారు. అయి తే వాహనం నడుపుతున్న డ్రైవర్‌కు నిండా 15 సంవత్సరాలు లేవని, అతడు మద్యం మత్తులో ఉన్నాడని తెలుస్తోంది. అధ్వానంగా ఉన్న రోడ్డుపై వాహనాన్ని అదుపు చేయలేకపోవడంతో ప్రమాదం జరిగిందని క్షతగాత్రులు తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే వాహన యజమాని, డ్రైవర్ పరారయ్యారు.